ప్రాణం తీసిన ఈత సరదా
ప్రాణం తీసిన ఈత సరదా
Published Mon, Aug 15 2016 7:35 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
మృతుడి తండ్రి మంత్రి ప్రత్తిపాటి గన్‌మెన్
నాదెండ్ల : ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం బలికొంది. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఈ అపశృతి చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గణపవరం గ్రామానికి చెందిన చల్లా వెంకట భార్గవ్ (15) చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తన పాఠశాలలో జెండా పండుగకు వెళ్లకుండా గణపవరంలోని తోటి విద్యార్థులతో కలిసి హైస్కూల్‌లో స్వాతంత్య్ర దినోత్సవానికి హాజరయ్యాడు. అదే పాఠశాలలో ఏడవ తరగతి చదవుతున్న తమ్ముడు జయవర్ధన్, శివయ్య, మణి, శ్రీను, అల్లు ఆనంద్‌తో కలిసి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్కూల్‌లో సందడిగా గడిపారు. అక్కడి నుంచి శివాలయం పక్కనే ఉన్న కుప్పగంజి వాగులో ఈతకు వెళ్లారు. కొందరు లోటు తక్కువగా ఉన్న వాగులో ఈత కొడుతుండగా వెంకట్ భార్గవ్ మాత్రం గట్టుపై వాగులోకి దూకాడు. ఈ క్రమంలో తల భాగం మట్టిలో కూరుకుపోవటంతో ఊపిరాడక మరణించాడు. ఎంత సేపటికి పైకి రాకపోవటంతో స్నేహితులు ఆందోళనకు గురై పక్కనే ఉన్న పెద్దలకు చెప్పారు. వాళ్లు నీటి కుంటలో కూరుకుపోయిన వెంకట్ భార్గవ్ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనతో గణపవరం సీఆర్ క్వారీలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థిని చూడటానికి స్థానికులు అధిక సంఖ్యలో వచ్చారు.
తండ్రి పుష్కర విధుల్లో..
వెంకట్‌భార్గవ్ తండ్రి చల్లా హరిబాబు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వద్ద 2010 నుంచి గన్‌మెన్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి పుష్కర విధుల్లో ఉన్నారు. సమాచారం తెలుసుకుని హుటాహుటిన ఇంటికి చేరుకొని కుమారుడి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా విలపించారు. తల్లి జ్యోతి, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మార్మోగింది. టీడీపీ నాయకులు పలువురు బాలుడి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
అక్రమ తవ్వకాలే కారణం..
ఈ ఏడాది వేసవిలో కుప్పగంజి వాగులో కొంతమంది అక్రమంగా మట్టి తవ్వి విచ్చలవిడిగా గుంతలు తీసేశారు. కొద్ది రోజుల కిందట కురిసిన వర్షాలు, పై నుంచి వచ్చిన నీటితో గుంతలు పూర్తిగా నిండాయి. ఎక్కడ ఏ గుంత ఉందో, ఎంత లోతు ఉందో తెలియని ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే గుంత ఉందని తెలియని విద్యార్థి ఈతకు దిగటం ప్రాణాలమీదకు తెచ్చింది.
Advertisement
Advertisement