సంఘటనా స్థలంలో మృతుని బంధువులు, ప్రజలు , రాజు(ఫైల్)
మందస: వివాహానికి వచ్చి.. సరదాగా స్నేహితులతో గడుపుదామనుకున్నాడు ఆ విద్యార్థి. కానీ, విధి వక్రీకరించింది. ఆనందం పోయి అందని లోకాలకు వెళ్లిపోయాడు. తల్లిదండ్రులను కన్నీటి సంద్రంలో ముంచేశాడు. పెళ్లింట విషాదం మిగిల్చాడు. వివరాలిలా ఉన్నాయి. మందస మండలంలోని బాలిగాం పంచాయతీ వీరభద్ర గ్రామానికి చెందిన చుక్కా జోగారావు కుటుంబం ఒడిశాలోని భువనేశ్వర్‌లో పనిచేస్తోంది. భువనేశ్వర్‌లో చుక్కా జోగారావు, కె.రామారావు అనే కుటుంబాలు ఒకచోట నివశిస్తున్నాయి. జోగారావు కుమారుడు దుర్గారావు వివాహానికి రామారావు కుటుంబాన్ని ఆహ్వానించారు. వీరభద్రలో శుక్రవారం జరుగుతున్న ఈ వివాహానికి రామారావు కుటుంబం వీరభద్ర గ్రామం వచ్చింది.
సాయంత్రం సమయంలో రామారావు కుమారుడు రాజు(17) పొలాల్లో ఉన్న నేలబావిలో స్నేహితులతో కలిసి స్నానానికి దిగాడు. బావి లోతుగా ఉండడంతో మునిగిపోయాడు. ప్రమాదాన్ని చూసిన తోటి స్నేహితులు సమాచారాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. ఈ విషయాన్ని మందస అగ్నిమాపక కేంద్రానికి, పోలీసులకు తెలియజేయడంతో ఎస్‌ఐ యర్ర రవికిరణ్, అగ్నిమాపక సూపర్‌వైజర్ బాడ వల్లభరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో నాలుగు మోటారు ఇంజన్లతో నీరు తోడించారు. మృతదేహం బావి అడుగుకు వెళ్లిపోవడంతో రాత్రి 8.30 గంటల సమయంలో రాజును గుర్తించగలిగి, బయటకు తీశారు. కాగా, మృతదేహాన్ని బయటకు తీయడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా నీటిపిల్లి(గేలం) వేయడంతో మృతుడి ముఖం మీద గాయాలైనట్టు చెబుతున్నారు.
కన్నీరు, మున్నీరైన తల్లిదండ్రులు, బంధువులు
ఒక్కగానొక్క కుమారుడు రాజును తల్లిదండ్రులు కష్టపడి భువనేశ్వర్‌లో ఐటీఐ చదివిస్తున్నారు. వీరభద్ర గ్రామానికి కుటుంబంతో సహా వచ్చారు. పెళ్లి ఇంట బాజా, భజంత్రీలు మోగుతున్న సమయంలో అందరూ ఆనందంగానే గడిపారు. అనుకోని విధంగా రాజు బావిలో పడి మరణించడంతో మృతుని తల్లిదండ్రులు రామారావు, రాములమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని ఆపడం ఎవరితరం కాలేదు. అదేవిధంగా పెళ్లికి వచ్చిన బంధువు మరణంతో అందరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సోంపేట తరలించారు. మందస ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment