తగరపువలస (భీమిలి): రీసు అప్పన్న అలియాస్ శివయ్య పుట్టుకతోనే పోలియో బాధితుడు. నిరక్షరాస్యుడైన ఆయనకు ఎడమచేయి పూర్తిగా లేదు, కుడిచేతికి రెండు వేళ్లు మాత్రమే. ప్రస్తుతం తనకంటూ ఎవరూలేరు. శివయ్య మొదట్లో విద్యుదీకరణ పనులలో సహాయకుడిగా ఉండేవాడు. ఆరేళ్ల క్రితం దాతల సాయంతో భీమిలి మండలం అన్నవరం–అమనాం పంచాయతీల మధ్య బసవపాలెంలో బసవేశ్వరుని పేరుతో శివాలయం నిర్మించాడు. అంతేకాదు శివాలయం నుంచి ప్రతి సోమవారం అన్నదానం చేస్తూ 300 మందికి భీమిలి, తగరపువలసలలో ఆహార పొట్లాలు పంచుతూ ఉంటాడు. ఈతే రాని శివయ్య 15 ఏళ్ల క్రితం నదిని దాటుతుండగా తేలుతూ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి తాను ఈదకపోయినా నీటిపై తేలగలనని రుజువయినట్టు శివయ్య తెలిపాడు.
కాళ్లకు తాడు కట్టుకుని..
సాధారణంగా ఈతకు దిగేవారు కాళ్లతో, చేతులతోనూ ఈదుతుంటారు. కానీ శివయ్య కాళ్లతో కూడా ఈదే అవకాశం లేకుండా తాళ్లతో కట్టేసుకుంటాడు. బావిలో దూకిన తరువాత ఒక్కసారి మునిగి వెంటనే తేలుతుంటాడు. దీంతో శివయ్యలో ఏదో తెలియని రహస్యం ఉందని పలువురు అంటున్నారు. ఈయన నీటిపై తేలితే చూడటానికి పలువురు వస్తుంటారు. నిరక్షరాస్యుడైన శివయ్య తాను నిర్మించిన ఆలయంలో స్వయంగా శివలింగానికి అష్టోత్తరాలు, పూజలు జరిపిస్తుంటాడు.
బావిలోని నీటిపై తేలుతున్న శివయ్య
సాధన చేస్తే నీటిపై తేలవచ్చు
నీటిలో దేనినైనా తేల్చి ఉంచగల శక్తి గాలికి ఉంది. మనకు ఉన్న రెండు ఊపిరితిత్తులు తమ సామర్థ్యంలో 60 శాతం గాలిని మాత్రమే శ్వాస ద్వారా పీల్చుకుంటాయి. ప్రతిరోజూ బోర్లా పడుకుని గట్టిగా గాలి పీల్చుకుని రెండు నిముషాల తరువాత విడుదల చేస్తే ఛాతీ విశాలమవుతుంది. దీంతో మిగిలిన 40 శాతం గాలి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. పూర్వీకులు ఇలా సాధన చేసి ఊపిరి బిగబట్టి నీళ్లపై బాసింపట్లు వేసుకుని కూర్చునేవారు. నీటి ఉపరితలంపై ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకోవడం ద్వారా తేలవచ్చు. నాణెం మునగడానికి, పడవలు తేలడానికి ఇదే సూత్రం పనిచేస్తుంది.
–డాక్టర్ ఎన్.ఎల్.రావు, సీనియర్ వైద్యుడు
కాళ్లకు తాడు కట్టుకుని బావిలో శివయ్య
బావిలో నిలువుగా శివయ్య
Comments
Please login to add a commentAdd a comment