sword fighting
-
మంత్ర ఖడ్గం!
పూర్వం ఉజ్జయినిని మహామల్లుడనే రాజు పాలించేవాడు. ఆయన పేరుకు తగ్గట్టే మహాయోధుడు. అయితే ఆయనకు ఒక చింత ఉండేది. ఒక్కగానొక్క కొడుకు మణిదీపుడు యుద్ధ విద్యలందు ఏమాత్రం ఆసక్తి చూపేవాడుకాదు. రాజ్యాన్ని కాపాడుకోవాలంటే రాజు తిరుగులేని యోధుడై ఉండాలి అని మహామల్లుడు కొడుక్కి ఎంతచెప్పినా ఫలితం ఉండేదికాదు. మణిదీపుడికి కష్టపడి యుద్ధవిద్యలు నేర్వడం ఇష్టంలేదు. చిన్నప్పుడు విన్న కథల్లోలాగ మంత్రఖడ్గాన్ని సంపాదించి దానితో విజయాలను అందుకోవాలని అతను కలలు కంటుండేవాడు. ఒకరోజు.. రాజుగారి దర్శనానికి ఒక సాధువు వచ్చాడు. తన బాధను సాధువుతో చెప్పాడు మహామల్లుడు. ‘దాని గురించి మీరు చింత పడకండి. మణిదీపుడిని నాతో పంపండి. అతని కోరిౖకైన మంత్రఖడ్గాన్ని ఇచ్చి పంపుతాను. కానీ దానిని ఉపయోగించాలంటే కనీస నైపుణ్యం ఉండాలి కదా! దాన్ని కూడా మణిదీపుడికి ఏమాత్రం కష్టంలేకుండా అతి తక్కువ సమయంలో నేర్పించి పంపిస్తాను’ అన్నాడు. మణిదీపుడి ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. ఇటు యుద్ధవిద్యలూ వస్తున్నాయి. అటు తాను కోరుకున్న మంత్రఖడ్గమూ లభిస్తున్నది. ఇంకేం కావాలి! సాధువు వెంట బయలుదేరి ఆశ్రమం చేరాడు. సాధువు తానే మణిదీపుడికి కత్తియుద్ధం నేర్పించడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యపోతున్న మణిదీపుడితో ‘సాధువుకి క్షత్రియవిద్యలు ఎలా తెలుసా అని ఆశ్చర్యపోతున్నావా? నేను వయసులో ఉన్నప్పుడు మనరాజ్య సైన్యంలో పనిచేశాను. వయసయ్యాక ప్రశాంత జీవితం గడపాలని ఆశ్రమం నిర్మించుకున్నాను. అయితే నావద్దకు వచ్చినవారికి కాదనకుండా క్షత్రియ విద్యలు నేర్పిస్తున్నాను’ అన్నాడు. ఆరోజు సాయంత్రం అభ్యాసం అయ్యాక మణిదీపుడి భుజంతట్టి ‘ఎంతో అనుభవం ఉన్నవాడిలా చేస్తున్నావు. నేననుకున్నదానికంటే ముందే యుద్ధవిద్యలు నేర్చుకోగలవు’ అంటూ ప్రశంసించాడు. మణిదీపుడి మీద సాధువు పొగడ్తలు బాగా పనిచేశాయి. ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. యుద్ధవిద్యలు కష్టం అనుకున్నాడు. కానీ అవి తేలికే అని గ్రహించాడు. యుద్ధవిద్యలన్నీ నేర్పి అతనిని తిరిగి రాజధానికి పంపే సమయంలో.. సాధువు మంత్రఖడ్గాన్ని ఇస్తూ ‘ఇది మా పూర్వీకులది. నేను సైన్యంలో పనిచేస్తున్నప్పటి నుండీ నా దగ్గర ఉంది. ఇది నీకు భవిష్యత్‌లో ఉపయోగపడుతుంది’ అన్నాడు. మణిదీపుడు ఆనందంగా రాజ్యం చేరుకున్నాడు. కొడుకు ప్రయోజకుడై వచ్చినందుకు మహామల్లుడు సంతోషించి పట్టాభిషేకం చేశాడు. రాజయ్యాక కూడా మణిదీపుడు రోజూ అభ్యాసం చేయకుండా ఉండలేకపోయేవాడు! కొంతకాలానికి పొరుగున ఉన్న కోసలరాజుకు దుర్బుద్ధి పుట్టింది. బాగా అభివృద్ధి చెందిన ఉజ్జయినిని జయించి తమ రాజ్యంలో కలుపుకోవాలని దాడిచేశాడు. తన వద్ద ఉన్న మంత్రఖడ్గంతో మణిదీపుడు యుద్ధరంగాన చెలరేగిపోయాడు. ఘన విజయం లభించాక సాధువుని కలసి ‘మీరు ప్రసాదించిన మంత్రఖడ్గం వల్ల ఇంతటి విజయం లభించింది!’ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. ‘విజయం ఖడ్గానిది కాదు. నీ నైపుణ్యానిది. యుద్ధవిద్యలంటే ఇష్టంలేని నీవు ఒకసారి వాటిని నేర్చుకోవడం ప్రారంభించాక నీలో ఎక్కడలేని ఆసక్తి కలిగింది. అది సహజం. ఏవిద్య అయినా నేర్చుకోవడం మొదలుపెడితే ఇక దానిని వదలబుద్ధికాదు. ఆ లక్షణమే నీకు యుద్ధంలో విజయం లభించేట్టు చేసింది. ఇందులో మంత్రతంత్రాల ప్రమేయం ఏమీలేదు. నీ మనసులో యుద్ధవిద్యల పట్ల ఆసక్తికలగడానికి నేను మంత్రఖడ్గం అనే అబద్ధం ఆడాను. అది మామూలు ఖడ్గమే! కృషిని నమ్ముకునేవారికి విజయం వెన్నంటే ఉంటుంది. ఈ విషయం ఎప్పుడూ మరిచిపోకు’ అన్నాడు. ఆ సాధువు మణిదీపుడిని వెంటబెట్టుకుని మహామల్లుడి వద్దకు వచ్చాడు. ‘ప్రభూ! మీరు నన్ను మన్నించాలి. మణిదీపుడు యుద్ధవిద్యల పట్ల ఆసక్తి చూపడం లేదని మీరు బాధపడుతున్నారని తెలిసి నేను సాధువుగా మీ వద్దకు వచ్చి మంత్రఖడ్గం పేరుతో మణిదీపుడ్ని ఆకర్షించి యుద్ధవిద్యల్లో ఆరితేరేట్టు చేశాను. ఒకప్పుడు నేను మీ సైన్యంలో పనిచేసి మీ ఉప్పు తిన్నవాణ్ణి. ఆ కృతజ్ఞత కొద్దీ మీ బాధ తీర్చాలని భావించాను. సాధువుగా వచ్చి పరదేశినని అబద్ధం చెప్పాను. నేను చేసిందాంట్లో ఏదైనా తప్పుంటే మన్నించండి’ అన్నాడు సాధువు. దానికి మహామల్లుడు ఆనందిస్తూ ‘మీ స్వామిభక్తి ఆశ్చర్య పరుస్తున్నది. మీలాంటివారు ఆస్థానంలో ఉండాలి. ఇకమీదట మీరు మా ముఖ్య సలహాదారునిగా ఉండి రాజ్యరక్షణలో మీ శిష్యునికి తోడ్పడండి’ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. సాధువు సంతోషంగా అంగీకరించాడు. -డా. గంగి శెట్టి శివకుమార్ -
సమంత అలా...శృతి ఇలా..
-
సమంత అలా...శృతి ఇలా..
ముంబాయి: అందాల భామలు కర్ర సాము, కత్తి యుద్ధ విన్యాసాలతో అభిమానులను తెగ ఎట్రాక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న సమంత కర్ర సాముతో ఆకట్టుకుంటే, శృతిహాసన్ కత్తి ఫైట్‌తో వార్తల్లోనిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెకకునున్న చారిత్రాత్మక సినిమా ‘సంఘమిత్ర’లో లీడ్ రోల్‌కు ఎంపికైన శృతి పూర్తిగా సినిమా మూడ్‌లోకి మారిపోయినట్టు కనిపిస్తోంది. నిపుణుల సమక్షంలో కత్తి యుద్ధం, మల్ల యుద్ధం వంటివి బాగా ప్రాక్టీసు చేస్తోంది. దీనికి సంబంచిన ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఈ అమ్మడు. మార్షల్ ఆర్ట్స్ నా జీవితంలో భాగం అయినప్పటికీ, ఈ ప్రాజెక్టుకోసం కత్తి ఫైటింగ్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. సంఘమిత్ర సినిమా కోసం కత్తి పోరాటాలను నేర్చుకుంటూ మానసికంగా రడీ అవుతోంది. ఈ సినిమాలో యువరాణిగా అలరించనున్న శృతి ప్రత్యేకంగా లండన్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది. లండన్ లో పేరొందిన యాక్షన కొరియోగ్రాఫర్ ప్రొఫెషనల్ కత్తి యుద్ధ ఎక్స్పర్ట్ ఈమెకు శిక్షణ ఇస్తున్నారట. హిస్టారికల్ మూవీ ‘సంఘమిత్ర’ కోసం ఈ కత్తి యుద్ధం నేర్చుకోవడంతో ఆనందంగా ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో అటు అభిమానులను, సినీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ వీడియో వైరల్ అయింది. మెగా బడ్జెట్ తో సుందర్ సి నిర్మాతగా రానున్న ఈ ట్రై-లింగ్వల్ మూవీలో శృతి యువరాణి పాత్ర పోషించనుంది. ఇంకా ఆర్య, జయం రవి హీరోలుగా నటించనున్న ఈ చిత్రం 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతుంది. శ్రీ తేన్నందర్ ఫిల్మ్స్ పతాకంపై తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మొత్తం 11 దేశాల్లో సంఘమిత్ర చిత్రీకరణ జరగనుందని టాక్. -
కత్తి యుద్ధానికి సై అంటుంది
ప్రముఖ నటి హన్సిక కత్తి పట్టుకుని కదనరంగంలోకి దూకి శత్రువులపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతుంది. అందుకోసం క్షణం తీరిక లేకుండా ఆమె కత్తి యుద్ధాన్ని ప్రాక్టీసు చేస్తుంది. హాంకాంగ్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన నిపుణుల వద్ద శిక్షణ తీసుకుంటుందని సమాచారం. విజయ్ హీరోగా హన్సిక, శ్రీదేవిలతో ఫాంటసీ నేపథ్యంతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చకచక సాగుతుంది. ఆ చిత్రంలో హన్సిక యువరాణి పాత్ర పోషిస్తుంది. కత్తి పట్టుకుని యుద్ధం చేయడం తనకు ఎంతో ఎక్సైటింగ్‌గా ఉందని హన్సిక ట్విట్ చేసింది. శింబు దేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే అంబాలాలో కొంతభాగం షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరికొంత భాగం పొలాచ్చిలో షూటింగ్ జరగనుంది. ఆ తర్వాత చెన్నైలో షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రంలోని పాటలు, కొన్ని సన్నివేశాలను జోర్డాన్, ఇటలీ, జర్మనీ దేశాలలో చిత్రీకరిస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. చిత్రసీమలోనే మైలురాయిగా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని నిర్మించాలని శింబు దేవన్ సంకల్పంతో ఉన్నారు.