విశ్రాంత ఐఏఎస్ శాంబాబ్‌కు భారీ ఊరట
సీబీఐ నమోదు చేసిన చార్జిïషీట్ కొట్టివేత
ఉమ్మడి హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్ : జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి శాంబాబ్‌కు ఉమ్మడి హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూముల కేటాయింపునకు సంబంధించి అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శాంబాబ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. శాంబాబ్ ఐఏఎస్ అధికారిగా పదవిలో ఉన్న సమయం లోనే ఆయన విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని నిరాకరించాయని, ఆ తరువాత ఆయన పదవీ విరమణ చేశారని, అందువల్ల ఆయనను ఇప్పుడు విచారించడా నికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామ మూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు. ‘ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండి, అతని విచారణకు ప్రభుత్వాలు అనుమతిని నిరాక రిస్తూ ఉత్తర్వులు జారీచేసినప్పుడు, ఆ ఉత్తర్వులను దర్యాప్తు సంస్థలు సవాలు చేయని పరిస్థితుల్లో, ఆ ఉత్తర్వులు ఫైనల్ అయితే ఆ ప్రభుత్వ ఉద్యోగిని విచారించడానికి వీల్లేదు’ అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయ మూర్తి తన 19 పేజీల తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించారు. సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ శాంబాబ్ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల తుది విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి శుక్రవారం ఉదయం తీర్పునిచ్చారు.
సర్వీసులో ఉండగానే ఉత్తర్వులిచ్చాయి...
‘సీబీఐ నమోదు చేసిన కేసులో అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) సెక్షన్–19 కింద శాంబాబ్ విచారణకు అనుమతిని నిరాకరిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13.2.2014న జీవో 604 జారీ చేసింది. తరువాత సీబీఐ కేంద్ర ప్రభుత్వ అనుమతిని కోరింది. సీబీఐ సమర్పించిన రికార్డులను పరిశీలించిన కేంద్రం దీనిపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సలహాతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కామెంట్లు కోరింది. సీవీసీ అభిప్రాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కామెంట్లను, సీబీఐ రికార్డులను కూడా పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం తమ ముందున్న ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే శాంబాబ్‌పై ఎటువంటి కేసు లేదని స్పష్టం చేసింది.
విచారణకు అనుమతిని నిరాకరిస్తూ 23.3.2016న ఉత్తర్వులు జారీచేసింది. కాగా, కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు ముందు సీబీఐ సవాలు చేయలేదు. దీంతో కేంద్రం జారీచేసిన ఉత్తర్వులు ఫైనల్ అయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణకు అనుమ తిని నిరాకరించిన తరువాత ఆయన పదవీ విరమణ చేశారు. ఈ పరిస్థితుల్లో పదవీ విరమణ చేసిన ప్రభుత్వోద్యోగిని విచారించ డానికి వీల్లేదు. సుప్రీంకోర్టు సైతం ఇదే విషయాన్ని చెబుతూ తీర్పునిచ్చింది. ఆ తీర్పు శాంబాబ్‌కు సైతం వర్తిస్తుంది. పదవీవిరమణ చేసిన ఉద్యోగి విచారణకు ఎటువంటి అను మతి అవసరం లేదు.
ఆ రిటైర్డ్ ఉద్యోగిపై నమోదైన కేసును సంబంధిత కోర్టు విచారణ నిమిత్తం పరిగణన లోకి తీసుకోవచ్చు. విచారణకు స్వీకరించే సమయానికి సర్వీసులో ఉంటే తప్ప నిసరిగా పీసీ యాక్ట్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. ఇదే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని శాంబాబ్.. తనపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను కొట్టేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అతని అభ్యర్థన, పరిగణనలోకి తీసుకోవడానికి అర్హమైనది’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం చెప్పిందిదీ...
‘అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు చేసిన 8841 ఎకరాల భూమి కేటాయింపులన్నీ కూడా బిజినెస్ రూల్స్, ఇతర నిబంధనల మేరకే జరిగాయి. ఈ కేటాయింపులన్నీ శాఖల ను సంప్రదించిన తరువాతనే జరిగాయి. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, సీఎం ఆమోదం తరువాతనే లేపాక్షి నాలెడ్జ్ హబ్‌తో ఒప్పందం జరిగింది. అప్పటి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఈవ్యవహారంలో అప్పటి పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి శాంబాబ్ ఎక్కడా కూడా వ్యక్తిగత ప్రయోజనాలు పొందలేదు. ఆయన చర్యలు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రావు. అందువల్ల అతని విచారణకు అనుమతినివ్వడం సాధ్యం కాదు.’ అని కేంద్రం తేల్చి చెప్పింది.