‘అస్తమా’నం ఏసీ వద్దు
- అతి చల్లదనం ప్రమాదకరం
- రోగాల బారినపడే ప్రమాదం
- కాస్త చల్లగా ఉంటే చాలు
- జాగ్రత్తలు అవసరమంటున్న వైద్యులు
శాతవాహన యూనివర్సిటీ, న్యూస్‌లైన్: ఒకప్పుడు ఎయిర్ కండీషనర్ అంటే విలాసం. సంపన్నులకు మాత్రమే సాధ్యమైన ఆహ్లాదం. ఇప్పుడు అది ఓ అవసరం. ఇల్లు.. ఆఫీసులు, షాపింగ్‌మాల్స్, ప్రయాణించే బస్సులు, ఏటీఎం సెంటర్లు.. ఇలా అడుగుపెట్టిన ప్రతి చోటా అదే. సంపన్నులతో పాటు ఇప్పుడు సగటు మధ్య తరగతి జీవి, దిగువ తరగతి వారిని ఏసీ ‘చల్లగా’ చేరుకుంటోంది. అయితే ఎక్కువ సేపు ఏసీలో ఉండటం ప్రమాదకరమంటున్నారు వైద్యులు ఎండబారిన పడకుండా జాగ్రత్త పడడం ఎంత అవసరమో... ఏసీతో కలిగే నష్టాలపై అవగాహన పెంచుకోవడం అంతే అవసరమని పేర్కొంటున్నారు.
ఆధునిక పరిస్థితులు మనిషిని రోజు రోజుకు సుకుమారంగా మారుస్తున్న నేపథ్యంలో వాతావరణ మార్పులకు తట్టుకోవడం కష్టంగా మారుతోంది. వాతావరణ మార్పుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి మనిషి విభిన్న రకాల ఉత్పత్తులను సృష్టించుకుంటూ.. ప్రకృతిని ఢీకొడుతున్నాడు. అదే కోవలోనే ఆవిర్భవించిన ఎయిర్ కండీషనర్ ఇప్పుడు నిత్యావసరంగా మారిపోయింది. విపరీతమైన శారీరక, మానసిక శ్రమ మనల్ని నిస్సత్తువకు గురిచేయకుండా ఎయిర్ కండీషనింగ్ సౌకర్యం నివారిస్తుంది. చెమట పోయడం వంటి చికాకులకు చెక్ పెడుతుంది. అదే సమయంలో దీని వల్ల న ష్టాలు లేకపోలేదు.
ఇవీ సమస్యలు...
- ఏసీపై పేరుకుపోయే దుమ్ము ధూళి కారణంగా ఫంగస్ వ్యాపించి ఎలర్జీలు రావచ్చు.
- కాంటాక్ట్‌లెన్స్ వినియోగిస్తున్నవారికి, కంటి వ్యాధులున్న వారికి, ఆస్తమా రోగులకు ఏసీ కారణంగా సమస్య పెరిగే అవకాశం ఉంది.
- అధిక సమయం ఏసీలో ఉండడం వల్ల ఆకస్మిక జలుబు, ముక్కు నుంచి నీరు కారడం, శ్యాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ.
- చర్మంపై దుష్ర్పభావం చూపించవచ్చు.
ఇవీ జాగ్రత్తలు
- ఏసీ అమరిక నిర్వహణ సరైన విధంగా ఉండాలి
- ఇంట్లోని ఏసీని మరే సీజన్లోనూ వాడకుండా వేసవిలో మాత్రమే వినియోగించ డం చాలా మందికి అలవాటు. ఇలాంటి వారు వినియోగానికి ముందు ఒకసారి టెక్నీషియన్‌కు చూపించడం మంచిది.
- గది ఉష్ణోగ్రత మరీ చల్లగా కాకుండా 22 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాలి. గాలిలో సగటు తేమ శాతం 60 నుంచి 70 శాతానికి మధ్య ఉండాలి
- వాతావరణంలో అకస్మాత్తుగా ఏర్పడే హెచ్చుతగ్గులు దేహంపై దుష్ర్పబావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఒక అన్‌క్రషబుల్ జాకెట్‌ను దగ్గర ఉంచుకోవాలి. తీవ్రమైన ఎండ నుంచి అత్యంత చల్లని ఎయిర్ కండీషన్డ్ రూంలోకి వెళ్లే ముందు ఇది ధరిస్తే.. అకస్మాత్తుగా వచ్చే వాతావరణ మార్పులను తట్టుకోవచ్చు.
- టెంపరేచర్ 20 నుంచి 40 డిగ్రీలకు మారిన సమయంలో వడదెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సన్‌స్క్రీన్ లోషన్ వినియోగించడం మంచిది.
- ఎక్కువగా ఏసీలో ఉండే వారు దాహం వేయడం లేదని అనుకోకుండా కొబ్బరి నీళ్లు, మంచి నీరు తీసుకుంటూ ఉండాలి.
అతిగా వాడితే అనర్థమే...
వేసవి కాలంలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం ఏసీ వాడటం చల్లదనమే కానీ..దానిని అతిగా ఉపోయగించడం అనర్థాలకు దారితీస్తుంది. ఏసీని ఉపయోగించడమే కాదు..దానిని రెగ్యూలర్‌గా సర్వీసింగ్ చేరుంచాలి. లేదంటే దానిలో ఫంగస్ పేరుకుపోరు శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నారు. బ్రాండెడ్ కాకుండా వాడితే అనేక దుష్పరిణామాలు.
కొన్ని ఏసీలు వాతావరణంలోని మలినాలను వేరుచేసి స్వచ్ఛమైన గాలి అందించే విధంగా మార్కెట్లోకి వచ్చారు. అలాంటివే మేలు. శ్వాసకోస వాధులు ఉన్నవారైతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పెద్దవారైనా...చిన్న పిల్లలైనా జాగ్రత్తలు తప్పనిసరి. ఏసీ ఆటో ఆఫ్‌లో ఉండి గది ఉష్ణోగ్రతను సమాన స్థారులో ఉంచేదిగా ఉండాలి. ఈ విధానం చాలా మంచిది.
-డాక్టర్ విజయేందర్‌రెడ్డి, కరీంనగర్