గూగుల్ చేతికి సినర్జీస్ స్టార్టప్
2013లో ప్రారంభించిన వరుణ్ మల్హోత్రా
న్యూయార్క్: భారత సంతతి వ్యాపారవేత్త, వరుణ్ మల్హోత్రాకు సంబంధించిన బిజినెస్ టెక్నాలజీ స్టార్టప్.. సినర్జీస్ ట్రైనింగ్‌ను సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కొనుగోలు చేసింది. సినర్జీస్ పేరుతో ఉన్న ఈ స్టార్టప్‌ను వరుణ్ మల్హోత్రా 2013లో ప్రారంభించారు. గూగుల్ యాప్స్‌ను ఎలా ఉపయోగించుకోవాలో శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా ఈ స్టార్టప్‌ను అందుబాటులోకి తెచ్చారు. టొరంటో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఈ స్టార్టప్ కొనుగోలు డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను గూగుల్ వెల్లడించలేదు.
క్లౌడ్ ఆధారిత కమ్యూనికేషన్స్ అందించేలా జీమెయిల్, క్యాలెండర్, డ్రైవ్, డాక్యుమెంట్స్‌తో కూడిన గూగుల్ యాప్స్ ప్రొడక్ట్ సూట్‌ను ప్రస్తుతం 20 లక్షలకు పైగా వ్యాపార సంస్థలు, వాటి వినియోగదారులు వినియోగించుకుంటున్నారని గూగుల్ యాప్స్ సీనియర్ డెరైక్టర్(కార్యకలాపాలు) పీటర్ స్కాసిమర పేర్కొన్నారు.
మరిన్ని వ్యాపార సంస్థలు ఈ గూగుల్ యాప్స్ సూట్‌ను వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని, ఈ సంస్థలు, ఈ సంస్థల వినియోగదారులకు వీటిని ఎలా వినియోగించుకోవాలో తెలిపే శిక్షణ ఆఫర్ల కోసం చూశామని పేర్కొన్నారు. దీనిని నెరవేర్చడానికి సినర్జీస్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో గూగుల్ యాప్స్‌లో ఒక భాగంగా సినర్జీస్ను అందిస్తామని పేర్కొన్నారు.