ఆకలి అంటే తెలుసా?
ట్రంప్‌ను ప్రశ్నించిన సిరియా బాలిక
డమాస్కస్: శరణార్థులను అమెరికాలోకి ప్రవేశించ నీయకూడదన్న నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్‌ను సిరియాకు చెందిన ఓ చిన్నారి ట్విటర్ ద్వారా నిలదీసింది. అలెప్పోలో తమ దుర్భర జీవితం గురించి ట్వీట్ చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఏడేళ్ల బానా అలాబెద్ తాజాగా ఓ వీడియో ద్వారా ట్రంప్‌ను ప్రశ్నించింది. ‘మిస్టర్ ట్రంప్.. మీరెప్పుడైనా 24 గంటలపాటు ఆహారం తీసుకోకుండా, నీరు తాగకుండా ఉన్నారా?.. ఒక్కసారి సిరియా శరణార్థులు, చిన్నారుల గురించి ఆలోచించండి’ అని అలాబెద్ ప్రశ్నించింది. అయితే నిషేధాన్ని సమర్థించుకుంటూ చెడ్డవారిని అమెరికాకు బయటే ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని ట్రంప్ గతంలో ట్వీట్ చేశారు.
దీనిపై స్పందించిన అలాబెద్.. ‘నేను ఉగ్రవాదినా?’ అని ట్వీటర్ ద్వారా ట్రంప్‌ను ప్రశ్నించింది. ‘డియర్ ట్రంప్.. శరణార్థులను నిషేధించడం చాలా చెడు విషయం. సరే.. ఒకవేళ ఇది మంచిదే అయితే.. నా దగ్గర ఓ ఆలోచన ఉంది. ఇతర దేశాలన్నింటినీ శాంతియుతంగా మార్చండి’ అంటూ అలాబెద్ ట్విటర్లో సూచించింది. అలెప్పోలో తమ దుర్భర పరిస్థితిని తన తల్లి ఫాతిమా సహాయంతో ట్విటర్ ద్వారా ప్రపంచానికి అలాబెద్ తెలియజేస్తోంది.