స్టార్టప్స్‌కు బాసటగా తెలంగాణ ప్రభుత్వం
♦ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
♦ వ్యయాల్లో కొంత భరించాలని యోచన
హైదరాబాద్, బిజినె స్ బ్యూరో : దేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్ టి-హబ్‌ను ఏర్పాటు చేసి స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మరింత మంది ఔత్సాహికులకు బాసటగా నిలవాలని నిర్ణయించింది. అద్దె, విద్యుత్ చార్జీలు, ఇంటర్నెట్ వ్యయాల్లో కొంత మొతాన్ని భరించాలని యోచిస్తున్నట్టు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) వెల్లడించారు. టి-హబ్ వెలుపల ఉన్న ఇతర ఇంక్యుబేటర్లు, కార్యాలయాల్లోని స్టార్టప్స్‌కు తోడ్పాటు అందించి వాటి అభివృద్ధిలో పాలుపంచుకుంటామని చెప్పారు. గచ్చిబౌలిలో జేడ్ గ్లోబల్ ఏర్పాటు చేసిన డెవలప్మెంట్ సెంటర్‌ను శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీ ఎస్ఎంఈల కోసం ఎస్ఎంఈ టవర్‌ను గచ్చిబౌలిలో నెలకొల్పుతామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 50 ఎకరాల్లో ఏర్పాటు కానున్న డేటా అనలిటిక్స్ పార్కులో ఫ్రాక్టల్ అనలిటిక్స్ యాంకర్ యూనిట్‌గా వస్తోందని చెప్పారు.
రంగాల వారీగా పునరుద్ధరణ..: ఖాయిలాపడ్డ కంపెనీలను రంగాల వారీగా పునరుద్ధరించనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఫెర్రోఅల్లాయ్ పరిశ్రమలకు విద్యుత్ చార్జీల్లో డిస్కౌంట్ ఇచ్చి ఆదుకున్నామని గుర్తు చేశారు. మైనింగ్, స్పిన్నింగ్ రంగ కంపెనీలు కూడా ప్రభుత్వ సాయం కోసం చూస్తున్నాయన్నారు. ‘ఔటర్‌కు లోపల కాలుష్యాన్ని వెదజల్లే 1,234 కంపెనీలను రెడ్, ఆరెంజ్ కేటగిరీలో గుర్తించాం. దశలవారీగా రంగాన్నిబట్టి ఈ కంపెనీలను ఓఆర్ఆర్ వెలుపలకు పంపిస్తాం. మౌలిక వసతులు ఉంటే కంపెనీలు తరలి వెళ్తాయని, కాబట్టి పీపీపీ విధానంలో పారిశ్రామిక పార్కులను ప్రోత్సిహ స్తామని అన్నారు. ఎస్ఎంఈలకు రుణ సాయం..
హైదరాబాద్‌లోని 1,300లకుపైగా ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల్లో 90 శాతం ఎస్ఎంఈలే. మొత్తం 4 లక్షల మందికిపైగా ఉద్యోగుల్లో 2.5 లక్షల మంది ఈ ఎస్ఎంఈల్లో పనిచేస్తున్నారు. అవసరమైనన్ని నిధుల సేకరణ లో ఈ రంగ కంపెనీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వీటి వృద్ధికి నిధుల లేమి అడ్డంకిగా మారింది. ఈ కంపెనీలకు ఆర్థిక సహాయం అందించే విషయమై కోటక్ మహీంద్రా, సిడ్బీతో చర్చించినట్టు కేటీఆర్ తెలిపారు. ప్రైవేటు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుంచి ఈ కంపెనీలకు తనఖా లేని రుణం ఇప్పించాలన్నది ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.
హైదరాబాద్‌లో జేడ్ గ్లోబల్..
యూఎస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ కంపెనీ జేడ్ గ్లోబల్ హైదరాబాద్‌లో డెవలప్మెంట్ సెంటర్‌ను గచ్చిబౌలిలో నెలకొల్పింది. ఇప్పటికే కంపెనీకి యూఎస్, యూకేతోపాటు పుణే, నోయిడాలో ఆఫీసులున్నాయి. తమ సంస్థలో 550 మంది పనిచేస్తున్నారని కంపెనీ సీఈవో వై.కరణ్ ఈ సందర్భంగా తెలిపారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 50 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సంఖ్యను డిసెంబరుకల్లా 100కు చేరుస్తామని చెప్పారు.