దమ్ముంటే బాబుతో లేఖ ఇప్పించండి
నిడ్జింత(మద్దూరు): పాలమూరు జిల్లాను సస్యశామలం చేయడానికి కేసీఆర్ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడ్డుపడుతున్న చంద్రబాబుచే ఈప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ అడ్డుకాదని కేంద్రానికి, కృష్ణ ట్రిబ్యూనల్‌కు లేఖ ఇప్పించాలని టీటీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి జూపల్లి సవాల్ విసిరారు. గురువారం మండలంలోని నిడ్జింతలో నిర్వహించిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రా పాలకుల చేతిలో వెనుకబడిన పాలమూరును సస్యశామలం చేయడానికి *35వేల కోట్లతో వచ్చే నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేసీఆర్ కంకణం కట్టుకంటే, ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టరాదని కేంద్రానికి లేఖలు రాశారని మండిపడ్డారు.
దీన్ని అడ్డుకోవడానికి కేంద్రంలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికీ తెలుసన్నారు. ఇలాంటి పార్టీలను తెలంగాణలో ఉండడం అవసరమా అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణలో భాగంగా కొడంగల్‌లో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన అరగంట అలస్యం అయితే ఇక్కడ ఉన్న ఎమ్యెల్యే ఇంత రాద్ధాంతం చేయడం ఏమిటన్నారు. తెలంగాణ ఏర్పడటాన్ని అడ్డుకున్న చంద్రబాబు పార్టీలో కొనసాగుతూ బంగారు తెలంగాణ కోసం నిరంతరం కృషి చేస్తున్న టీఆర్ఎస్పై లేనిపోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడం మానుకోవాలని పరోక్షంగా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు.
ఏడాదిలో జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల కోసం *970 కోట్లతో పనులు పూర్తి చేసి వచ్చే ఏడాదికి దాదాపు 8లక్షల ఎకరాలకు నీరందిస్తామన్నారు. వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి *100 కోట్లు, పాలమూరు ప్రాజెక్టు నుంచి లక్షా ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. నిరుపేదలకు *5 లక్షలతో దాదాపు 2000వేల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. నిడ్జింతకి గ్రామజ్యోతిలో భాగంగా వచ్చే నాలుగేళ్లలో రూ.3.21కోట్లు కేటాయించామన్నారు. ఎవరికీ వత్తాసు పలకరాదని, పార్టీలకతీతంగా పని చేయాలని ఎంపీడీఓ సిద్రామప్ప, తహశీల్దార్ చంద్రశేఖర్లకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, టీఆర్ఎస్ నేతలు శివకుమార్‌రెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, సర్పంచ్ రాజశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.