యవ 'రాజ్' కొట్టేనా
చాంపియన్స్ లీగ్‌తో దాదాపు మూడు వారాల పాటు టి20 సందడి కొనసాగింది. అయితే ఎన్ని మ్యాచ్‌లు జరిగినా అది క్లబ్ క్రికెట్ మాత్రమే. రెండు దేశాల మధ్య జరిగే ట్వంటీ20 మ్యాచ్‌కు ఉండే ప్రత్యేకతే వేరు. చాంపియన్స్ లీగ్‌లో మెరిసిన ధోని, రైనా, ధావన్, రోహిత్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఇప్పుడు దేశం తరఫున సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. భారత్, ఆసీస్ ఏకైక టి20 మ్యాచ్ అందుకు వేదిక కానుంది.
రాజ్‌కోట్: జట్టులో ప్రధాన ఆటగాడిగా దశాబ్దానికి పైగా కొనసాగిన తర్వాత స్థానం కోల్పోయిన ఆటగాళ్లు పునరాగమనం చేయడం అంత సులభం కాదు. ఎంతో పట్టుదల, శ్రమ ఉంటే కానీ అది సాధ్యం కాదు. జట్టులో స్థానం దక్కాలంటే దొడ్డిదారిని ఆశ్రయించాల్సిన పనిలేదని యువరాజ్ నిరూపించాడు. ఫ్రాన్స్ వెళ్లి ఫిట్నెస్ మెరుగు పరుచుకోవడం... దొరికిన అవకాశాలని ఉపయోగించుకుని భారీగా పరుగులు చేయడం ద్వారా మళ్లీ రాయల్‌గా జట్టులోకి వచ్చాడు. మరి దీనిని నిలుపుకుంటాడా..? భారత క్రికెట్ అభిమానులందరిలోనూ ఆసక్తి పెంచిన ప్రశ్న ఇది. అందుకే... భారత్, ఆస్ట్రేలియాల మధ్య నేడు రాజ్‌కోట్‌లో జరిగే ఏకైక టి20 మ్యాచ్‌లో అందరి దృష్టి యువరాజ్‌పై ఉంది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగుతోంది.
సొంతగడ్డపై జడేజా తొలిసారి
గత డిసెంబర్లో భారత్ చివరిసారిగా అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత వన్డేల్లో ప్రదర్శన చూస్తే జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ చక్కగా రాణిస్తున్నారు. ఆ తర్వాత కోహ్లి, యువరాజ్, రైనా, ధోని, జడేజా ధాటిగా పరుగులు చేయగల సమర్థులు. దేశవాళీలో చక్కటి ప్రదర్శనతో జట్టులోకి వచ్చిన యువరాజ్ అదే ఫామ్‌ను కొనసాగించాల్సి ఉంది. ఇటీవల ఒక్కసారిగా స్టార్ ఆల్‌రౌండర్‌గా మారిపోయిన రవీంద్ర జడేజా తొలి సారి తన సొంత నగరంలో ప్రేక్షకుల మధ్య అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుండటం విశేషం. బౌలర్లలో అశ్విన్ కీలకం కానున్నాడు. యువరాజ్, జడేజాల లెఫ్టార్మ్ స్పిన్ కూడా ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. పేసర్లుగా భువనేశ్వర్, ఇషాంత్‌లకు చోటు ఖాయం. మరో పేసర్‌గా వినయ్ కుమార్‌కు లేదా వైవిధ్యం కోసం లెగ్‌స్పిన్నర్ అమిత్ మిశ్రాలకు తుది జట్టులో స్థానం లభించవచ్చు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉండటంతో అంబటి రాయుడుకు దాదాపు అవకాశం లేనట్లే.
ఫించ్, వాట్సన్ కీలకం...
భారత్‌తో పోలిస్తే ఆసీస్ జట్టులో కొత్త ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. అయితే టి20 స్పెషలిస్ట్‌లతో పాటు భారత గడ్డపై ఇటీవలే ఎక్కువ క్రికెట్ ఆడిన ఆటగాళ్లు ఉండటం ఆ జట్టు బలం. టి20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆరోన్ ఫించ్ చెలరేగితే భారత్‌కు కష్టాలు తప్పవు. అదే తరహాలో షేన్ వాట్సన్ కూడా ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సమర్థుడు. సీఎల్‌టి20 ఫైనల్లో ఆకట్టుకున్న ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ కూడా జట్టులో ఉన్నాడు. కెప్టెన్ బెయిలీ, కొత్త కుర్రాడు మాడిసన్‌పై ఆ జట్టు బ్యాటింగ్ ఆధారపడి ఉంది. బౌలింగ్‌లో మిచెల్ జాన్సన్, ఫాల్క్‌నర్, కౌల్టర్, మెక్కే...ఇలా ఎక్కువ మంది పేసర్లే ఉన్నారు. డోహర్తి ఒక్కడే స్పెషలిస్ట్ స్పిన్నర్. ఈ ఏడాది ఆరంభంలో భారత్ చేతిలో 0-4 తేడాతో టెస్టు సిరీస్ చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా ఈ పర్యటననైనా విజయంతో ఆరంభించాలని భావిస్తోంది. భారత గడ్డపై ఆసీస్ గతంలో ఒకే ఒక్క టి20 మ్యాచ్ (2007లో) ఆడి ఓడిపోయింది.
వాన గండం!
భారత్, ఆస్ట్రేలియా టి20 మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం కూడా ఉంది. గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో భారీగా వానలు కురుస్తున్నాయి. గురువారం కూడా వర్షం పడవచ్చని అక్కడి వాతావరణ శాఖ నివేదిక చెబుతోంది. యువీకి ఈ మ్యాచ్ ఎంతో కీలకమని మాకు తెలుసు. కాబట్టి అతనిపై అదనపు భారం లేకుండా, ఒత్తిడి పెంచకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాం. మా జట్టు చాలా పటిష్టంగా ఉంది. అయితే ఆస్ట్రేలియా కూడా ఆల్‌రౌండర్లతో సమతూకంగా కనిపిస్తోంది. జడేజా టి20ల్లో అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడనేది వాస్తవం. అయితే అతడి బౌలింగ్‌ను మేం సరైన విధంగా మేం ఉపయోగించుకోవాల్సి ఉంది. వాతావరణం గురించి మ్యాచ్‌కు గంట ముందు మాత్రమే ఆలోచిస్తాం. క్రికెట్లో ఏ ఫార్మాట్ ప్రత్యేకత దానికి ఉంది. ప్రతీదానిపై మరో ఫార్మాట్ ప్రభావం ఉంటుంది. అందుకే అన్నింటినీ మనం గౌరవించాలి. నాకు మాత్రం మూడూ ఆడటం ఇష్టమే
- ఎం.ఎస్.ధోని, భారత కెప్టెన్
ఇప్పటివరకూ ఆస్ట్రేలియాతో ఆడిన ఏడు
టి20 మ్యాచ్‌ల్లో భారత్ మూడు గెలిచి,
నాలుగు ఓడిపోయింది.
ఆస్ట్రేలియా జట్టు గత రెండేళ్లుగా కాస్త వెనుకబడినా మాలో పోరాట స్ఫూర్తి ఏ మాత్రం తగ్గలేదు. జట్టులో అనుభవానికి కొరత ఉంది. కానీ కొత్త కుర్రాళ్లు తమ సత్తా చూపాలని పట్టుదలగా ఉన్నారు. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగల ఆటగాళ్లు మాలో చాలా మంది ఉన్నారు. టి20ల్లో ఫేవరెట్ అంటూ ఎవరూ ఉండరు. ఒక్క ఇన్నింగ్స్ మ్యాచ్‌ను మలుపు తిప్పుతుంది - జార్జ్ బెయిలీ, ఆస్ట్రేలియా కెప్టెన్
జట్లు (అంచనా):
భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, యువరాజ్, రైనా, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, ఇషాంత్, మిశ్రా/ వినయ్.
ఆస్ట్రేలియా: బెయిలీ (కెప్టెన్), ఫించ్, మాడిసన్, వాట్సన్, హెన్రిక్స్, మ్యాక్స్‌వెల్, హాడిన్, జాన్సన్, మెక్కే, డోహర్తి, ఫాల్క్‌నర్/కౌల్టర్.