నిరంతర సాధనతో విజయాలు: నైనా
జింఖానా, న్యూస్‌లైన్: నిరంతర సాధనతోనే ఎవరికైనా విజయాలు లభిస్తాయని టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జైస్వాల్ తెలిపింది. సాధనతో పాటు గురువు పట్ల గౌరవం ఉంటేనే అనుకున్నది సాధిస్తామని చెప్పింది. శ్రీవైష్ణవి ఒలంపియాడ్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయింది.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం కార్యదర్శి అశ్విన్ కుమార్, నైనా సోదరుడు అగస్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ‘పిల్లలందరూ ఒకే స్థాయిలో జ్ఙాపక శక్తి కలిగి ఉంటారు. వారికి సరైన శిక్షణ అవసరం.
దాని ద్వారానే వారు ఏ రంగంలోనైనా ముందుకు వెళ్లగలరు. అయితే విజయం మాత్రం నిరంతర సాధన, విద్య నేర్పే గురువు పట్ల గౌరవం అనే రెండు సూత్రాలను పాటిస్తేనే సాధ్యపడుతుంది’అని చెప్పింది. అనంతరం నైనా జైస్వాల్‌ను శ్రీవైష్ణవి ఒలంపియాడ్ స్కూల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ సత్కరించారు.