ముంబై పేలుళ్ల కేసు.. జడ్జిమెంట్ డే
ముంబై: మారణహోమం సృష్టించి వందల మంది ప్రాణాలను బలితీసుకున్న ముంబై పేల్లుళ్ల కేసు నిందితులకు శిక్షలు ఖరారు చేసేందుకు టాడా(ఉగ్ర కార్యకలపాల నిరోధక చట్టం) ప్రత్యేక న్యాయస్థానం సిద్ధమయ్యింది. గ్యాంగ్ స్టర్ అబూ సలేంతో సహా ఐదుగురికి సెప్టెంబర్ 7న శిక్షలు ఖరారు చేయనున్నట్లు సమాచారం.
పేలుళ్ల కేసులో ఆరుగురిని నిందితులుగా పేర్కొంటూ జూన్ 16, 2017న కోర్టు తీర్పు వెలువరించింది. ముస్తఫా డొస్సా, అబూ సలేం, కరీముల్లా ఖాన్, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్, రియాజ్ సిద్ధిఖీ మరియు తహీర్ మర్చంట్లను దోషులుగా పేర్కొంటూ మరో నిందితుడు అబ్దుల్ ఖయ్యూమ్ ను నిర్దోషిగా పేర్కొంది. అయితే శిక్షలు మాత్రం ఖరారు చేయకపోవటంతో వాదనలు ఇంకా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కొద్ది రోజులకే జూన్ 28న ప్రధాన దోషి ముస్తఫా డొస్సా గుండెపోటుతో మృతి చెందాడు.
ఇక మిగిలిన వారి శిక్షలు ఖరారు చేసేందుకు సెప్టెంబర్ 7న ముహుర్తం ఖరారైందని తెలుస్తోంది. నేరపూరిత కుట్ర, ప్రభుత్వం వ్యతిరేకంగా యుద్ధానికి పిలుపునివ్వటం, హత్య నేరాలు వారిపై రుజువు అయ్యాయి. తుది తీర్పు సమయంలో దోషుల శిక్ష విషయంలో క్షమాగుణం ప్రదర్శించకుండా కఠిన శిక్షలు ప్రాసిక్యూషన్ కోరింది కూడా. ముస్తాఫాతో సహా నలుగురికి మరణశిక్షలు, అబూతోపాటు రియాజ్ కు జీవిత కాల ఖైదు విధించాలని విజ్నప్తి చేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి శిక్షలు విధించబోతున్నారన్న ఆసక్తి నెలకొంది. మార్చి 12,1993 న జరిగిన పేలుళ్లలో సుమారు 275 మంది ప్రాణాలు బలితీసుకున్న ఈ మారణకాండపై తుదితీర్పు 2300-2400 పేజీలతో కోర్టు సిద్ధం చేయటం విశేషం.