tadband
-
తాడ్బంద్ దేవాలయంలో ముష్కరులు..
కంటోన్మెంట్ (బోయిన్పల్లి) : ‘నిత్యం వేలాది మంది భక్తులు సం దర్శించే తాడ్బంద్ దేవాలయంలోకి ఆదివారం రాత్రి ముష్కరులు చొరబడ్డారు!! సమాచారం అందుకున్న వెంటనే ఆక్టోపస్, సిటీ సెక్యూరిటీ గార్డ్స్ బృందాలతో పాటు, బోయిన్పల్లి పోలీసుల బృందం ఆలయాన్ని చుట్టుముట్టింది. వేర్వేరు బృందాలుగా విడిపోయి మెరుపు వేగంతో సమీపంలోని భవనాల మీదుగా దేవాలయం నలుదిక్కులకు చేరారు. అప్పటికే ఆలయం లోపు మాటువేసి ఉన్న ముష్కరుల కదలికలను కనిపెడుతూ ఒక్కొక్కరుగా దేవాలయంలోకి చేరిపోయారు. పోలీసులను ప్రతిఘటిస్తూ తప్పించుకునే ప్రయత్నంలో ఉన్న ముష్కరులను చాకచక్యంగా లొంగదీసుకున్నారు. దీంతో పోలీసులతో పాటు అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు’ ఇదంతా నిజమనుకుంటున్నారు కదూ. అదేం కాదు. అసలేమైందంటే.. సికింద్రాబాద్ తాడ్బంద్ వీరాంజనేయ స్వామి ఆలయంలో బోయిన్పల్లి పోలీసులు, ఆక్టోపస్, సిటీ సెక్యూరిగార్డ్స్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన మాక్ డ్రిల్ ఇది. ఆక్టోపస్ డీఎస్పీ వీరరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్‌డ్రిల్ మొత్తం 100 మందికిపైగా పోలీసులు పాల్గొన్నారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో సందర్శించే షాపింగ్ మాల్స్, ప్రార్థనాలయాలు, ఇతరత్రా రద్దీ ప్రదేశాల వద్ద నిర్వహిస్తున్న మాక్‌డ్రిల్స్‌లో భాగంగానే తాడ్బంద్ దేవాలయంలో మాక్ డ్రిల్ నిర్వహించామని బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. మాక్ డ్రిల్‌లో బోయిన్పల్లి ఎస్ఐలు రఘువీర్‌రెడ్డి, సాయికిరణ్ సహా 20 మందికిపైగా సిబ్బంది పాల్గొన్నారు. -
రూ. 40 కోట్ల స్థలం కబ్జాకు యత్నం
శంషాబాద్, న్యూస్‌లైన్: సర్కారు భూమే కదా అనుకున్నారేమో మరి.. దాదాపు రూ.40 కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసే యత్నం చేశారు. జేసీబీతో చదును చేశారు. సకాలంలో రెవెన్యూ అధికారులు స్పందించడంతో వారి ఆటకు అడ్డుకట్ట పడింది. ఈ సంఘటన సోమవారం శంషాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానికులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని సిద్దులగుట్ట ప్రాంతంలో సర్వే నంబరు 363లోని 43 ఎకరాల 18 గుంటల సర్కారు స్థలాన్ని నగరానికి చెందిన కొందరు వ్యక్తులు సోమవారం జేసీబీతో చదును చేశారు. సదరు స్థలం తమదేనంటూ హైదరాబాద్ తాడ్బన్ ప్రాంతానికి చెందిన వారు రాళ్లను, ముళ్లకంచెను తొలగించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది అక్కడి వెళ్లి పనులను నిలిపివేయించారు. ఇంతలోనే అక్కడే ఉన్న కొందరు వారితో దురుసుగా వ్యవహరించారు. నవాబులకు చెందిన భూమి తమకు వారసత్వంగా వచ్చిందని అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమవద్ద దానికి సంబంధించి డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని దబాయించారు. వీఆర్వో ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సదరు భూమి సర్కారుదని, పనులను నిలిపివేయాల్సిందిగా ఆదేశించి జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు.. సర్కారు స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించి రెవెన్యూ సిబ్బందిపై దౌర్జన్యంగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులపై వీఆర్వో ఇంద్రసేనారెడ్డి ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది ప్రభుత్వ స్థలమే: లచ్చిరెడ్డి, శంషాబాద్ తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం శంషాబాద్ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 363లోని 43 ఎకరాల 18 గుంటలు పూర్తిగా ప్రభుత్వ స్థలమే. అక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఎలాంటి పనులు చేపట్టడానికి వీల్లేదు. సదరు స్థలంలో ఎటువంటి పనులు చేపట్టినా కేసులు నమోదు చేస్తాం.