శంషాబాద్, న్యూస్‌లైన్: సర్కారు భూమే కదా అనుకున్నారేమో మరి.. దాదాపు రూ.40 కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసే యత్నం చేశారు. జేసీబీతో చదును చేశారు. సకాలంలో రెవెన్యూ అధికారులు స్పందించడంతో వారి ఆటకు అడ్డుకట్ట పడింది. ఈ సంఘటన సోమవారం శంషాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానికులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని సిద్దులగుట్ట ప్రాంతంలో సర్వే నంబరు 363లోని 43 ఎకరాల 18 గుంటల సర్కారు స్థలాన్ని నగరానికి చెందిన కొందరు వ్యక్తులు సోమవారం జేసీబీతో చదును చేశారు.
సదరు స్థలం తమదేనంటూ హైదరాబాద్ తాడ్‌బన్ ప్రాంతానికి చెందిన వారు రాళ్లను, ముళ్లకంచెను తొలగించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది అక్కడి వెళ్లి పనులను నిలిపివేయించారు. ఇంతలోనే అక్కడే ఉన్న కొందరు వారితో దురుసుగా వ్యవహరించారు. నవాబులకు చెందిన భూమి తమకు వారసత్వంగా వచ్చిందని అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమవద్ద దానికి సంబంధించి డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని దబాయించారు. వీఆర్‌వో ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సదరు భూమి సర్కారుదని, పనులను నిలిపివేయాల్సిందిగా ఆదేశించి జేసీబీని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులకు ఫిర్యాదు..
సర్కారు స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించి రెవెన్యూ సిబ్బందిపై దౌర్జన్యంగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులపై వీఆర్‌వో ఇంద్రసేనారెడ్డి ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అది ప్రభుత్వ స్థలమే: లచ్చిరెడ్డి, శంషాబాద్ తహసీల్దార్
రెవెన్యూ రికార్డుల ప్రకారం శంషాబాద్ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 363లోని 43 ఎకరాల 18 గుంటలు పూర్తిగా ప్రభుత్వ స్థలమే. అక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఎలాంటి పనులు చేపట్టడానికి వీల్లేదు. సదరు స్థలంలో ఎటువంటి పనులు చేపట్టినా కేసులు నమోదు చేస్తాం.
రూ. 40 కోట్ల స్థలం కబ్జాకు యత్నం
Published Tue, Jan 14 2014 1:25 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement