తాడిపత్రిలో మట్కా, పేకాటపై ఎస్పీ సీరియస్
– పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు
– తాడిపత్రి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ
అనంతపురం సెంట్రల్ : తాడిపత్రిలో జోరుగా సాగుతున్న మట్కా, పేకాటపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణించారు. శుక్రవారం సాక్షిలో ‘మట్కా, పేకాటకు కేరాఫ్ తాడిపత్రి’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు విషయాలపై ఆరా తీశారు. అలాగే ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ దీనిని తీవ్రంగా పరిగణించారు. మట్కా, పేకాట, బెట్టింగ్ పూర్తి స్థాయిలో అణచివేయాలని తాడిపత్రి సహా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులకు ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశారు. ఏప్రాంతంలోనైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు తేలితే సంబంధిత స్టేషన్ ఎస్ఐ, సీఐలతో పాటు పర్యవేక్షణాధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.