ఫాం భూములపై కమిషనర్ ఆరా
జూపాడుబంగ్లా: మెగా సీడ్ ఫార్కు ఏర్పాటుకు సంబంధించి తంగెడంచ ఫాం పరిశీలన నిమిత్తం వచ్చిన వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ హరి జవహర్లాల్ ప్రస్తుతం ఫాంకు చెందిన భూములపై ఆరా తీశారు. ఇందుకు ఏడీఏ శ్రీనివాసమూర్తి సమాధానం ఇస్తూ విత్తనోత్పత్తిక్షేత్రంలో 1638.35 ఎకరాల భూములున్నట్లు తెలిపారు. జైన్ ఇరిగేషన్ కంపెనీకి 610 ఎకరాలు, గుజరాత్ అంబుజాకు 210 ఎకరాలు, విత్తనపరిశోధన కేంద్రానికి 500 ఎకరాలు కేటాయించినట్లు ఏడీఏ తెలిపారు. అందుకు సంబంధించిన జీఓలన కమిషనర్ పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తంగెడంచ ఫారానికి మహర్దశ వచ్చిందన్నారు. కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన విత్తనాల సాగుపై శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించి మేలురకమైన వంగడాలు ఉత్పత్తి చేస్తామన్నారు. ఇక్కడ ఉత్పత్తిచేసిన విత్తనాలను ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తామన్నారు.