తుది దశకు టెయిల్‌పాండ్
దామరచర్ల : టెయిల్‌పాండ్ ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరుకున్నాయి. 50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితోపాటు నాగార్జునసాగర్ డ్యాం వద్ద విద్యుదుత్పాదనకు వినియోగించిన నీరు సముద్రం పాలుకాకుండా రీసైక్లింగ్ పద్ధతి ద్వారా జలాశయంలోకి పంపడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. వైఎస్సార్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఈ ఏడాది చివరినాటికి ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
దామరచర్ల మండలం అడవిదేవులపల్లి గ్రామ సమీపంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు దిగువన 21కిలోమీటర్ల ప్రాంతంలో కృష్ణా నదిపై టెయిల్‌పాండ్ డ్యాం, విద్యుత్ ప్రాజెక్టుల పనులు చేపట్టారు. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు కింద 50 మెగావాట్ల విద్యుదుత్పత్తితోపాటు నాగార్జునసాగర్ డ్యాం వద్ద విద్యుదుత్పాదనకు వినియోగించిన నీటిని తిరిగి డ్యాంలోకి రీసైక్లింగ్ పద్ధతి ద్వారా పంపేందుకు 7 టీఎంపీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. ఈ పనులకు 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. 1994 సంవత్సరంలో రూ.351 కోట్ల అంచనాలతో అనుమతి లభించినా ఆనాటి టీడీపీ ప్రభుత్వం నిర్మాణం విషయంలో నిర్లక్ష్యం చేసింది. 2006లో వైఎస్సార్ ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించేనాటికి దీని నిర్మాణ వ్యయం రూ.464 కోట్లకు చేరుకుంది.
ప్రతియేటా వరదలు.. జాప్యమైన పనులు
ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమైన సంవత్సరం నుంచి ప్రతియేటా నాగార్జునసాగర్ డ్యాం వరద నీటితో నిండడం, గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి నీటిని వదలడంతో పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలా మూడు నుంచి ఐదు నెలల వరకు పనులు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నిర్మాణం నిర్ణీత సమయానికి పూర్తికాలేదు.
జాప్యంతో రూ.895 కోట్లకు చేరిన అంచనావ్యయం
ఢిల్లీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్థిక సాయంతో రూ.464కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు నిర్మాణంలో ఆలస్యం కావడంతో అంచనా వ్యయం రూ.895 కోట్లకు చేరుకుంది. ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురై భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం రూ. 11కోట్ల నష్టపరిహారం అందజేసింది. వైఎస్సార్ హయాంలో ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరిగినా ఆయన మరణం తర్వాత మందగించాయి. ఐదేళ్ల నుంచి పనులు నత్తనడకన సాగుతూ చివరికి పూర్తయ్యాయి.
ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే..
ప్రాజెక్టు నిర్మాణం వల్ల రిజర్వాయర్‌లో 8 టీఎంసీల నీరు ఎల్లవేళలా నిలువ ఉంటుంది. ఇందులో టీఎంసీ నీటిని రివర్సబుల్ టర్బయిన్ల ద్వారా తిరిగి సాగర్ జలాశయానికి పంపింగ్ చేస్తారు. దీని వల్ల నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పాదనకు వినియోగించిన నీరు సముద్రం పాలు కాకుండా తిరిగి రిజర్వాయర్‌కు చేరుకుంటాయి. దీనివల్ల సాగర్ దిగువ ప్రాంతాలైన కృష్ణా డెల్టాకే కాక, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన రైతులకు మేలు కలిగే అవకాశం ఉంటుంది. టెయిల్‌పాండ్ ఆనకట్ట పూర్తయితే సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో తగినంత నీరు నిలువ ఉంచుకొని క్రమబద్ధీకరిస్తే అన్నిప్రాంతాల ప్రజలకు మేలు చేకూరుతుంది. నీరు దిగువకు వెళ్లకుండా డెడ్ స్టోరేజీగా ఉంచుతూ రీ సైక్లింగ్ ద్వారా విద్యుదుత్పత్తి చేసేలా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దీంతో నీరు కూడా ఆదా అవుతుంది. ఈ ఏడాది తొలిసారిగా క్రస్ట్‌గేట్ల ద్వారా వరద నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేశారు.
50 మెగావాట్ల విద్యుదుత్పాదక కేంద్రం నిర్మాణం
టెయిల్‌పాండ్ ఆనకట్టతోపాటు అనుబంధంగా జెన్కో సంస్థ 25 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు జల విద్యుత్ కేంద్రాలను నిర్మించింది. వీటిద్వారా 50 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి కానుంది. టర్బయిన్లు, ప్రధాన దిగువ కాల్వ నిర్మాణం చేపట్టారు. భారీ యంత్ర పరికరాలన్నీ అమర్చారు. ఆనకట్ట పనిపూర్తి కావడంతోపాటు ఈ విద్యుత్ కేంద్రాల నిర్మాణం పూర్తికావొస్తోంది. మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరనుంది. దీంతో రెండు రాష్ట్రాల ప్రజలు వైఎస్సార్‌ను వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలుపుకుంటారు. ఈ ప్రాజెక్టు ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుందని ఎస్ఈ పీడీఎల్.కుమార్, ఈఈలు లక్ష్మణ్ కుమార్, తిరుపతయ్య, డీఈ సూర్యనారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.