పిల్లల కోసం: తైవాన్ టు శ్రీకాళహస్తి..!
శ్రీకాళహస్తి: భక్తిభావానికి ఎల్లలు లేవు. దేశాలు అడ్డుకావు. దూరాలు లెక్కలోకి రావు. అందుకే సంతానం కోసం ఎక్కడో తైవాన్లో ఉండే 16 మంది భక్తులు వెతుక్కుంటూ వెతుక్కుంటూ శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చారు. ఆ శ్రీకాళహస్తీశ్వరుడిని పూజించి తమ పిల్లలు కలిగేలా అనుగ్రహించమని వేడుకున్నారు.
తైవాన్ దేశానికి చెందిన 16 మంది భక్తులు మంగళవారం శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. మొదట ఆలయంలో రాహు కేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద పొర్లు దండాలు పెట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాళహస్తిలో పూజలు చేయిస్తే పెళ్లి కాని వారికి పెళ్లవుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెన్నైకి చెందిన ఓ స్నేహితుడు తెలిపాడని, అందుకే తాము ఈ ఆలయానికి వచ్చి మొక్కుకున్నట్టు చెప్పారు.