సీఎంగా జీహెచ్ఎంసీపై తొలి సమీక్షను నిర్వహించిన కేసీఆర్
కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ నుంచి తాజ్ బంజారా వరకు హెరిటేజ్ వ్యాలీ నిర్మించండి
వానాకాలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా చూడండి
తాగునీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు పైపులు తనిఖీ చేయండి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కె.చంద్రశేఖర్‌రావు తొలి సమీక్షా సమావేశాన్ని గ్రేటర్ హైదరాబాద్‌పై నిర్వహించారు. నగర అభివృద్ధికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని పురపాలక శాఖ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ నుంచి తాజ్ బంజారా వరకు హెరిటేజ్ వ్యాలీని నిర్మించాలని సూచించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని.. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. తాగునీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు పైపులను తనిఖీ చేయాలని, వరద, మురుగు నీటి కాలువల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టంచేశారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు తరచూ జలమయం అవుతున్నందున నాలాల్లోని పూడిక తీత పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌ను మురికివాడల రహిత నగరంగా మార్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బలహీన వర్గాలకు డబుల్ బెడ్రూమ్ను వారు నివసించే ప్రాంతంలోనే నిర్మించి ఇవ్వాలని, గృహ నిర్మాణానికి ప్రజలు ఎక్కడ ముందుకు వస్తే అక్కడ ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని సూచించారు. నగరంలో చెత్త సమస్య పరిష్కారానికి ఒకేచోట డంపింగ్ చేయకుండా, శాస్త్రీయ పద్ధతిలో నాలుగైదు వైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలన్నారు.
మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని, ఇందుకు రెవెన్యూ శాఖ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీలో ఖాళీగా ఉన్న 265 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ విషయాన్ని అధికారులు ప్రస్తావించగా.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు వరకు వేచి ఉండకుండా ప్రస్తుతానికి సామర్థ్యమున్న ఏజెన్సీ నుంచి వారిని నియమించుకోవాలని సూచించారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించడానికి వీలుగా చేపట్టాల్సిన అభివృద్ది పథకాలను గుర్తించాలని చె బుతూ.. నగర బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచాల్సిన ఆవశ్యకతను సీఎం వారికి వివరించారు. అందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి, నగర కమిషనర్ సోమేష్‌కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, జీఏడీ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా పాల్గొన్నారు.