ఎలిజబెత్ సాధించింది
⇒ యువతి న్యాయపోరాటం
⇒ మోసగించిన యువకుడికి శిక్ష పడేవరకు విశ్రమించని వైనం
⇒ బిడ్డకు తండ్రి ఎవరో చట్టబద్ధంగా వెల్లడి
⇒ నిందితుడికి పదేళ్ల జైలు
బంజారాహిల్స్: ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేయడమేగాక, గర్భం దాల్చాక నువ్వెవరో నాకు తెలియదంటూ బయటకు తరిమిన నయవంచకుడికి శిక్ష పడాలని, తన బిడ్డకు తండ్రి ఎవరో చట్టబద్దంగా వెల్లడించాలన్న పట్టుదలతో న్యాయపోరాటం సాగించిన ఓ బాలిక ఎట్టకేలకు విజయం సాధించింది. డీఎన్ఏ పరీక్ష ద్వారా నిజాన్ని వెలుగులోకి తేవడమేగాక, తనను వంచిన మానవ మృగానికి పదేళ్ల జైలు శిక్ష పడే వరకు అలుపెరుగని పోరాటం సాగించింది.
వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 10 సింగాడిబస్తీకి చెందిన ఎలిజబెత్(16) 2013లో తాజ్‌కృష్ణా హోటల్లో హౌస్‌కీపింగ్ విభాగంలో పని చేసేది. అదే ప్రాంతానికి చెందిన జావి(23) అనే యువకుడితోనామెకు పరిచయం ఏర్పడింది. ప్రేమపేరుతో నమ్మించి మోసం చేయడంతో 2013 ఆగస్టులో గర్భం దాల్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని జావిపై ఒత్తిడి తేగా ఇంట్లో తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారంటూ బెదిరించి తప్పించుకు తిరిగేవాడు. అయితే ఎలిజబెత్ ఆరోగ్యంపై కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. దీంతో వారు జావిని కలిసి పెళ్లి చేసుకోవాలని కోరగా, తానెప్పుడూ ఎలిజబెత్‌ను చూడలేదని, ప్రేమించలేదని, ఆమె గర్భానికి తాను కారణం కాదని తప్పించుకున్నాడు.
దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన ఎలిజబెత్ 2014 ఏప్రెల్‌లో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జావిపై ఐపీసీ సెక్షన్ 376, 420, ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఎలిజబెత్ నిరక్ష్యరాస్యురాలు కావడంతో ఆమె వయస్సు ధృవీకరణ కాలేదు. ఇందుకోసం పోలీసుల సహాయంతో ఆస్పత్రికి వెళ్లి తన వయస్సును నిర్ధారణ పరీక్షలు చేయించుకుని కోర్టుకు ఆధారాలు సమర్పించింది. ఈ పరిస్థితుల్లోనే ఓ పాపకు జన్మనిచ్చింది. బాలింత అయినా పోలీసుల సహాయంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌లో డీఎన్ఏ టెస్ట్ చేయించగా, బిడ్డకు తండ్రి జావిగా నిర్ధారణ కావడంతో కోర్టుకు ఆధారాలు సమర్పించింది.
ఆ తరువాత నిందితుడికి శిక్ష పడేలా చేయడమే లక్ష్యంగా పోరాటం సాగించింది. మూడేళ్లుగా కొనసాగిన ఈ కేసులో ఈ నెల 18న అదనపు మెజిస్ట్రేట్ సెషన్స్ జడ్జి నిందితుడు జావికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఒక వైపు పాపను పెంచుకుంటూ.. పని చేస్తూనే మరో వైపు కోర్టు చుట్టూ తిరుగుతూ నిందితుడికి శిక్షపడేలా చేసి విజయం సాధించింది. దీంతో స్థానికులు ఆమెను ప్రశంసిస్తున్నారు.