ప్రేక్షకులను వేచి ఉంచేందుకు మనస్సు ఒప్పుకోవడం లేదు: ఆమిర్ ఖాన్
ముంబై: తాను నటించిన ధూమ్ 3 సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఆసక్తితో ఎదురుచూస్తున్నాడు. అయితే ఈ సినిమా విడుదల చేయాలని ముహూర్తంగా నిర్ణయించిన డిసెంబర్ 25 (క్రిస్మస్) తనకు చాలా దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తోందన్నాడు.
క్రిస్మస్దాకా ప్రేక్షకులను వేచి ఉంచేందుకు మనస్సు ఒప్పుకోవడం లేదని ఫేస్బుక్లో ఆమిర్ పోస్ట్ చేశాడు. ‘అన్ని కూర్పులు, మార్పులు చేసిన ధూమ్ 3 సినిమా చూశాను. అయితే ఈ సినిమా విడుదలకు నిర్ణయించిన ముహూర్తం క్రిస్మస్ చాలా దూరంలో ఉన్నట్టుగా అనిపిస్తోంద’ని అందులో పేర్కొన్నాడు. ఈ సినిమా బాగా చేసేందుకు అందరి నుంచి సంపూర్ణ సహకారం అందించారన్నాడు. ధూమ్ సీక్వెల్లో భాగంగా తీసిన ధూమ్ 3లో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌తో కలిసి విలన్ పాత్రను పోషించడం తన కెరీర్లో మరిచిపోలేనని తెలిపాడు.
అయితే ధూమ్, ధూమ్ 2లో పోలీసు అధికారులుగా నటించిన అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా యధావిధిగా అవే పాత్రలను పోషిస్తున్నారు. ఆదిత్య చోప్రా నిర్మాతగా, విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.