అద్గదీ కబాలి...!
పేరు కొత్తగా ఉంది... ముందు... ‘క’. తరువాత... ‘బా’. ఆ తరువాత ‘లి’. కబాలి అంటే... ఎటకారంగా... బ్రూస్ ‘లీ’ వాళ్ళ ఫాదరా? బాహుబ‘లి’ బ్రదరా? ఊహూ... కాదు... మలేసియాలో డాన్ అట! రబ్బరు లాగా అతుకుతాడట! ఇంతకు ముందు చేసిన పాత్రలన్నీ... రబ్బరు లాగా చెరుపుతాడట! మలేసియాలో రబ్బరు మాఫియాలో చిక్కుకున్న రజనీకాంత్... సారీ... రజనీకాంత్ చిక్కడు... దొరకడు! అదండీ... ‘క’. దాని తరువాత ‘బా’. ఆ తరువాత ‘లి’. అద్గదీ... ‘కబాలి’
దూరంగా... చీకటిలో నడుచుకుంటూ వస్తున్న సూటుబూటు మనిషి... కాలి బూట్ల మీద నుంచి క్లోజప్ షాట్... ఒక స్టయిలైజ్డ్ వాక్... వెనకాల నుంచి జేమ్స్‌బాండ్ సినిమాల ఫక్కీలో ‘ట్యాన్డ్యాన్ డండం..’ అంటూ ఒక చిత్రమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్...
నల్లటి కళ్ళద్దాల్లో ‘తలైవర్’ (నాయకుడు)!
‘‘నా వందిట్టేన్ సొల్లు... తిరింబి వందిట్టేయని సొల్లు... ఇరువత్తంజు వర్షత్తుక్కు మిన్నాడి ఎపిడి పోనారో, అపిడియే... తిరింబి వందిట్టేనని సొల్లు... కబాలిడా!’’ (నేను వచ్చేశానని చెప్పు! మళ్ళీ వచ్చేశానని చెప్పు! పాతికేళ్ళ క్రితం ఎలా వెళ్ళిపోయాడో, అలానే వచ్చేశానని చెప్పు... కబాలిరా!) హీరో నోట జనం ఈల కొట్టే డైలాగ్!!యస్... సూపర్‌స్టార్... సౌతిండియన్ సూపర్‌స్టార్... ఈజ్ బ్యాక్. రజనీకాంత్ మళ్ళీ తెరపైకి వచ్చేశారు... ఈసారి ‘కబాలి’గా వచ్చేశారు! పాతికేళ్ళ క్రితం నాటి పొగరు, విగరు తెరపై కనపడుతుండగా, ఎందరికో స్ఫూర్తినిచ్చిన తనదైన స్టైల్‌తో ముందుకు వచ్చేశారు!
ఇంతకీ ‘కబాలి’ అంటే?
‘‘యార్డా... అంద కబాలీ? వర సొల్లుడా!’’ (ఎవర్రా ఆ కబాలీ? రమ్మనరా!) అని ‘కబాలి’ సినిమాలో విలన్ ఒకడు అంటాడు. అవును ఇంతకీ ఎవరీ కబాలి? ఈ పేరే చిత్రంగా ఉంది కదూ! నిజానికి, కపాలి అనేది పరమ శివుడి అనంత కోటి నామాల్లో ఒకటి. తమిళనాట కపాలీశ్వరుడి పేరిట ఆలయాలెన్నో ఉన్నాయి. చెన్నైలోని మైలాపూర్‌లో అనేక దశాబ్దాల క్రితం వెలసిన మహిమాన్విత కపాలీశ్వరస్వామి కోవెల సుప్రసిద్ధం. అయితే, తమిళంలో ‘ప’ అనే అక్షరం కూడా ‘బ’ లానే పలుకుతారు కనక, ‘కపాలి’ కాస్తా ‘కబాలి’ అయింది. చెన్నైలోని మైలాపూర్ ప్రాంతానికి చెందిన ఒక నిజజీవిత డాన్ కథ ఆధారంగా తీస్తున్నారని ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో హీరో పాత్రకు అలా ‘కబాలి’ అనే పేరు పెట్టారు. తమిళం నుంచి తెలుగులోకి సినిమాను దిగుమతి చేస్తుకుంటూ, మనవాళ్ళు చివరకు టైటిల్‌ను కూడా తమిళ ఉచ్చారణతోనే తెలుగులోకీ దింపేశారు! డబ్బింగా... మజాకా!
ఆనాటి యంగ్ లుక్ కోసం...
ఈ సినిమా కోసం రజనీ మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారు. ఒకటి - 1970ల నాటి ‘రెట్రో’ లుక్‌లో నుదుటి మీదకు పడే పెద్ద క్రాఫ్‌తో యువకుడి లుక్. రంగుల, ప్రింటెడ్ చొక్కాల్లో కనపడతారు. రెండోది - కొద్దిగా నెరిసిన జుట్టుతో మధ్యవయస్కుడైన డాన్ లుక్. తెలుపు, బ్లూ, గ్రేకలర్ దుస్తుల్లో కనిపిస్తారు. మూడోది - పూర్తిగా తెల్ల గడ్డంతో వయసు మీద పడ్డ లుక్. ఇక్కడ కాటన్, లెనైన్స్, వూలు దుస్తుల్లో కనిపిస్తారు. సినిమా కోసం ఫోటో షూట్ కన్నా ముందే లుక్ టెస్ట్ చేశారు. దాని కోసం రజనీ గడ్డం పెంచుతూ వచ్చారు. రజనీ ఆస్థాన స్టైలిస్ట్ భాను, దర్శకుడు రంజిత్ కలసి లుక్స్ ఎలా ఉండాలనే దానిపై శ్రమించారు. 1970ల లుక్ కోసం రజనీతో ఏకంగా కొన్ని పదుల కాస్ట్యూమ్స్ ట్రై చేయించారట. ఆ తర్వాత చివరకు లుక్ ఖరారు చేశారు. తెలుగు మూలాలున్న ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ భార్య అనూ వర్ధన్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. కాస్ట్యూమ్స్ కోసమే రూ. 1.4 కోట్లు ఖర్చు పెట్టారు.
‘కబాలి’ సిన్మా కథ ఏంటి?
బ్రిటీషు పాలనాకాలంలో మలేసియాకు కట్టుబానిసలుగా వెళ్ళిన తమిళ ప్రజల నేపథ్యంలో సాగే కథ ఇది. అప్పట్లో భారతదేశం నుంచి చాలామంది మలేసియా, బర్మా తదితర ప్రాంతాలకు వలస వెళ్ళారు. మలేసియాకు వలస వెళ్ళినవారు అక్కడ రబ్బరు తయారీ పరిశ్రమల్లో కార్మికులయ్యారు. సహజంగానే, స్థానికుల నుంచి భారతీయ కార్మికులకు జాతి వివక్ష ఎదురైంది. ఈ వివక్షను ఎదిరించి, యజమానుల అరాచకాల్ని ఎదుర్కొనేందుకు ఆ కార్మికలోకం నుంచి పైకి ఎగసిన కెరటమే - ‘కబాలి’. తనవాళ్ళను కాపాడడం కోసం పరిస్థితుల ప్రభావం వల్ల అతనే డాన్‌గా ఎదుగుతాడు.
⇔కోడంబాకమ్ వర్గాల సమాచారం ప్రకారం ‘కబాలి’ చాలా ఎమోషనల్ ఫిల్మ్. ఒక్కముక్కలో ‘కబాలి’ అనే వ్యక్తి జీవిత ప్రయాణం ఈ కథ. దాదాపు 25 ఏళ్ళ జీవితకాలాన్ని పోగొట్టుకున్న ఆ వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ తన పాత జీవితానికి తిరిగి వస్తే ఏమవుతుంది? అదే ఈ సిన్మాలో చూపిస్తున్నారట!
⇔దాదాపు పాతికేళ్ళ పాటు జైలులో మగ్గిన హీరో, ఎలాంటి అండా లేకుండానే బయటకొస్తాడు. ఆ విలన్ల గ్యాంగ్‌ల మీద ఒంటరిగానే పోరాటానికి దిగుతాడు. అలా కబాలి ఒంటి చేతితో ఈ గ్యాంగ్లన్నిటినీ ఎలా ఎదుర్కొన్నాడు, చివరకు విలన్ల సామ్రాజ్యాన్ని ఎలా కుప్పకూల్చాడనేది సినిమా. దీన్ని ఆసక్తికరంగా తెరపై చూపారట. ఈ యాక్షన్ డ్రామాలో కావాల్సినంత ఎమోషన్, రొమాన్స్ నిండిన ఘట్టాల్ని పండించారు. రజనీ ఇంట్రడక్షన్ పాట, ఒక లవ్ సాంగ్ కూడా అలరి స్తాయి.
రజనీ... రంజిత్... సూర్య
‘అట్ట కత్తి’, ‘మద్రాస్’ చిత్రాలతో అందరి దృష్టీ ఆకర్షించిన యువ దర్శకుడు పా రంజిత్‌కు ఇది మూడో సినిమానే! రంజిత్ ఈ సినిమా కథను హీరో సూర్యకు మొదట వినిపించారు. రజనీకైతే బాగుంటుందని, సూర్య స్వయంగా రంజిత్‌ను రజనీ దగ్గరికి తీసుకువెళ్ళారు. కథ వినగానే రజనీ ఓకే చెప్పారట! చాలా ఏళ్ళుగా కొత్త దర్శకులతో చేయని ఆయన ఈసారి రంజిత్‌కి ఓటేయడం విశేషం. ‘రోబో’ తర్వాత ‘కోచ్చడయాన్’, ‘లింగ’ ఫ్లాపై, బయ్యర్ల ఒత్తిడితో పాటు ఆర్థిక లావాదేవీలూ రజనీ తలకు చుట్టుకున్నాయని టాక్. అందుకే ప్రయోగాల కన్నా ఫార్ములా వైపే మొగ్గి, ఈ డాన్ కథకు ఓకె చెప్పారు. మిత్రుడు, 45 పైగా సినిమాల నిర్మాతైన ‘కలైపులి’ థానుకు ఫోన్ చేసి, ఈ సిన్మా చేద్దామన్నారు.
ఇదో డిఫరెంట్ స్టైల్!
⇔రజనీ అంటే ఒక స్టైల్ శిఖరం! అయితే, కేవలం స్టైల్, ఆయన కరిష్మాకే పరిమితం కాకుండా ఆయనలోని నటుణ్ణి కూడా చూపెట్టేలా ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నారు. ఆ రకంగానే చిత్రీకరించారు కూడా!
⇔జీవితమంటే ఏమిటన్న దానిపై తన భావాల్ని కూడా ఈ ఎమోషనల్ కథలో జొప్పించేలా రజనీ చూశారు.
⇔మునుపటి చిత్రాల మేనరిజమ్లకే పరిమితం కాకుండా, భిన్నంగా కనపడాలని దర్శకుడితో కలసి తీర్మానించారు.
⇔అలాగే సిన్మాలో హీరో తాలూకు జీవితం నుంచి కథనీ, ప్రేక్షకుల్నీ పక్కకు తప్పించరాదని దర్శకుడితో సహా సాంకేతిక నిపుణులంతా ముందుగానే భావించారు. అందుకే, వీలైనంత వరకు చాలా సింపుల్‌గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా, ఎలాంటి గిమ్మిక్కులూ లేకుండా కథను తెరపై చూపించాలనుకున్నారు. అందుకే, సినీ రంగంలో మొదటి నుంచి అనుసరించే పాత మూల సూత్రాలనే తామూ అనుసరించారు. సింపుల్ షాట్స్‌తో హాయిగా, సులభంగా కథ ముందుకు సాగేలా ఎడిటింగ్ చేశారు.
కళ్ళు తిరిగే లెక్కలు
⇔దాదాపు రూ. 110 కోట్ల బడ్జెట్‌గా ప్రచారమవుతున్న ‘కబాలి’ సినిమా రిలీజ్‌కు ముందే రూ. 200 కోట్ల దాకా బిజినెస్ చేసిందని సినీలోకం కోడై కూస్తోంది.
⇔తెలుగు రైట్స్ కోసం ఎందరో సీనియర్లు పోటీపడుతున్న టైమ్‌లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి అయిదేళ్ళుగా డిస్ట్రిబ్యూషన్లో ఉన్న ప్రవీణ్‌కుమార్ వర్మ, అలాగే ఆయన మిత్రుడైన ఖమ్మం వాసి కె.పి. చౌదరి అనే ఇద్దరు యువకులు సాహసంతో, ఈ భారీ చిత్రాన్ని కొనుగోలు చేయడం విశేషం. ఇప్పటి వరకు రజనీ చిత్రాల్లో ‘రోబో’ అత్యధికంగా 28 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ కథనం. ఇప్పుడీ ‘కబాలి’ అంతకన్నా ఎక్కువకే అమ్ముడైనట్లు సమాచారం.
⇔తెలుగు వెర్షన్ శాటిలైట్ హక్కుల కోసం కూడా ఒకటికి రెండు టీవీ చానల్స్ పోటీపడుతున్నాయి. అదీ మంచి రేటు పలుకుతుందని భావిస్తున్నారు. తమిళ వెర్షన్ శాటిలైట్ రైట్స్నైతే ‘జయ’ టీవీ మునుపెన్నడూ లేనంత భారీ మొత్తం ఆఫర్ చేసి, కొంటున్నట్లు వినికిడి.
⇔హిందీ రైట్స్ కూడా భారీ రేటుకే అమ్ముడయ్యాయి. ప్రపంచ ప్రసిద్ధ సినీ నిర్మాణ - పంపిణీ సంస్థ ‘ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్’, మీడియా కంపెనీ ‘స్టార్’ కలసి ఏర్పాటుచేసిన ‘ఫాక్స్ స్టార్ స్టూడియోస్’ నార్త అంతటా ‘కబాలి’ తమిళ, తెలుగు, హిందీ వెర్షన్ల రైట్స్ సొంతం చేసుకుంది. హిందీ వెర్షన్ 1000కి పైగా స్క్రీన్స్‌లో రిలీజవుతోంది. హిందీ శాటిలైట్ రైట్లే రూ.16.2 కోట్ల పైగా మొత్తానికి అమ్ముడయ్యాయి.
⇔ దేశదేశాల్లో రిలీజ్ హంగామా: 50 దేశాల్లో, 4 వేల పైగా స్క్రీన్స్‌లో రిలీజ్ తెలుగునాట మొత్తం 1800 చిల్లర స్క్రీన్స్‌లో దాదాపు సగంలో జూలై 22న ‘కబాలి’ సందడే! మలేసియా, ఆస్ట్రేలియాల్లో ప్రీమియర్ షోల టికెట్స్ సోల్డ్ ఔట్. రిలీజ్ రోజునే ప్యారిస్‌లో ప్రసిద్ధ రెక్స్ థియేటర్లో షో. 2800 సీట్లున్న భారీ హాల్లో రిలీజ్‌నాడే ఇండియన్ ఫిల్మ్‌షో ఇదే ఫస్ట్!
⇔‘కబాలి’ విమానం: అధికారిక పార్ట్నరైన ‘ఎయిర్ ఏషియా ఇండియా’ ఏకంగా విమానం బయటిభాగాన్ని రజనీ స్టిల్స్‌తో అలంకరించింది. ఇండియాలో ఒక విమానానికి సిన్మా అలంకరణ ఇదే ప్రథమం. ఇదంతా హైదరాబాద్‌లోనే చేశారు. తొలి ఆటను చెన్నైలో చూసేవారికి బెంగళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్ ప్యాకేజ్.
⇔కథలో కబుర్లు: ‘కబాలి’ రజనీ 41 ఏళ్ల కెరీర్లో 159వ సినిమా. గతంలో డాన్ పాత్ర చేసింది 22 ఏళ్ళ క్రితం ‘బాషా’లో! రజనీ పక్కన రాధికా ఆప్టే నాయిక. వీరిద్దరి మధ్య ప్రేమకథ ఉంటుంది. యువ రజనీ పోర్షన్ 20 నిమిషాలుంటుందట! రజనీ కుమార్తెగా ధన్సికది కీలకపాత్ర. బాయ్‌కట్ హెయిర్‌స్టైల్‌తో కనిపించే ఆమెకీ, రజనీకీ చిన్న ఘర్షణ ఉంటుంది. తైవాన్ యాక్టర్ ‘విన్స్టన్ చావో’ విలన్. విలన్ల గ్యాంగ్ పేరు ‘43 ఓ’. రజనీ, విలన్ ఇద్దరూ యంగ్, ఓల్డేజ్ గెటప్స్‌లో కనిపిస్తారు. నాజర్‌ది బయటికిచెప్పని కీలకపాత్ర.
⇔‘మలై’లోనూ డబ్బింగ్: చైనా, థాయిలాండ్, మలేసియా యాక్టర్లూ నటించారు. 100కి పైగా థాయ్ ఫైటర్లు పాల్గొన్నారు. అందుకే, తమిళ ‘కబాలి’ని తెలుగు, హిందీల్లోనే కాక, చైనీస్, థాయ్, జపనీస్, మలై భాషల్లోనూ రిలీజ్ సన్నాహాలు. ‘మలై’లో డబ్ అవుతున్న తొలి భారతీయ సినిమా ఇదే! మలేసియాలో తమిళ వెర్షన్ రిలీజ్ జూలై 22న. వారం తర్వాత ‘మలై’ వెర్షన్ రిలీజ్.
⇔రజనీ పాటే ఒక టైటిల్: ‘కబాలి’లోని ‘నెరుప్పు డా’ (నిప్పు రా) పాట పెద్ద సంచలనం. యువ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ బాణీలో ఈ పాట, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మారుమోగిపోతోంది. తమిళనాట సెల్ఫోన్సలో ఈ కాలర్ట్యూన్లే. తమిళంలో ఓ కొత్త సినిమాకు ‘నెరుప్పు డా’ అని టైటిల్ పెడుతున్నారు. హీరో అందులో రజనీ ఫ్యాన్. ఈ టైటిల్‌కి ‘కబాలి’ నిర్మాత థానును పర్మిషన్ అడిగారు. రజనీ మాటైనా, పాటైనా మాటలా!
⇔మార్కెటింగా మజాకా: ‘ఎయిర్ ఏషియా’ విమానంతో పాటు అమెజాన్, క్యాడ్బరీ, ఎయిర్టెల్ తదితర సంస్థలు ‘కబాలి’కి బ్రాండ్ అసోసియేట్లు అయ్యాయి. మరో 100 కంపెనీలు క్యూ కట్టినట్లు వార్త. ‘కబాలి’ బొమ్మలున్న పై కవర్‌తో ‘ఎయిర్టెల్’ సిమ్‌కార్డులు అమ్ముతోంది. ‘అమెజాన్’లో సెల్‌ఫోన్ కవర్లు, పెన్నులు,‘కబాలి’ బొమ్మలు అమ్ముతున్నారు. షాపింగ్ సైట్ ‘షాప్ సిజె’ కూడా బరిలోకి దిగింది. ‘సూపర్‌స్టార్ కా 5 స్టార్’ శీర్షికతో క్యాడ్బరీ ‘5 స్టార్’ చాక్లెట్లను మార్కెట్ చేస్తోంది. టీ షర్ట్లు, కీ చైన్లు సరేసరి. ‘కబాలి’ బంగారం: ‘ముత్తూట్ ఫైనాన్స్’ సంస్థ రజనీ ‘కబాలి’ గెట ప్తో ప్రత్యేకంగా బంగారు, వెండి నాణాల్ని అమ్మకానికి సిద్ధం చేసింది. ‘కబాలి’తో తమ బ్రాండ్‌ను కలిపి, 50 లక్షల విలువైన యాడ్స ఇస్తోంది.
రజనీకెలా ఉంది?
కబాలి రిలీజ్ ఎందుకని పదే పదే వాయిదాపడింది? రజనీ అమెరికా వెళ్ళారేం? దీని గురించి రూమర్ మిల్స్ రోజుకో పిండి రుబ్బుతూనే ఉన్నాయి. రజనీకి ఆరోగ్యం అస్సలు బాలేదనీ, ‘రోబో-2’ వాళ్ళయితే షూటింగ్‌కి ఆయన కొలతలతో రోబోను సిద్ధం చేసేశారనీ - ఇలా నోటికొచ్చిన మాట. కానీ, రొటీన్ చెకప్ కోసమే అమెరికా వెళ్ళారని రజనీ సోదరుడు సత్యనారాయణరావు స్పష్టం చేశారు. అయితే, జూలై మొదటి వారానికల్లా రావాల్సిన రజనీ నెలాఖరికి కానీ రావట్లేదు. జూలై 22 రిలీజ్ హంగామా అమెరికాలో చూస్తారు!
టీజర్‌కి... కోట్లలో వ్యూస్!
రిలీజ్ కన్నా ముందే రజనీ చాలా రికార్డ్‌లు సృష్టిస్తున్నారు. ‘కబాలి’ టీజర్ యూ ట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో 2.5 కోట్ల వ్యూస్‌ను చేరింది. ఈ చిత్రానికి ఎడిటర్ ప్రవీణ్ కె.ఎల్. తెలుగబ్బాయి. ఈ టీజర్‌ను ఎడిట్ చేసి, కట్ చేసిందీ ఆయనే. మలేసియాలో చిత్రీకరణ జరుపుకొని వచ్చిన వెంటనే ఆ రషెస్ చూసిన ప్రవీణ్‌కు నటుడు నంబియార్‌ను అనుకరిస్తూ, రజనీ చెప్పే ‘కబాలిడా’ అనే పెద్ద డైలాగ్ బాగా నచ్చింది. దాన్ని టీజర్లో వాడాలని అప్పుడే అనుకున్నార్ట!
డేట్స్ మారినా... క్రేజే!
గత వినాయకచవితికి ‘కబాలి’ షూటింగ్ మొదలైంది. మలేసియా, బ్యాంకాక్, హాంగ్‌కాంగ్‌ల్లో సాగింది. రజనీ లాంటి భారీ స్టార్ ఉన్నా, చిత్రీకరణ చకచకా పూర్తయింది. మొదట ఏప్రిల్‌లో తమిళ ఉగాదికి రిలీజ్ చేయాలనుకున్నారు. ఆపైన సమ్మర్ స్పెషలంటూ రకరకాల డేట్లు వినిపించాయి. జూలైలోనూ డేట్స్ మారాయి. అధికారిక ప్రకటనైతే చేయలేదు కానీ, ఈ 22న రిలీజ్ పక్కా.
సెన్సార్ ముడింజాచ్చి!
అర్థం కాలా? తమిళ్లో సెన్సారైపోయిందట! అధికారికంగా ప్రకటించకపోయినా, రంజాన్ మర్నాడు ‘కబాలి’ చెన్నైలో సెన్సార్‌కి వెళ్ళిం దట. సోమవారం సెన్సార్ సర్టిఫికెట్ రాగానే, డేట్ ప్రకటిస్తారు. తుది నిడివి 2 గంటల 32 నిమిషాలట.
- రెంటాల జయదేవ