జాన్సన్ బేబీ పౌడర్ ఇక దొరకదు
న్యూజెర్సీ: చిన్నారుల నాజూకైన చర్మం కోసం మరింత మృదువైన పౌడర్, సౌమ్యతలోని అద్భుతం అంటూ కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారుల్ని ఆకర్షించిన అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి బేబీ టాల్కమ్ పౌడర్ అమ్మకాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది.
అమెరికా, కెనడాలో 2020 నుంచి ఈ పౌడర్ విక్రయాలను నిలిపివేసిన జాన్సన్ కంపెనీ 2023 నుంచి ప్రపంచ వ్యాప్తంగా విక్రయాలను ఆపేస్తున్నట్టు స్పష్టం చేసింది. బేబీ టాల్కమ్ పౌడర్లు కేన్సర్‌కు దారి తీస్తున్నాయన్న ఆందోళనలతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీపై కోర్టులో 40 వేలకు పైగా పిటిషన్లు పడ్డాయి. ఈ వివాదం నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. టాల్కమ్ పౌడర్లలో ఉండే అస్బెస్టాస్ అనే పదార్థం వల్ల కేన్సర్ సోకుతోందంటూ ఎందరో వినియోగదారులు కోర్టులకెక్కారు.
దీంతో జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కమ్ పౌడర్ స్థానంలో కార్న్ స్టార్చ్ (మొక్కజొన్న పిండి)తో తయారు చేసిన పౌడర్‌ను విక్రయించనుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ కార్న్ స్టార్చ్ పౌడర్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ కేన్సర్ వస్తోందంటూ న్యాయస్థానంలో పిటిషన్లు ఆగడం లేదు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ విక్రయాలను నిలిపివేయాలని ఆ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకునే టాల్కమ్ పౌడర్ అమ్మకాలనే నిలిపివేస్తున్నామే తప్ప తమ పౌడర్‌లో ఎలాంటి కేన్సర్ కారకాలు లేవని వాదిస్తోంది.
వివాదం ఎలా వెలుగులోకొచ్చింది ?
జాన్సన్ బేబీ పౌడర్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ పౌడర్ పూస్తే తమ బిడ్డల చర్మం మరింత మృదువుగా, పొడిగా ఉంటుందని ఎందరో తల్లులు కొన్ని దశాబ్దాలుగా వాడుతున్నారు. డైపర్లు వాడినçప్పుడు ఏర్పడే ర్యాష్‌ని కూడా ఈ పౌడర్ నిరోధించడంతో ఎంతోమంది తల్లుల మనసు దోచుకుంది. తాజాదనం కోసం పిల్లలే కాదు పెద్దలు కూడా ఈ పౌడర్ని వాడుతూ వస్తున్నారు. అందుకే కొన్ని దశాబ్దాలు ఈ పౌడర్ ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. 2017లో అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌కి చెందిన మహిళ తాను సుదీర్ఘకాలం జాన్సన్ బేబీ పౌడర్ వాడడంతో ఒవేరియన్ కేన్సర్ బారిన పడ్డానంటూ కోర్టుకెక్కారు.
ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు పౌడర్‌లో కేన్సర్ కారకాలు ఉన్నాయని తేలిందని స్పష్టం చేస్తూ కంపెనీకి 7 కోట్ల డాలర్లు నష్టపరిహారం కింద చెల్లించాలని తీర్పు చెప్పింది. దశాబ్దాలుగా కేన్సర్ కారకాలున్న పౌడర్ని అమ్ముతున్నందుకు మరో 34.7 కోట్ల డాలర్లను జరిమానాగా విధించింది. పౌడర్‌లో ఉండే అస్బెస్టాస్‌తో దీర్ఘకాలంలో ఊపిరితిత్తులు, అండాశయ ముఖద్వార కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయని పరిశోధనలు కూడా తేల్చాయి. వాస్తవానికి 1957లో జాన్సన్ బేబీ పౌడర్‌లో అస్బెస్టాస్ ఉందని తేలింది. కానీ దీర్ఘకాలం వాడాకే దుష్ప్రభావాలు బయటపడ్డాయి.