మంచం కింద మొసలి
జింబాబ్వేకు చెందిన 40 ఏళ్ల విట్టాల్ పొద్దున నిద్రలేచేసరికి షాక్ తిన్నాడు.... తాను రాత్రంతా ఓ మొసలికి అడుగు దూరంలో పడుకున్నానని తెలిసి... ఇంతకీ విషయం ఏంటంటారా... నీళ్లలో ఉండాల్సిన మొసలి అనుకోకుండా విట్టాల్ ఉంటున్న ఇంట్లోకి వచ్చేసింది... ఏకంగా ఆయన బెడ్రూంలో మంచం కింద దూరి రాత్రంతా గడిపింది... మంచంపైన నిద్రపోయిన విట్టాల్ ఈ విషయాన్ని మాత్రం గమనించలేకపోయాడు.
ఉదయం వంటమనిషి తన రూంలోంచి కేకలు వేయుడంతో ఆయనకు అసలు విషయం తెలిసింది. దీంతో 150 కేజీలు బరువు, ఎనిమిది అడుగుల పొడవున్న ఆ మొసలిని మంచం కింది నుంచి లాగి, సమీపంలోని చిగ్విడీ డ్యాంలో వదిలేశాడు.
పొడవైన ‘పిల్లి’..
కళ్లు మూసుకుని పాలు తాగుతున్న ఈ ‘పిల్లి’ పేరు హెర్క్యులస్. పొడవెంత ఉందో చూశారా? 10 అడుగులు! వాస్తవానికి ఇది లైగర్. ఇది కూడా పిల్లి జాతికి చెందినదే. ఆడ పులి, సింహానికి పుట్టినదన్నమాట. దీంతో పిల్లి జాతికి చెందిన వాటిలో అత్యంత పెద్ద జంతువుగా దీని పేరు గిన్నిస్ బుక్లోకి ఎక్కిపోయింది. 418 కిలోల బరువున్న హెర్క్యులస్ అమెరికాలోని దక్షిణ కరోలినా సఫారీ పార్కులో ఉంటోంది.
పొట్టి కారు...
బొమ్మ కారు కాదు.. నిజమైన కారే. అందుకే ప్రపంచంలోనే అత్యంత చిన్న కారు(రోడ్డుపై ప్రయాణించే సామర్థ్యం కలది)గా ఇది గిన్నిస్ బుక్-2014లోకి దూసుకుపోయింది. 25 అంగుళాల ఎత్తు, 2 అడుగుల 1.75 అంగుళాల వెడల్పు, 4 అడుగుల 1.75 అంగుళాల పొడవున్న ఈ కారును తయారుచేసింది ఈయనే. పేరు ఆస్టిన్ కౌల్సన్ (అమెరికా).