సౌత్లోకి బాలీవుడ్ నటి రీఎంట్రీ!
చెన్నై: నిన్నటితరం బాలీవుడ్ హీరోయిన్ మనీషా కోయిరాలాకు దక్షిణాది సినీ పరిశ్రమతో మంచి అనుబంధముంది. 'కిమినల్', 'భారతీయుడు', 'బొంబాయి' సినిమాలతో దక్షిణాదిలోనూ మనీష పేరు తెచ్చుకోంది. ఇప్పుడు మరోసారి దక్షిణాది సినిమాలో నటించేందుకు ఆమె సిద్ధమవుతోంది. జాతీయ అవార్డు సాధించిన ప్రఖ్యాత దర్శకుడు బాలా తమిళంలో తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్లో మనీషా కోయిరాలా కూడా నటించనుంది.
ఇప్పటికీ పేరు ఖరారుకాని ఈ సినిమా షూటింగ్ జూలైలో ప్రారంభం కానుంది. చిత్రంలో విశాల్, ఆధ్వర్వ, ఆర్య, అరవింద స్వామి, మనీషా ప్రధాన పాత్రల్లో నటించనున్నారని, మరో కీలక పాత్ర కోసం అనుష్కను అడుగుతున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకు 'కుట్ర పరంపరై' టైటిల్ ఖరారు చేస్తారని వినిపిస్తోంది. బాలా సొంత బ్యానర్ బీ స్టూడియోపై స్వీయ నిర్మాణంలో ఈ సినిమాను తెరకెక్కించవచ్చునని తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా.. బాలా తాజా సినిమా 'థరై థప్పట్టై' విడుదల ఆలస్యంగా కారణంగా ఈ ప్రాజెక్టు లో జాప్యం జరిగినట్టు తెలుస్తోంది. కాగా, బాలా తాజా సినిమా 'థరై థప్పటై' గురువారం ప్రపంచమంతటా విడుదల కానుంది.