ఈ గవర్నర్ మాకొద్దు
సాక్షి, చైన్నై: మాకొద్దు ఈ గవర్నర్..గో బ్యాక్ ఆర్ఎన్ రవి అనే నినాదంతో డీఎంకే కూటమి పోరుబాటకు సిద్ధమైంది. గవర్నర్ రవి వేదికలపై చేస్తున్న వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో ఆయనకు వ్యతిరేకంగా ఈనెల 12న భారీ ఎత్తున నిరసనకు డీఎంకే కూటమి నిర్ణయించింది. రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు సిద్ధమైంది. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మొదటి నుంచి వివాదాలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. వేదికలపై గవర్నర్ చేస్తున్న హిందూత్వ నినాద వ్యాఖ్యలు, సనాతన ధర్మ ఉపదేశాలు చర్చకు దారి తీస్తున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటికే రాష్ట్రంలో నిరసనలు పలుమార్లు జరిగాయి.
ఆయన తీరుపై రాష్ట్రపతికి, హోంశాఖకు ప్రభుత్వంతో పాటు తమిళ పార్టీలు ఫిర్యాదులు చేశాయి. అలాగే, తమిళనాడు ప్రభుత్వ తీర్మానాలను ఆయన తుంగలో తొక్కుతూ వస్తున్న నేపథ్యంలో డీఎంకే కూటమి తన ఆగ్రహాన్ని ప్రదర్శించడం పెరుగుతోంది. ఈ సమయంలో గురువారం గవర్నర్ చేసిన వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లైంది. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాల విషయంగా, వాటిని ఎలా ఆమోదించాలని, పక్కన పెట్టాలి అనే అంశాలను విద్యార్థులకు ఉపదేశించే సమయంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలను తమిళ పార్టీలు తీవ్రంగానే పరిగణించాయి. స్టెరిలైట్ వ్యవహారంలో ప్రజలను రెచ్చగొట్టారని గవర్నర్ చేసిన వ్యాఖ్యలను అన్నాడీఎంకే సైతం తీవ్రంగానే పరిగణించింది.
ఆ పార్టీ సంయుక్త కార్యదర్శి కేపీ మునుస్వామి స్పందిస్తూ, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే స్టెరిలైట్‌కు తాము అధికారంలో ఉన్నప్పుడు తాళం వేయాల్సి వచ్చిందన్నారు. అయితే, బాధ్యత గల పదవిలో ఉన్న గవర్నర్ వేదికలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమని విమర్శించారు. ఇక, న్యాయ శాఖ మంత్రి రఘుపతి అయితే, మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఆయన గవర్నర్ కాదని, రాజకీయనాయకుడి అవతారం ఎత్తిన వ్యక్తి అని మండిపడ్డారు. ఈ వివాదాల నేపథ్యంలో డీఎంకే కూటమి గవర్నర్‌కు వ్యతిరేకంగా చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి పిలుపునివ్వడం గమనార్హం.
12న భారీ నిరసన..
డీఎంకే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, మనిదనేయమక్కల్ కట్చి, కొంగునాడు దేశీయ కట్చి, తమిళర్ వాల్వురిమై కట్చి పార్టీల నేతృత్వంలోని కూటమి చలో రాజ్‌భవన్‌కు నిర్ణయించింది. గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ నేతలు ప్రకటన విడుదల చేశారు. ఈ గవర్నర్ తమకు వద్దేవద్దని నినదించారు. అసలు గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేయాలని పట్టుబట్టారు. తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో ఇలాంటి గవర్నర్ల ద్వారా ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టే విధంగా కేంద్రం వ్యవహస్తోందని ధ్వజమెత్తారు. గవర్నర్ల ద్వారా రాష్ట్రాలలో మరో ప్రభుత్వాన్ని నడిపించే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరును, గవర్నర్ పద్ధతిని ఖండిస్తూ భారీ ర్యాలీతో రాజ్‌భవన్‌కు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నామని ప్రకటించారు.
రాజ్‌భవన్ వివరణ..
గవర్నర్ వ్యాఖ్యలు దుమారాన్ని రేపడంతో రాజ్‌భవన్ అప్రమత్తమైంది. ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ రాజ్‌భవన్ అధికారులు ట్వీట్ చేశారు. నిబంధనలకు అనుగుణంగానే గవర్నర్ పనిచేస్తున్నారని వివరించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించే సమయంలో తన విధులను గుర్తు చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీ నుంచి వచ్చిన ముసాయిదాపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్‌కు మూడు అవకాశాలు ఉన్నాయని, వాటిని విద్యార్థులకు వివ రిస్తూ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారని, ఇందులో తప్పుబట్టాల్సిన అంశాలు లేవని పేర్కొన్నారు. గతంలో ఇదేవిధంగా గవర్నర్‌కు వ్యతిరేకంగా వచ్చిన నిరసనల సమయంలో వివరణ ఇవ్వని రాజ్‌భవన్ ప్రస్తుతం ట్వీట్ చేయడం కూడా చర్చకు దారి తీసింది.