ఎవరిది అందం?... వివాదాస్పదం
సాక్షి, చెన్నై : తమిళనాడులో ఓ టీవీ ఛానెల్ నిర్వహించే టాక్‌షోలో చిత్రీకరించిన వివాదాస్పద ఎపిసోడ్ ప్రసారం అయ్యే అవకాశాలు కనిపించటం లేదు. కేరళ-తమిళనాడు.. ఏ రాష్ట్రానికి చెందిన అమ్మాయిలు అందంగా ఉంటారంటూ గత నెలలో ఓ చర్చా వేదికను నిర్వహించారు. దానిపై తీవ్ర దుమారం చెలరేగగా.. ఇప్పుడు పోలీసులు ఎపిసోడ్ టెలికాస్ట్ కానివ్వకుండా అడ్డుకుంటున్నారు.
విజయా టీవీలో ప్రసారమయ్యే నీయా నానా(నువ్వా-నేనా) షోలో ఈ చర్చను నిర్వహించారు. కేరళ-తమిళనాడుకు చెందిన అమ్మాయిలు ఇందులో పాల్గొన్నారు. పైగా యాంకర్ గోపీనాథ్ ఈ విషయంలో ఆన్లైన్ పోల్ కూడా నిర్వహించారు. అయితే ఈ చర్చ అసమంజసంగా.. అభ్యంతరంగా ఉందంటూ కొంత మంది ఉద్యమకారులు, మహిళా మీడియా ప్రతినిధుల బృందం(ఎన్‌డబ్ల్యూఐఎం ) ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రసారం కావాల్సిన ఆ ఎపిసోడ్‌ను పోలీసుల ఆదేశాలతో దానిని రద్దు చేసినట్లు ఛానెల్ ప్రకటించింది.
అయితే అది కేవలం వారి అభిప్రాయాలు మాత్రమేనని.. వారిలోని వ్యక్తిత్వాన్ని పెంపోందించేలా చర్చ కొనసాగిందని టాక్‌షో దర్శకుడు ఆంటోనీ చెబుతున్నారు. వామపక్ష భావజాలాలున్న కొందరు అభ్యంతరం వ్యక్తంచేసిన నేపథ్యంలోనే ఆ ఎపిసోడ్‌ను ప్రసారం చెయ్యనియ్యకుండా తమను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. సరిగ్గా టెలికాస్టింగ్ సమయంలో వారు వివాదం చేయటమేంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎన్‌డబ్ల్యూఐఎం ప్రతినిధి కవితా మురళిధరన్ స్పందించారు. ‘‘భావస్వేచ్ఛ ప్రకటనకు మేము భంగం కలిగించబోం. కాకపోతే మహిళలను కించపరిచేలా ఉందన్న విషయం ప్రోమోల ద్వారా స్ఫష్టంగా తెలిసిపోతుంది. అందం ఎవరిదన్న ప్రశ్నలు అంత స్ఫష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే తాము ఎపిసోడ్‌ను అడ్డుకుంటున్నామని కవిత చెబుతున్నారు.