ప్రొద్దుటూరును ఆదర్శంగా తీసుకోవాలి
ప్రొద్దుటూరు టౌన్:
క్రమశిక్షణ, కట్టుబాట్లు, ఐకమత్యం ఇవన్నీ ప్రొద్దుటూరు ఆర్యవైశ్యుల్లో ఉన్నాయని, రాష్ట్రంలోని ఆర్యవైశ్యులు వీటిని ఆదర్శంగా తీసుకోవాలని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. వైఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు పట్టణం శ్రీవాసవి కాటన్ మర్చంట్స్ అసోసియేషన్ కల్యాణ మండపంలో ఆదివారం ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో జరిగిన దివ్యశతాధిక సావనీర్ ఆవిష్కరణ కార్యక్రమానికి
రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రొద్దుటూరు ఆర్యవైశ్యుల్లో ఒక ప్రత్యేక ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా శ్రీవాసవికన్యకాపరమేశ్వరి దేవాలయం ఉందన్నారు. ఆర్యవైశ్య సంఘాలు కొన్ని కార్యక్రమాలను పరిమితంగా పెట్టుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇటీవల శ్రుతిమించిన ఆలోచనలు జరుగుతున్నాయని, ఇలాంటివి మంచిది కాదన్నారు. మనలో ఐకమత్యానికి భంగం కలుగుతుందనే ఆందోళన తనకు ఉందన్నారు. ఆర్యవైశ్య సభను రాజకీయాలకు ముడిపెట్టవద్దని కోరారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఆర్యవైశ్యుల్లో ఉన్న పేదలకు అందడం లేదన్నారు. ఈ సందర్భంగా రోశయ్యను ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామమోహన్‌రావు, ఉపాధ్యక్షుడు శివశంకర్ సత్యనారాయణ తదితరులు పూలమాల, శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామసుబ్రమణ్యం, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ మెంబర్ గుబ్బా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.