రెండో ‘స్సారీ’., కమలనాథులకు షాక్!
►అమిత్ షా పర్యటన రద్దు
►కమలనాథులకు షాక్
►ఏర్పాట్లన్నీ బూడిదలో పోసిన పన్నీరే
►మారిన బిజేపీ వ్యూహం
రాష్ట్రంలోని కమలనాథులకు రెండోసారి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హ్యాండిచ్చారు. అమిత్ షా పర్యటన రద్దు సమాచారం కమలనాథులకు షాక్ తగిలినట్టు అయింది. ఆయన దృష్టిలో పడేందుకు బ్రహ్మరథం పట్టే రీతిలో సాగిన ఏర్పాట్లన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. తమిళనాట అన్నాడీఎంకే రాజకీయ ఉత్కంఠ నేపథ్యంలో తన పర్యటన ప్రభావం వృథా ప్రయాస అన్న విషయాన్ని పరిగణించే అమిత్ షా వాయిదా వేసుకున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
సాక్షి, చెన్నై : తమిళనాట తమ బలాన్ని చాటుకోవడం లక్ష్యంగా బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టి అంతా తమిళనాడు మీదే ఉందని చెప్పవచ్చు. అయితే, కేడర్‌ను సమాయత్తం చేసే రీతిలో, వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపే విధంగా అమిత్ షా అడుగుల వేగం పెరగ లేదు. అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాలను అనుకూలంగా మలచుకునేందుకు ఓవైపు దృష్టి కేంద్రీకరిస్తూనే మరోవైపు తమిళనాడును తమ గుప్పెట్లోకి తీసుకోవాలనే భావనతో వ్యూహాల్ని మాత్రం రచించి పెట్టుకుంటూ వస్తున్నట్టుగా సంకేతాలు ఉన్నాయి. మే నెలలో అమిత్ షా పర్యటన సాగాల్సి ఉన్నా చివరి క్షణంలో రద్దయింది. అయితే, ఈసారి ఆయన పర్యటన ఖాయం అన్న బీజేపీ వర్గాల్లో ధీమా నెలకొంది.
నిరాశే మిగిలింది
అ«ధ్యక్షుడు వస్తారని ఎదురుచూసిన కమలనాథులకు మిగిలింది నిరాశే. అమిత్‌షా పర్యటన అర్ధాంతరంగా రద్దు కావడం, మళ్లీ ఎప్పుడు వస్తారోనన్న విషయాన్ని కూడా ప్రకటించక పోవంతో ఏర్పాట్లన్నీ బుడిదలో పోసిన పన్నీరుగా మారింది. రోడ్లకు ఇరు వైపులో భారీ హంగామాతో ఏర్పాట్లు సాగడం, చివరకు అధినేత పర్యటన రద్దు సమాచారంతో కమలనాథుల్లో తీవ్ర వేదనకు గురి చేసిందని చెప్పవచ్చు.
ఆగమేఘాలపై చేసిన ఏర్పాట్లను తొలగించుకోక తప్పలేదు. ఇక, చెన్నైకు పరుగున వచ్చిన నేతలందరూ నిరుత్సాహంతో తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. అయితే, అమిత్ షా పర్యటన రద్దు కేవలం ఢిల్లీ వేదికగా జరగనున్న సీఎంల సమావేశం, తదుపరి కార్యక్రమాలే కారణంగా బిజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ ప్రకటించారు. ప్రస్తుతానికి పర్యటన రద్దయినా, మళ్లీ ఏదో ఒకరోజు వస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
మారిన వ్యూహం
జార్జ్ కోటను కైవశం చేసుకోవడం లక్ష్యంగా బీజేపీ తీవ్ర వ్యూహాల్ని రచిస్తున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే రాజకీయ పరిణామాల్ని తమకు అనుకూలంగా మలచుకున్నా, డీఎంకేని నిలువరించడం లక్ష్యంగా కొత్త ఎత్తు గడలకు అమిత్ షా సిద్ధం అయ్యారని చెప్పవచ్చు. అందుకు తగ్గ వ్యూహాలకు పదును పెట్టే విధంగా మూడు రోజుల పర్యటనకు నిర్ణయించారు. ఈసమయంలో పన్నీరు, పళని శిబిరాలు ఏకం కావడంతో తమిళనాట రాజకీయం వెడెక్కింది. ఈపరిస్థితుల్లో తన పర్యటన వృధా ప్రయాసగా మారే అవకాశం ఉందన్న విషయాన్ని అమిత్ షా పరిగణించినట్టు సమాచారం. అలాగే, అన్నాడీఎంకే శిబిరాలు ఏకమైన సమయంలో తాను తమిళనాట అడుగు పెట్టిన పక్షంలో, ఇప్పటికే సాగుతున్న ఆరోపణలకు బలం చేకూర్చినట్టుగా, కొత్త ఆరోపణలకు తెరలేపినట్టు అవుతుందనే నిర్ణయానికి వచ్చే పర్యటన రద్దు చేసుకున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
రెండోసారీ రద్దు
జాతీయ అధ్యక్షుడి మూడు రోజుల పర్యటన ఖరారు కావడంతో కమలనాథుల్లో ఉత్సాహం ఆవహించింది. తమ అధ్యక్షుడి దృష్టిలో పడేందుకు నేతలందరూ తీవ్రంగానే కుస్తీలు పట్టారు. ఆదివారం నుంచి చెన్నైలో ఆయన పర్యటించే ప్రాంతాల్లో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను హోరెత్తించారు. మీనంబాక్కం విమానాశ్రయం నుంచి అమిత్ షా పర్యటన సాగే అన్ని మార్గాల్లో అడుగడుగున ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. నేతలందరూ పోటాపోటీగా తమ నేతకు బ్రహ్మరథం పట్టే ఆహ్వానానికి ఏర్పాట్లు చేశారు. అంతే కాదు, రాష్ట్రం నలుమూలల నుంచి నేతలు, పార్టీ పదవుల్లోని వారు సోమవారం ఉదయాన్నే చెన్నైకి చేరుకున్నారు.
నగరంలోని ఓ హోటల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మీడియా సమావేశానికి సైతం చర్యలు తీసుకున్నారు. మీడియా వర్గాలకు పాస్‌ల పంపిణీ నిమిత్తం ఫోటోలను సైతం సేకరించారు. పదిన్నర గంటలకు తొలుత ప్రెస్ మీట్ అన్న సమాచారం రాగా, తదుపరి 11.30కు వాయిదా వేశారు. ఈ సమయంలో అమిత్‌షా పర్యటన రద్దు సమాచారం రాష్ట్రంలోని కమలనాథులకు పెద్ద షాక్ తగిలేలా చేసింది.