ఎంఎంకేలో వార్
సాక్షి, చెన్నై : మనిద నేయమక్కల్ కట్చి(ఎంఎంకే)లో వార్ బయలు దేరింది. పార్టీని చీల్చేందుకు మంగళవారం ప్రధాన కార్యదర్శి తమీమ్ అన్సారి యత్నించారు. పెద్దల జో క్యంతో ఆ ప్రయత్నాన్ని విరమించి సామరస్యానికి తమీమ్ సిద్ధమయ్యారు. దీంతో ఆగమేఘాలపై పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఎంఎంకే నేత, ఎమ్మెల్యే జవహరుల్లా ఏర్పాటు చేశారు. భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించారు. తమిళనాడు ముస్లిం మున్నేట్ర కళగంలో భాగంగా, రాష్ర్టంలో అత్యధిక మైనారిటీల ఓటు బ్యాంక్ కల్గిన పార్టీగా మనిదనేయ మక్కల్‌కట్చి(ఎంఎంకే) అవతరించింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మూడుచోట్ల తమ అభ్యర్థుల్ని నిలబెట్టగా, ఇద్దరు అఖండ మెజా రిటీతో గెలిచారు. మరొకరు స్వల్ప ఓట్లతో ఓటమి చవి చూశారు. ఆ ఎన్నికల్ని అన్నాడీఎంకేతో కలసి ఎదుర్కొన్న ఈ పార్టీ ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో డిఎంకే పక్షాన చేరింది. అక్కడి నుంచి బయటకు వచ్చి ఐదు పార్టీల ప్రజా కూటమితో కలసి కొన్నాళ్లు పనిచేసి, చివరకు అందులో నుంచి కూడా బయటకు వచ్చి, భవిష్యత్ ప్రణాళిక మీద దృష్టి పెట్టారు ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే జవహరుల్లా.
వార్..చీలిక యత్నం : పార్టీ నేత జవహరుల్లా ఇటీవలి కాలంగా వ్యవహరిస్తున్నతీరు ఆ పార్టీలో అసంతృప్తిని రగిల్చింది. రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి పనిచేద్దామన్న నిర్ణయానికి జవహరుల్లా వచ్చి ఉండటాన్ని అసంతృప్తి వాదులు వ్యతిరేకించి ఉన్నారు. అదే సమయంలో తమ వ్యతిరేకతను చాటుకునే రీతిలో సోమవారం తిరువారూర్ వేదికగా జరిగిన ప్రజా కూటమి సదస్సులో అసంతృప్తి వాదులు ప్రత్యక్షం కావడం చర్చకు దారి తీసింది. ఈ బృందానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమీమ్ అన్సారి నేతృత్వం వహించడం గమనార్హం. ఆ వేదిక మీద ప్రత్యక్షం కావడంతో పాటుగా జవహరుల్లాపై బహిరంగ వార్‌కు రెడీ అయ్యారు. ఇందు కోసం మంగళవారం ఎగ్మూర్ సిరాజ్ మహల్ వేదికగా ఎంఎంకే సర్వ సభ్య సమావేశానికి పిలుపు నిచ్చారు. ఈ సమాచారంతో మేల్కొన్న జవహరుల్లా తాంబరం వేదికగా పార్టీ సర్వ సభ్య సమావేశానికి పిలుపు నివ్వడంతో పార్టీ వర్గాల్లో ఉత్కంఠ బయలు దేరింది. బొటాబొటీగా సాగబోతున్న సర్వ సభ్య సమావేశాలతో ఇక, ఎంఎంకే చీలినట్టేనన్న ప్రశ్న, ప్రచారం బయలు దేరింది. ఇంతలో తమిళనాడు ముస్లీం మున్నేట్ర కళగం పె ద్దలు రంగంలోకి దిగడంతో వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టుంది.
వెనక్కి తమీమ్: ముస్లీం సామాజిక వర్గంతో నిండిన ఎంఎంకేలో చీలిక యత్నం సమాచారంతో ఉదయాన్నే ఉత్కంఠ నెలకొంది. ఎగ్మూర్ సిరాజ్ మహల్‌కు తమీమ్ నేతృత్వంలో ఆ పార్టీ వర్గాలు తరలి వచ్చారు. అలాగే, తాంబరం వేదికకు తమిళనాడు ముస్లీ మున్నేట్ర కళగంతో పాటుగా, ఎంఎంకే నేత జవహరుల్లాతో కలసి పార్టీ వర్గాలు పెద్ద సంఖ్యలోనే తరలి వచ్చాయి. ఇంతలో హఠాత్తుగా తమీమ్ వెనక్కి తగ్గారు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, సిరాజ్ మహల్ వేదికగా నిర్వహించ తలబెట్టిన సర్వ సభ్య సమావేశాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించారు. పార్టీలో వివాదాలు వద్దంటూ పెద్దలు సూచించారని, అలాగే, వీసీకే నేత తిరుమావళవన్, నామ్ తమిళర్ కట్చినేత సీమాన్ తనతో మాట్లాడారని, పార్టీలో ఎలాంటి చీలికలు వద్దు , సామరస్య పూర్వకంగా కలిసి మెలిసి పనిచేయాలని సూచించారని, అందుకే తన ప్రయత్నాల్ని విరమించుకున్నట్టు ప్రకటించారు.
భవిష్యత్ కార్యాచరణ :
తాంబరం వేదికగా జరిగిన సభకు తమీమ్ అన్సారి అండ్ బృందం దూరంగా ఉన్నా, జవహరుల్లా నేతృత్వంలో సర్వ సభ్య సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీలో నెలకొన్న అనిచిత పరిస్థితి, సమస్యలను సమీక్షించి, పునారవృతం కాకుండా జాగ్రత్తలకు సిద్ధమయ్యారు. ఆ సమావేశం తీరా్మానాలు ప్రకటించాల్సి ఉంది. ఇక, ఈ సమావేశానికి ముందుగా జవహరుల్లా మాట్లాడుతూ, ఎంఎంకేను చీల్చేందుకు పెద్ద కుట్ర జరుగుతున్నదని ధ్వజమెత్తారు. ఈ కుట్ర చేస్తున్న వాళ్లెవరో త్వరలో తేలుతుందన్నారు. సర్వ సభ్య సమావేశానికి 95 శాతం మంది తరలి వచ్చారని, తమీమ్ తన సమావేశాన్ని రద్దు చేసుకున్నట్టు సంకేతాలు వచ్చాయన్నారు. ఎంఎంకేను నిర్వీర్యం చేయడం ఎవరి తరం కాదు అని, ఎన్నికుట్రలు చేసినా భగ్నం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.