పింఛన్లు రెడీ.. లబ్ధిదారులేరీ..!
తాండూరు: అర్హత ఉన్నా జాబితాలో పేరు లేదని, తనకు పింఛన్ మంజూరు కాలేదని పలువురు పేదలు గగ్గోలు పెడుతున్నారు. ఆలస్యమైనా పింఛన్ వస్తుందనే ఆశతో మళ్లీమళ్లీ దరఖాస్తులు అందజేస్తున్నారు. అయితే తాండూరు మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పింఛన్ రాక జనాలు ఓవైపు లబోదిబోమంటుంటే ఇక్కడ దాదాపుగా రెండొందలకు పైగా లబ్ధిదారుల జాడ కనిపించడం లేదు. అలాగే ఒక పేరుపైనే డబుల్ పింఛన్లు మంజూరయ్యాయి. ఓ మృతి చెందిన వ్యక్తికి సైతం పింఛన్ మంజూరైంది. దీంతో మున్సిపల్ అధికారులు పింఛన్ డబ్బులు ఉన్నా పంపిణీ చేయలేని అయోమయంలో పడిపోయారు.
వివరాల్లోకి వెళితే.. తాండూరు మున్సిపాలిటీలో మొత్తం 8 రెవెన్యూ వార్డుల పరిధిలో 31 వార్డులు ఉన్నాయి. మొత్తం 5,051మంది వృద్ధులు, వికలాంగులు, వితంతు, చేనేత,కల్లుగీతకార్మికులకు పింఛన్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం రెండు విడతల్లో గత ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాలకు కలిపి మొత్తం కోటీ 4లక్షల 16వేల రూపాయలను విడుదల చేసింది. ఆయా వార్డుల్లో, మున్సిపల్ కార్యాలయంలో పలు దఫాలుగా జాబితా ప్రకారం లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు అందజేశారు.
ఇలా ఈనెల 5వ తేదీ వరకు సుమారు 4,717మందికి రూ.98.92లక్షలను పంపిణీ చేయగా సుమారు రూ.5.24 లక్షలు ఇంకా పంపిణీ కాలేదు. 246 మంది పేర్లు జాబితాలో ఉన్నప్పటికీ.. వారు మొత్తం వార్డుల్లో ఎక్కడా లేరు. ముగ్గురు పేరు మీద పింఛన్లు రెండు సార్లు(డబుల్) వచ్చాయి. మృతి చెందిన ఒకరికి పింఛన్ మంజూరైంది. ఒక వార్డు లబ్దిదారుడు మరో వార్డులో, ఇంటినంబరు తప్పు, ఆధారు కార్డులో వివరాల పొరపాటు తదితర కారణాలతో కూడా కొంతమందికి పింఛన్లు పంపిణీ కాలేదు.
తాండూరు మండలం మల్కాపూర్ అడ్రస్‌గా ఒకరికి పింఛన్ పట్టణంలో రావడం గమనార్హం. అయితే డబుల్, మృతి చెందిన పింఛన్‌దారులను మినహాయిస్తే 246మంది ఎవరు.. ఎక్కడున్నారు? స్థానికంగా లేని వారి పేరు మీద పింఛన్లు ఎలా మంజూరయ్యాయి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారా..తదితర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎవరో.. ఎక్కడుంటున్నారో తెలియక రూ.5.24 లక్షల పింఛన్ డబ్బులు మిగిలిపోయినట్టు మున్సిపల్ బిల్‌కలెక్టర్ రమేష్ వివరించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు నివేదించామన్నారు. కలెక్టర్ ఆదేశాల తరువాత మున్సిపల్ కమిషనర్ సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.