ర్యాంకు వచ్చిందని.. బీఎండబ్ల్యు కారిచ్చారు!!
ఐఐటీ ప్రవేశపరీక్షలో ర్యాంకు కొట్టడమే గొప్ప అనుకుంటే.. ఆ ఘనత సాధించినందుకు వచ్చిన గిఫ్ట్ చూస్తే కళ్లు తిరగాల్సిందే. ఐఐటీ జేఈఈ (అడ్వాన్స్డ్) పరీక్షలో జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు సాధించిన తన్మయ షెకావత్ అనే విద్యార్థికి రాజస్థాన్‌లోని కోచింగ్ సంస్థ ఏకంగా బీఎండబ్ల్యు కారు బహుమతిగా ఇచ్చింది. తమ సంస్థలో కోచింగ్ తీసుకుని, 20లోపు ర్యాంకు ఎవరైనా సాధిస్తే వారికి ఈ కారు ఇస్తానని సంస్థ డైరెక్టర్ ముందే ప్రకటించారు. అన్నట్లుగానే షెకావత్‌కు మంచి ర్యాంకు వచ్చింది. దాంతో డబుల్ బొనాంజా కొట్టిన తన్మయ.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని కలలు గంటున్నాడు.
అయితే.. అతడికి వచ్చిన బహుమతి కొత్త కారు మాత్రం కాదు, సెకండ్ హ్యాండ్‌ది. ఇప్పటికి 1500 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇంతకుముందు కోచింగ్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎల్ పూనియా స్వయంగా దాన్ని నడిపారు. కారు విలువ దాదాపు రూ. 27 లక్షలు. ఇప్పటివరకు చాలా కోచింగ్ సంస్థలు మంచి బహుమతులే ఇచ్చినా, ఇంత కాస్ట్లీ గిఫ్టు ఇవ్వడం మాత్రం ఇదే మొదటిసారి.