ప్చ్.. పవన్‌తోనూ పనికాలేదు
ఎంతో కష్టపడి సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తీసుకొచ్చినా ఏ మాత్రం వర్కవుట్ కాలేదని తణుకు టీడీపీ నేతలు వాపోతున్నారు. నరసాపురం మోడీ సభకు వచ్చిన ఆయనను బతిమాలుకుని తణుకులో సభకు తీసుకొస్తే తమకు ఖర్చు తప్ప ఒరిగిందేమీ కనిపించడం లేదని ఆ పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. నియోజకవర్గంలో కాపు కులస్తులు ప్రధాన సామాజిక వర్గంగా ఉన్నారు. పవన్ కల్యాణ్‌తో ఆ వర్గం ఓట్లలో చీలిక తేవచ్చని స్థానిక టీడీపీ నేతలు భావించారు.
అయితే సినీనటుడైన పవన్‌ను చూడడానికి వచ్చామే తప్ప టీడీపీ, బీజేపీలకు ఓట్లెయ్యడానికి కాదని వచ్చిన వారు, పవన్ అభిమానులు తెగేసి చెప్తుండడం తమ్ముళ్లను కుదేలు చేసింది. అంతేగాక నరసాపురం వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి వంక రవీంధ్రనాథ్కు, తణుకు అసెంబ్లీ అభ్యర్థి చీర్ల రాధాకృష్ణ (రాధయ్య)కు మద్దతు తెలుపుతూ తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల నుంచి జనసేన కార్యకర్తలు భారీగా వైఎస్సార్ సీపీలో చేరుతుండటం టీడీపీ నాయకులకు మింగుడుపడటంలేదు.
టీడీపీకి కంచుకోట అని భావించిన వేల్పూరు, మండపాకలో ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. తణుకులో టీడీపీ, బీజేపీ కార్యకర్తలు తలోదారనే రీతిలో ఉన్నారు. రాష్ట్ర విభజన కారకపార్టీలుగా ముద్రపడిన టీడీపీ, బీజేపీలు కలిసి ప్రచారం చేస్తుండటం వల్ల టీడీపీ మద్దతుదారులు దూరంగా ఉంటున్నారు. చేరదీస్తున్న వర్గాలు సైతం వైఎస్సార్ సీపీలో చేరిపోతుండడం టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో వారు డబ్బును, మద్యాన్ని నమ్ముకోవడమే మేలనే అంచనాకు వచ్చారు.