పిట్టగోడ ప్రాణం తీసింది
వెంకట్రాయపురం (తణుకు): అపార్టుమెంట్‌లోని బాల్కనీలో దుస్తులు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మహిళ మృతిచెందిన ఘటన శనివారం తణుకులో చోటుచేసుకుంది. తణుకు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకు మండలం వెంకట్రాయపురంలోని హరిశ్చంద్ర ఎన్క్లేవ్ లోని ఉప్పలపాటి సౌజన్య (27) తన త ల్లితో నివాసం ఉంటోంది. శనివారం మధ్యాహ్నం బాల్కనీలో దుస్తులు ఉతికి తాడుపై ఆరేస్తుండగా కాలు జారి కింద పడిపోయింది. మూడో అంతస్తు నుంచి జారిపడటంతో తలకు తీవ్రగాయమై అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె భర్త డానియేల్ గతేడాది రాజమండ్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమెకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. మృతురాలి సోదరుడు రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ బి.జగదీశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రక్షణ చర్యలు శూన్యం: అపార్టుమెంట్లో బాల్కనీ పిట్టగోడ ఎత్తు తక్కువగా ఉండటంతోనే సౌజన్య మృతి చెందినట్టు అపార్టుమెంటువాసులు చెబుతున్నారు. పిట్టగోడ కనీసం మూడు అడుగులు ఎత్తు కూడా లేకపోవడంతో ఆమె ముందుకు వంగి దుస్తులు ఆరేస్తున్న సమయంలో కాళ్లు పట్టు తప్పినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఎన్‌క్లేవ్‌లో 125 కుటుంబాలు నివసిస్తున్నా సరైన రక్షణ చర్యలు లేవని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల ఓ ప్లాట్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. కనీసం మంటలను అదుపుచేసుందుకు కూడా ఇక్కడ సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో అగ్నిమాపక వాహనం వచ్చేవరకూ వేచి చూడాల్సి వచ్చింది. అప్పటికే ప్లాట్ మొత్తం కాలిపోవడంతో పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది.