దేవతలారా... మన్నించండి!
నమో నాస్తికా!
సృజనాత్మకత అదుపు తప్పితే ఘోర ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో కళాకారుడి ప్రతిష్ట కాళ్లూ చేతులు పోగొట్టుకుంటుంది. నష్టం లేదు. కానీ చుట్టుపక్కల దెబ్బతినే మనోభావాల మాటేమిటి? వాటికి ఏ కళాకారుడొచ్చి మందు రాస్తాడు? రాసినా అది ఓదార్పో, ఉపశమనమో అవుతుంది కానీ పరిహారమో, ప్రాయశ్చిత్తమో కాలేదు.
ఇలాంటి ఘోర ప్రమాదమే ఒకటి ఇటీవల ముంబైలోని ‘తప్రూట్’ అనే యాడ్ ఏజెన్సీ వల్ల జరిగింది. గృహహింసకు వ్యతిరేకంగా ఈ సంస్థ రూపొందించిన చిత్రాలలోని మితిమీరిన సృజనాత్మకత వివాదానికి కారణమయింది. లక్ష్మీదేవి, సరస్వతీ దేవి, దుర్గామాత... వీరు ముగ్గురూ గృహ హింసకు గురైనట్లుగా, వారి ముఖాలపై గాయాలను, కమిలిన గుర్తులను చేర్చి ఈ ఏజెన్సీ పోస్టర్లు విడుదల చేసింది. వాటి కింద ఇలా రాసి ఉంటుంది. ‘‘ఇలాంటి రోజు ఒకటి రాకూడదని ప్రార్థించండి. నేడు భారతదేశంలో 68 శాతం మంది గృహహింసకు గురవుతున్నారు. రేపు ఎవరూ ఇందుకు మినహాయింపు కాకపోవచ్చు. ఆఖరికి మనం పూజించే దేవతలు కూడా’’.
‘సేవ్ అవర్ సిస్టర్స్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ కోసం తయారైన పోస్టర్లు ఇవి. అయితే ప్రమాదాన్ని ముందుగా ఊహించిన ఆ సంస్థ వీటిని ఇంటర్నెట్ ప్రచార ఉద్యమానికి మాత్రమే పరిమితం చేసింది. ఉద్దేశాలు మంచివే కావచ్చు. కానీ వాటిని వ్యక్తం చేసే విధానం సక్రమంగా లేకపోతే వాటిని ఎవరూ సమర్థించరు. మత విశ్వాసాల విషయంలో అస్సలు క్షమించరు. ఎంతటి సృజనశీలురైనా ఈ వాస్తవాన్ని గుర్తించక తప్పదు.