target 2019
-
టీజేఎస్ టార్గెట్ 2019
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు రాబోతుండడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌లో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో పాగా వేసుకొని ఉండగా, వచ్చే ఎన్నికల నాటికి ఆ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఇన్నాళ్లు తెలంగాణ ఉద్యమ సారథిగా ఉన్న టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం తెలంగాణ జన సమితి (టీజేఎస్) పేరుతో రాజకీయ రంగ ప్రవేశం చేయడం రాష్ట్రంలోనే గాక సొంత జిల్లా రాజకీయాలను సైతం ప్రభావితం చేయబోతుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో పార్టీ బలోపేతానికి కోదండరాం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ టీజేఎస్, తెలుగుదేశంతో పొత్తు ఆలోచనలు ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టార్గెట్–2019 పేరుతో నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. టీజేఎస్ ఇంట గెలిచేలా... మంచిర్యాల జిల్లా బెల్లింపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం జోగాపూర్ ప్రొఫెసర్ కోదండరాం స్వగ్రామం. ప్రొఫెసర్‌గా ఉస్మానియా యూనివర్సిటీకి, తెలంగాణ ఉద్యమానికి అంకితమై హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నా సొంత ఊరుతో సంబంధాలు కొనసాగుతున్నాయి. సింగరేణి ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆయన జిల్లాలో గతంలో కూడా ఆందోళనలు సాగించారు. ఆయన టీజేఎస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడి ప్రకారం పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్కు ధీటుగా టీజేఎస్‌ను నిలబెట్టాలనే ఆలోచనతో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా జేఏసీకి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో కోదండరాంతో గతంలో సంబంధాలు కొనసాగించిన వారిని పార్టీలోకి తీసుకోబోతున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికీ కోదండరాంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ టిక్కెట్టు చివరి నిమిషంలో దక్కని వారు కూడా టీజేఎస్ ద్వారా రాజకీయ ప్రస్థానం సాగించాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే పార్టీ నిర్మాణ దశలో ఉన్నందున తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దనే ఆలోచనతో ఆశావహులతో పాటు పార్టీ నేతలు కనిపిస్తున్నారు. ఈనెల 13న కోదండరాం బెల్లంపల్లికి వస్తుండడంతో ఆరోజు పార్టీకి సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. మంచిర్యాల నుంచి కోదండరాం? వచ్చే ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గం నుంచి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని ఆయన ధ్రువీకరించడం లేదు. ఇటీవలే మంచిర్యాల, కుమురం భీం జిల్లాలకు పార్టీ ఇన్చార్జిగా గురిజాల రవీందర్రావును టీజేఎస్ నియమించింది. రవీందర్‌రావుకు మంచిర్యాల నియోజకవర్గంలో మంచి సంబంధాలు ఉండడంతో పాటు ఇక్కడి బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో కోదండరాం పోటీ చేయని పక్షంలో మంచిర్యాల నుంచి రవీందర్‌రావుకే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన కూడా సింగరేణి ఓపెన్‌కాస్ట్ భూముల సమస్యపై పోరాటం సాగిస్తున్నారు. రవీందర్రావు కుమురం భీం జిల్లాకు కూడా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నప్పటికీ, అక్కడ ప్రస్తుతానికి అంతగా ప్రభావం లేదు. చెన్నూరులో టీజెఎస్ తరుపున పొడేటి సంజీవ్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బెల్లంపల్లిలో ఎన్నికల ముందు మారే సమీకరణాలను బట్టి బలమైన నాయకుడిని బరిలోకి దింపే ఆలోచనలతో ఉన్నట్లు సమాచారం. సిర్పూరులో పాల్వాయి హరీష్? సిర్పూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు తనయుడు పాల్వాయి హరీష్‌రావు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తన తండ్రి తరహాలోనే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలనేది ఆయన ఆలోచన. ఈ మేరకు నియోజకవర్గంలో పర్యటనలు జరుపుతున్నారు. ఇప్పటికే బెజ్జూరు, పెంచికల్‌పేట మండలాల్లో 20 రోజుల పాటు పాదయాత్రలు జరిపారు. సిర్పూరు నుంచి హరీష్‌రావును టీజేఎస్ తరుపున పోటీ చేయించే ఆలోచనతో కోదండరాం పార్టీ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే హరీష్‌తో సంప్రదింపులు జరిపినప్పటికీ, ఆయన వేచిచూసే ధోరణితో ఉన్నట్లు తెలిసింది. ఆదిలాబాద్‌లో ఆశావహులు ఎక్కువే... ఆదిలాబాద్ జిల్లాలో టీజేఎస్ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది. టీజేఏసీ ఆదిలాబాద్ చైర్మన్‌గా వ్యవహరించిన దుర్గం రాజేశ్వర్ ప్రస్తుతం పార్టలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేసే ఆలోచనతో ఉన్నారు. బీజేపీలో 20 సంవత్సరాల పాటు పనిచేసిన ఆయన గతంలో పార్టీ నుంచి టిక్కెట్‌ను ఆశించినప్పటికీ భంగపడ్డారు. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి టీజేఏసీలో కీలకంగా వ్యవహరిస్తూ కోదండరాం ఉమ్మడి జిల్లాలో స్ఫూర్తి యాత్ర చేపట్టినప్పుడు ఆయన వెంట నడిచారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచే ఓ ఉపాధ్యాయ సంఘం నేత పార్టీ టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. గతంలో ఇంటెలిజెన్స్‌లో పనిచేసి పదవీ విరమణకు దగ్గరలో ఉన్న ఓ అధికారి బోథ్ నుంచి టీజేఎస్ టిక్కెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి రిటైర్డ్ ఎస్పీ మెస్రం నాగోరావు టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. గతంలో ఈయన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆదిలాబాద్ లోకసభ స్థానానికి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం టీజేఎస్ తరపున ఖానాపూర్ లేదా ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి అయినా పోటీ చేయాలని ఆసక్తి కనబర్చుతున్నారు. ఖానాపూర్‌లో ఓ కీలక నేత కూడా టీజేఎస్ నుంచి పోటీకి సిద్ధపడుతున్నట్లు సమాచారం. నిర్మల్‌లో అంతంత మాత్రమే తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో కీలకపాత్ర పోషించిన వివిధ రంగాల వ్యక్తులు, నాయకులే ప్రస్తుతం ప్రొఫెసర్ కోదండరాం ప్రారంభించిన టీ జేఎస్లోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. నిర్మల్‌కు ఇన్చార్జిగా నియమించిన శ్రీహరి బాధ్యతలు స్వీకరించేందుకు ఇష్టపడడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో కామారెడ్డికి చెందిన గోపాల్‌శర్మకు నిర్మల్« బాధ్యతలు అప్పగించి పార్టీని జనంలోకి తీసుకెళ్లాలనే యోచనలో కోదండరాం ఉన్నట్లు సమాచారం. కాగా గతంలో జేఏసీ జిల్లా కన్వీనర్‌గా ఉన్న విజయ్‌కుమార్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో ప్రస్తుతం నేరుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పార్టీకి ప్రస్తుతం జిల్లాలో పెద్ద దిక్కుగా భైంసాకు చెందిన వైద్యుడు రామకృష్ణరెడ్డి కొనసాగుతున్నారు. ముందు నుంచీ ఆయన కోదండరాం వెంట నడుస్తున్నారు. జిల్లాలో ఇప్పుడిప్పుడే సభ్యత్వాన్ని పెంచుకునే పనిలో పడుతున్నారు. విద్యావంతులు, పలు వర్గాలు పార్టీని ఆసక్తిగా గమనిస్తున్నాయి. పొత్తుల ఎత్తుల్లోనూ కాంగ్రెస్,టీజేఎస్‌లే కీలకం.. అధికార టీఆర్ఎస్ను గద్దె దించేందుకు విపక్షాలు ఏకతాటి పైకి వస్తే ఎన్నికల ముందు సమీకరణలు మారుతాయి. ఇప్పుడే అడుగులు వేస్తున్న టీజేఎస్‌తో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో టీడీపీతో కూడా పొత్తు పెట్టుకునే ఆలోచన కాంగ్రెస్‌కు ఉంది. ఒకవేళ ఈ మూడు పార్టీలతో పాటు కమ్యూనిస్టులు కూడా కలిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రశ్న. టీఆర్ఎస్, బీజేపీ యేతర∙ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పాటైనప్పటికీ... పది అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌లో కాంగ్రెస్, టీజేఎస్‌లే కీలకం కానున్నాయి. పొత్తులు కుదిరితే... సీపీఐ, టీడీపీకి ఒక్కో సీటు దక్కే అవకాశం ఉంది. టీజేఎస్ ఆవిర్భావ సభ దృశ్యం(ఫైల్) -
మనది మిషన్ 2019
ఐదేళ్లలో అధికారం దక్కాలి తెలంగాణ బీజేపీ గ్రామస్థాయి అధ్యక్షులకు అమిత్ షా పిలుపు సాక్షి, హైదరాబాద్: ‘‘కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలనేది బీజేపీ నినాదం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి నరేంద్రమోడీ ప్రధానమంత్రి కావటంతో అది నెరవేరినట్టు కాదు. అది పూర్తి కావాలంటే బీజేపీ యుక్త్ భారత్ రావాలి. అంటే ఇప్పుడు బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా మన జెండా ఎగరాలి. కేంద్రంలో పాలనా పగ్గాలు చేపట్టడం ద్వారా ఆ నినాదానికి తగ్గ కార్యాచరణ ఇప్పుడు మొదలైందని అర్థం చేసుకోవాలి. అందులో కీలకమైంది తెలంగాణ. మిషన్ 2019 దిశగా ఇక్కడి ప్రతి కార్యకర్తా పనిచేయాలి. ఐదేళ్లలో పార్టీ గతి మారి అధికారపీఠం దక్కించుకోవాలి’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. పార్టీ గ్రామస్థాయి కమిటీల అధ్యక్షులకు పిలుపునిచ్చారు. రెండు రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారమిక్కడి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ గ్రామస్థాయి అధ్యక్షులు, బూత్‌స్థాయి నేతలతో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు రావడంతో స్టేడియం కిక్కిరిసిపోయింది. నేతల నినాదాలు హోరెత్తటంతో ఆ ప్రాంగణం కన్నుల పండువగా ఉందంటూ అమిత్ షా ఉత్సాహంగా ప్రసగించారు. ‘‘ఇటీవలి ఎన్నికల ఫలితాల సరళి తెలుసుకుంటున్న క్రమంలో 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో 73 సీట్లు గెలిచామని, సొంతంగా అధికారాన్ని చేపట్టే సంఖ్యలో సీట్లు బీజేపీకి వచ్చాయన్న సంగతులు తెలిసి సంతోషపడ్డాను. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో 23 శాతం ఓట్లను బీజేపీ సాధించిందనే విషయం మరింత ఉత్సాహాన్నిచ్చింది. అన్ని పార్టీల కంటే ముందుగా తెలంగాణ కోసం తీర్మానం చేసి రాష్ట్ర సాధన కు తీవ్రంగా కృషి చేసిన బీజేపీ ఆ ఎన్నికల్లో అంతమేర ఓట్లు సాధించటం సంతోషంగా అనిపించింది. ఇక్కడ పార్టీ అధికారంలోకి రావటం సాధ్యమనే సంకేతాలకు అది నిదర్శనం. వచ్చే ఐదేళ్లలో బూత్‌స్థాయి కార్యకర్తలు తలచుకుంటే అనుకున్నది సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే ప్రజాపక్షాన నిలిచి, వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేయండి’’ అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేనప్పుడు ఆ పనులెలా సాధ్యమనే అనుమానం వస్తుందని, కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, ప్రధానమంత్రి నరేంద్రమోడీ మనకు అండగా ఉంటారనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేసిందని, టీఆర్ఎస్ సహా ఇతర పార్టీలేవీ దాన్ని కోరకున్నా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రాసిన లేఖకు స్పందించి కేంద్రం దాన్ని మంజూరు చేసిందని పేర్కొన్నారు. అలాగే మంజూరు చేసిన ఏకైక ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని, ట్రైబల్ విశ్వవిద్యాలయాన్ని కూడా తెలంగాణకు కేటాయించారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల ప్రతి ఆకాంక్షను నెరవేర్చేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని స్పష్టంచేశారు. దీన్ని గుర్తించి కార్యకర్తలు పార్టీని గ్రామగ్రామానికి తీసుకెళ్లటమే కాకుండా బూత్ స్థాయిలో పార్టీ జెండా ఎగిరేలా చేయాలని సూచించారు. న వంబర్ ఒకటి నుంచి సభ్యత్వ నమోదు... ‘‘తెలంగాణలో బీజేపీకి కొత్త రక్తం కావాలి. ముఖ్యంగా యువకులు పార్టీలో చేరాల్సి ఉంది. దీన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని స్థానిక నేతలు పనిచేయాలి. నవంబర్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. ఆ సమయంలో బడులు, కళాశాలలకు కూడా పార్టీ నేతలు వెళ్లాలి’’ అని అమిత్ షా ఆదేశించారు. బూత్ స్థాయిలో పార్టీ బలపడటమంటే నరేంద్రమోడీని మరింత పటిష్టపరచటమనే విషయాన్ని ప్రతి కార్యకర్త గుర్తించాలని పేర్కొన్నారు. తెలంగాణలో కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు సమైక్యంగా పనిచేసి పార్టీని అధికారం దిశగా నడిపించాలని, ఆ పని వెంటనే మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిపై మోడీకి స్పష్టమైన అవగాహన.. ఏం చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందో స్పష్టమైన అవగాహనతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముందుకు సాగుతున్నారని షా తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై బుల్లెట్ ప్రూఫ్ రక్షణ లేకుండా మాట్లాడిన తొలి ప్రధాన మోడీ అని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి అవసరమైన రోడ్‌మ్యాప్‌ను అక్కడి నుంచే ప్రకటించిన ప్రధాని కూడా ఆయనేనన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రధాని పనిచేస్తున్నారని, యూపీఏ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి అధికారాన్ని అప్పగించినా ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా మోడీ సర్కారు తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలసి ముందుకు సాగుతూ తెలుగువారి అభివృద్ధికి ప్రయత్నించాలని ఆకాంక్షించారు. బిజీబిజీగా బీజేపీ అధ్యక్షుడు తెలంగాణలో పార్టీకి దిశానిర్దేశం చేయటానికి వచ్చిన అమిత్ షా.. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, వివిధ రంగాలకు చెందిన మేధావులు, కులసంఘాలతో బిజీబిజీగా గడిపారు. రెండు రోజుల నగర పర్యటనలో తొలుత పార్టీ కార్యక్రమాలకే సమయం కేటాయిస్తూ పార్టీ వర్గాలు షెడ్యూల్ రూపొందించాయి. కానీ వివిధ సంఘాల ప్రతినిధులు అపాయింట్మెంట్లు కోరడంతో చివరకు పార్టీ నేతలతో ఆయన ఎక్కువ సేపు గడిపే వీల్లేకపోయింది. రెండు రోజుల షా పర్యటన ఆసాంతం హడావుడిగా సాగింది. విభజన కష్టాల పరిష్కారానికి సహకరించండి అమిత్‌షాకు చంద్రబాబు వినతి విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సహకరించాల్సిందిగా సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కోరారు. షా శుక్రవారం చంద్రబాబు తన నివాసంలో ఇచ్చిన అల్పాహార విందుకు హాజరయ్యారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డిలతో పాటు టీడీపీ నేతలు ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకరరావు, కంభంపాటి రామ్మోహనరావు, సుజనాచౌదరి, పరకాల ప్రభాకర్ తదితరులు కూడా పాల్గొన్నారు. విభ జన అనంతరం రాష్ట్రం పలు సమస్యలు ఎదుర్కొంటోందని, వాటిని ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి తగిన సాయం అందేలా అధికార పార్టీ అధ్యక్షుడిగా చొరవ తీసుకోవాల్సిందిగా షాను చంద్రబాబు కోరారు.