టీజేఎస్‌ టార్గెట్‌ 2019 | 2019 Elections Main Target JAC Kodandaram | Sakshi
Sakshi News home page

టీజేఎస్‌ టార్గెట్‌ 2019

Published Sun, May 6 2018 11:52 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM

2019 Elections  Main Target  JAC Kodandaram - Sakshi

కోదండరాం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు రాబోతుండడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌లో  జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో పాగా వేసుకొని ఉండగా, వచ్చే ఎన్నికల నాటికి ఆ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఇన్నాళ్లు తెలంగాణ ఉద్యమ సారథిగా ఉన్న టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) పేరుతో రాజకీయ రంగ ప్రవేశం చేయడం రాష్ట్రంలోనే గాక సొంత జిల్లా రాజకీయాలను సైతం ప్రభావితం చేయబోతుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో పార్టీ బలోపేతానికి కోదండరాం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ పార్టీ టీజేఎస్, తెలుగుదేశంతో పొత్తు ఆలోచనలు ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టార్గెట్‌–2019 పేరుతో నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

టీజేఎస్‌ ఇంట గెలిచేలా...

మంచిర్యాల జిల్లా బెల్లింపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం జోగాపూర్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్వగ్రామం. ప్రొఫెసర్‌గా ఉస్మానియా యూనివర్సిటీకి, తెలంగాణ ఉద్యమానికి అంకితమై హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నా సొంత ఊరుతో సంబంధాలు కొనసాగుతున్నాయి. సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆయన జిల్లాలో గతంలో కూడా ఆందోళనలు సాగించారు. ఆయన టీజేఎస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడి ప్రకారం పూర్వ ఆదిలాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు ధీటుగా టీజేఎస్‌ను నిలబెట్టాలనే ఆలోచనతో ఉన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా జేఏసీకి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చరిత్ర ఉంది.

ఈ నేపథ్యంలో కోదండరాంతో గతంలో సంబంధాలు కొనసాగించిన వారిని పార్టీలోకి తీసుకోబోతున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికీ కోదండరాంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టిక్కెట్టు చివరి నిమిషంలో దక్కని వారు కూడా టీజేఎస్‌ ద్వారా రాజకీయ ప్రస్థానం సాగించాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే పార్టీ నిర్మాణ దశలో ఉన్నందున తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దనే ఆలోచనతో ఆశావహులతో పాటు పార్టీ నేతలు కనిపిస్తున్నారు. ఈనెల 13న కోదండరాం బెల్లంపల్లికి వస్తుండడంతో ఆరోజు పార్టీకి సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

మంచిర్యాల నుంచి కోదండరాం?

వచ్చే ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గం నుంచి టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని ఆయన ధ్రువీకరించడం లేదు. ఇటీవలే మంచిర్యాల, కుమురం భీం జిల్లాలకు పార్టీ ఇన్‌చార్జిగా గురిజాల రవీందర్‌రావును టీజేఎస్‌ నియమించింది. రవీందర్‌రావుకు మంచిర్యాల నియోజకవర్గంలో మంచి సంబంధాలు ఉండడంతో పాటు ఇక్కడి బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో కోదండరాం పోటీ చేయని పక్షంలో మంచిర్యాల నుంచి రవీందర్‌రావుకే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన కూడా సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ భూముల సమస్యపై పోరాటం సాగిస్తున్నారు. రవీందర్‌రావు కుమురం భీం జిల్లాకు కూడా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నప్పటికీ, అక్కడ ప్రస్తుతానికి అంతగా ప్రభావం లేదు. చెన్నూరులో టీజెఎస్‌ తరుపున పొడేటి సంజీవ్‌ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బెల్లంపల్లిలో ఎన్నికల ముందు మారే సమీకరణాలను బట్టి బలమైన నాయకుడిని బరిలోకి దింపే ఆలోచనలతో ఉన్నట్లు సమాచారం.

సిర్పూరులో పాల్వాయి హరీష్‌?

సిర్పూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు తనయుడు పాల్వాయి హరీష్‌రావు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తన తండ్రి తరహాలోనే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలనేది ఆయన ఆలోచన. ఈ మేరకు నియోజకవర్గంలో పర్యటనలు జరుపుతున్నారు. ఇప్పటికే బెజ్జూరు, పెంచికల్‌పేట మండలాల్లో 20 రోజుల పాటు పాదయాత్రలు జరిపారు. సిర్పూరు నుంచి హరీష్‌రావును టీజేఎస్‌ తరుపున పోటీ చేయించే ఆలోచనతో కోదండరాం పార్టీ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే హరీష్‌తో సంప్రదింపులు జరిపినప్పటికీ, ఆయన వేచిచూసే ధోరణితో ఉన్నట్లు తెలిసింది.

ఆదిలాబాద్‌లో ఆశావహులు ఎక్కువే...

ఆదిలాబాద్‌ జిల్లాలో టీజేఎస్‌ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది. టీజేఏసీ ఆదిలాబాద్‌ చైర్మన్‌గా వ్యవహరించిన దుర్గం రాజేశ్వర్‌ ప్రస్తుతం పార్టలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్‌ నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేసే ఆలోచనతో ఉన్నారు. బీజేపీలో 20 సంవత్సరాల పాటు పనిచేసిన ఆయన గతంలో పార్టీ నుంచి టిక్కెట్‌ను ఆశించినప్పటికీ భంగపడ్డారు. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి టీజేఏసీలో కీలకంగా వ్యవహరిస్తూ కోదండరాం ఉమ్మడి జిల్లాలో స్ఫూర్తి యాత్ర చేపట్టినప్పుడు ఆయన వెంట నడిచారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్‌ నియోజకవర్గం నుంచే ఓ ఉపాధ్యాయ సంఘం నేత పార్టీ టిక్కెట్‌ను ఆశిస్తున్నారు.

గతంలో ఇంటెలిజెన్స్‌లో పనిచేసి పదవీ విరమణకు దగ్గరలో ఉన్న ఓ అధికారి బోథ్‌ నుంచి టీజేఎస్‌ టిక్కెట్‌ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖానాపూర్‌ నియోజకవర్గం నుంచి రిటైర్డ్‌ ఎస్పీ మెస్రం నాగోరావు టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. గతంలో ఈయన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆదిలాబాద్‌ లోకసభ స్థానానికి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం టీజేఎస్‌ తరపున ఖానాపూర్‌ లేదా ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి అయినా పోటీ చేయాలని ఆసక్తి కనబర్చుతున్నారు. ఖానాపూర్‌లో ఓ కీలక నేత కూడా టీజేఎస్‌ నుంచి పోటీకి సిద్ధపడుతున్నట్లు సమాచారం.

నిర్మల్‌లో అంతంత మాత్రమే

తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో కీలకపాత్ర పోషించిన వివిధ రంగాల వ్యక్తులు, నాయకులే ప్రస్తుతం ప్రొఫెసర్‌ కోదండరాం ప్రారంభించిన టీ జేఎస్‌లోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. నిర్మల్‌కు ఇన్‌చార్జిగా నియమించిన శ్రీహరి బాధ్యతలు స్వీకరించేందుకు ఇష్టపడడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో కామారెడ్డికి చెందిన గోపాల్‌శర్మకు నిర్మల్‌« బాధ్యతలు అప్పగించి పార్టీని జనంలోకి తీసుకెళ్లాలనే యోచనలో కోదండరాం ఉన్నట్లు సమాచారం. కాగా గతంలో జేఏసీ జిల్లా కన్వీనర్‌గా  ఉన్న విజయ్‌కుమార్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో ప్రస్తుతం నేరుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పార్టీకి ప్రస్తుతం జిల్లాలో పెద్ద  దిక్కుగా భైంసాకు చెందిన వైద్యుడు రామకృష్ణరెడ్డి  కొనసాగుతున్నారు. ముందు నుంచీ ఆయన కోదండరాం వెంట నడుస్తున్నారు. జిల్లాలో ఇప్పుడిప్పుడే సభ్యత్వాన్ని పెంచుకునే పనిలో పడుతున్నారు. విద్యావంతులు, పలు వర్గాలు పార్టీని ఆసక్తిగా గమనిస్తున్నాయి.

పొత్తుల ఎత్తుల్లోనూ కాంగ్రెస్,టీజేఎస్‌లే కీలకం..

అధికార టీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు విపక్షాలు ఏకతాటి పైకి వస్తే ఎన్నికల ముందు సమీకరణలు మారుతాయి. ఇప్పుడే అడుగులు వేస్తున్న టీజేఎస్‌తో పొత్తుకు కాంగ్రెస్‌ పార్టీ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో టీడీపీతో కూడా పొత్తు పెట్టుకునే ఆలోచన కాంగ్రెస్‌కు ఉంది. ఒకవేళ ఈ మూడు పార్టీలతో పాటు కమ్యూనిస్టులు కూడా కలిస్తే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రశ్న. టీఆర్‌ఎస్, బీజేపీ యేతర∙ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పాటైనప్పటికీ... పది అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌లో కాంగ్రెస్, టీజేఎస్‌లే కీలకం కానున్నాయి. పొత్తులు కుదిరితే... సీపీఐ, టీడీపీకి ఒక్కో సీటు దక్కే అవకాశం ఉంది.  

టీజేఎస్‌ ఆవిర్భావ సభ దృశ్యం(ఫైల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement