టార్గెట్ హైదరాబాద్
సాక్షి, సిటీబ్యూరో: అల్‌కాయిదా పేరుకు ఆంగ్ల రూపమైన ‘ది బేస్ మూవ్మెంట్’ (డీబీఎం) పేరిట ఏర్పడిన ఉగ్రవాద సంస్థ టార్గెట్‌లో హైదరాబాద్‌లోని కోర్టులు సైతం ఉన్నట్లు వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరుతో పాటు దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లోని ఐదు న్యాయస్థానాల వద్ద పేలుళ్ళకు పాల్పడిన ఈ ఉగ్రవాదుల్లో ముగ్గురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏఏ) అధికారులు సోమవారం తమిళనాడులోని మధురైలో పట్టుకున్న విషయం విదితమే. దీనికి కొనసాగింపుగా సోమవారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిని లోతుగా విచారించిన ఎన్‌ఐఏఏ అధికారులు పలు కీలకాంశాలను వెల్లడించారు. చెన్నైలోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న మధురై వాసి దావూద్ సులేమాన్ నేతృత్వంలో మధురైకు చెందిన అబ్బాస్ అలీ, సామ్‌సమ్ కరీం రజ, షంషుద్దీన్, మహ్మద్ అయూబ్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఫేస్బుక్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్న వీరు ఆన్లైన్ రాడికలైజేషన్ గ్రూప్ ఏర్పాటు చేశారు. తమిళనాడుకు చెందిన ఉగ్రవాద సంస్థ అల్ ఉమ ఉగ్రవాదుల నుంచి పేలుడు పదార్థాల సేకరణ, బాంబుల తయారీని నేర్చుకున్నారు. సామ్సమ్తో పాటు అబ్బాస్ అలీ దీపావళి టపాసుల్లో వాడే రసాయనాలతో బాంబుల తయారీలో నిష్ణాతులుగా మారారు.
చిత్తూరుతో మొదలైన ‘ప్రతీకారం’...
ఈ మాడ్యుల్ దక్షిణాదిలో మొత్తం ఐదు పేలుళ్ళకు పాల్పడింది. ఏ ఉదంతంలోనూ ప్రాణనష్టం లేకుండా, కేవలం న్యాయస్థానాల్ని టార్గెట్‌గా చేసుకుని పంజా విసిరింది. అప్పట్లో జరిగిన పరిణామాలకు ప్రతీకారంగా అంటూ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తీర్పులు రాకూడదనే ఉద్దేశంలో కోర్టుల వద్ద పేలుళ్ళకు పాల్పడింది. ఈ ఏడాది ఏప్రిల్ 7న చిత్తూరు జిల్లా కోర్టులోని పార్కింగ్ ప్లేస్‌లో జరిగిన పేలుడుతో వీరి చర్యలు ప్రారంభమయ్యాయి. ఆలేరులో జరిగిన వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా ఈ దాడి నిర్వహించారు. కొన్నేళ్ళ క్రితం గుజరాత్లో జరిగిన ఇష్రత్ జహా ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా జూన్ 15న కేరళలోని కొల్లం కోర్టు కార్ పార్కింగ్ ఏరియాలో బాంబు పేల్చారు. యాకుబ్ మొమెన్ను ఉరి తీసి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆగస్టు 1న కర్ణాటకలోని మైసూర్ కోర్ట్ కాంప్లెక్స్‌లో, జమ్మూ కాశ్మీర్లో జరిగిన బుర్హాన్ (హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్) ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా సెప్టెంబర్ 12న నెల్లూరు కోర్టు వద్ద, ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీలో పశుమాంసం వివాదంపై చోటు చేసుకున్న మహ్మద్ అఖ్లక్ ఉదంతానికి ప్రతీకారంగా ఈ నెల 1న కేరళలోని మలప్పురం కోర్టు టాయిలెట్లో పేలుళ్ళకు పాల్పడ్డారు.
పలు రాష్ట్రాలు, నగరాలకు బెదిరింపులు...
ఈ ఆన్లైన్ రాడికలైజ్డ్ సంస్థ దేశంలోని అనేక రాష్ట్రాలు, నగరాలకు బెదిరింపు ఈ–మెయిల్స్, ఎస్సెమ్మెస్‌లు పంపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు బీజేపీ నేతలు, అమెరికా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, రష్యా రాయబార కార్యాలయాలు, రక్షణ రంగానికి చెందిన సంస్థల్ని పేల్చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని కోర్టుల్లో పేలుళ్ళకు పాల్పడతామంటూ కొన్ని రోజుల క్రితం తెలంగాణ పోలీసులకు ఎస్సెమ్మెస్ వచ్చింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర నిఘా వర్గాలు ఈ ముఠాకు చెక్ చెప్పడానికి రంగంలోకి దిగాయి. మైసూరు, నెల్లూరు పేలుళ్ళ సందర్భంగా వీరు వదిలిన కరపత్రాల్లో అల్‌కాయిదా పేరుతో పాటు ఒసామా బిన్ లాడెన్ ఫొటో వినియోగించారు. అప్పుడే తొలిసారిగా ‘ది బేస్ మూవ్మెంట్’ పేరునూ బయటపెట్టారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ఒకేరోజు మైసూర్ రైల్వేకోర్టు, పాలక్కాడ్ కోర్టుల వద్ద పేలుళ్ళకు కుట్రపన్నారు. ఈలోపు వీరి కదలికల్ని కనిపెట్టిన తెలంగాణ నిఘా వర్గాలు ఎన్ఐఏఏను అప్రమత్తం చేయడంతో ఐదుగురు అరెస్టు అయ్యారు. వీరికి అల్‌కాయిదాతో ఎలాంటి సంబంధాలు లేకపోయినా కేవలం భయభ్రాంతులకు గురి చేయడానికే ఆ పేరు వినియోగించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
మోదీ, రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు
తెలంగాణ నిఘా వర్గాల సమాచారంతో ఎన్‌ఐఏఏ అధికారులు సోమవారం దావూద్ సులేమాన్, అబ్బాస్ అలీ, సామ్‌సమ్ కరీం రజలను మంగళవారం షంషుద్దీన్, మహ్మద్ అయూబ్‌లను అరెస్టు చేశారు. దక్షిణాదిలో ఐదు పేలుళ్ళకు పాల్పడి ప్రధానితో పాటు మొత్తం 22 మంది ప్రముఖుల్ని, పలు కీలకమైన సంస్థల్ని టార్గెట్‌గా చేసిన డీబీఎం మాడ్యుల్‌కు పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ పోలీసుల్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రశంసించారు. మంగళవారం వారు డీజీపీకి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఉగ్రవాదులకు చెక్ చెప్పడంలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ తెలంగాణ నిఘా చీఫ్ నవీన్‌చంద్, ఎస్ఐబీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధిపతులు వీసీ సజ్జనార్, రాజేష్‌కుమార్‌లను ప్రత్యేకంగా అభినందించారు.