
ఉగ్ర టార్గెట్.. హైదరాబాద్, బెంగళూరు!
అతి త్వరలోనే హైదరాబాద్, బెంగళూరు నగరాలు టార్గెట్గా మూడు బృందాలతో విధ్వంసానికి పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలిసింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) అనుబంధ సంస్థ అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్(ఏయూటీ)కు చెందిన అనుమానిత ఉగ్రవాదులను బుధవారం ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని, విచారించినప్పుడు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గురువారం మధ్యాహ్నం తర్వాత ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను నాంపల్లి కోర్టులో ప్రవేశపెడతారు. వీరిని పూర్తిగా విచారించేందుకు గాను తమ కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ కోరనుంది. అవసరమైతే పీటీ వారెంటు మీద ఢిల్లీకి కూడా తీసుకెళ్లి విచారిస్తామని చెబుతున్నారు.
అనుమానిత ఉగ్రవాదులకు విదేశాల నుంచి భారీగా హవాలా మార్గంలో డబ్బులు అందినట్లు ఎన్ఐఏ గుర్తించింది. వీరు పెద్ద ఎత్తును ఆయుధాలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. క్రూడ్ బాంబులను తయారుచేయడంలో వీళ్లు నిపుణులని, బ్రసెల్స్ తరహా దాడులకు వీరు కుట్రపన్నారని అంటున్నారు. వీళ్లు తయారుచేసే బాంబులను బ్యాగేజి స్కానర్లతో సైతం గుర్తించలేమని చెబుతున్నారు. కొద్దిరోజుల్లోనే భారీ పేలుళ్లకు వీళ్లు కుట్ర పన్నారని తెలుస్తోంది.