Target women
-
ఒంటరి మహిళలే టార్గెట్
జోగిపేట(అందోల్): వరుస చైన్ స్నాచింగ్‌లతో జోగిపేట పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. స్థానిక వాసవీనగర్ కాలనీలో గత నెల 26న అనూష అనే మహిళ మెడలో నుంచి చైన్‌ను బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన సంఘటన మరవకముందే ఆదివారం ఉదయం 8:30 ప్రాంతంలో మూడు చోట్ల ఒకేసారి చైన్ స్నాచింగ్ సంఘటనలు జరిగాయి. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళలనే టార్గెట్‌గా చేసుకొని చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. ఘటనలు జరిగిన తీరును గమనిస్తే కేవలం 5 నిమిషాల వ్యత్యాసంతో జరగడంతో వేర్వేరు వ్యక్తులు ఈ సంఘటనలో పాల్గొన్నట్లు అర్థమవుతుంది. అంతే కాకుండా ఒక బైక్ నడిపే వ్యక్తి క్యాప్ పెట్టుకోగా, మరో ఘటనలో టోపీ పెట్టుకోలేదని బాధితులు చెబుతున్నారు. వెనుక ఉన్న వారు మాత్రం ముఖానికి కర్చీఫ్‌ను కట్టుకున్నట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఒక ముఠానే జోగిపేటను ఎంచుకొని ఈ సంఘటనలకు పాల్పడుతోందని స్థానికులు భావిస్తున్నారు. వారం రోజుల్లో నాలుగు సంఘటనలు జరగడంతో పోలీసులు కూడా విమర్శలకు గురవుతున్నారు. భయం...భయం జోగిపేటలో ఆదివారం జరిగిన సంఘటన దావానలంలా వ్యాపించడంతో మహిళలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా కొందరు మహిళలు భయంతో బంగారు గొలుసులను ఇంట్లో పెట్టి రోల్డ్‌గోల్డ్ వేసుకుంటున్నారు. పోలీసులు వీధుల్లో మఫ్టీలో తిరిగి ఇలాంటి నేరాలపై నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. పని చేయని సీసీ కెమెరాలు పాఠశాల యాజమాన్యం బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఆదివారం కావడంతో వారు బంద్ చేసి ఉంచారు. ఎస్ఐ రమణ పోలీసు సిబ్బందితో వచ్చి పరిశీలించారు. పక్కనే ఉన్న శ్రీ బాలాజీ ఆసుపత్రి కెమెరాలను పరిశీలించినా లాభం లేకుండా పోయింది. పోలీస్ స్టేషన్ వైపు పారిపోయినట్లు బాధితులు చెప్పడంతో స్టేషన్ ముందు ఉన్న కెమెరాలో పరిశీలించాలని రజకులు కోరగా వైరు తెగిపోయిందని చెప్పడంతో వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో వారంతా పోలీస్ స్టేషన్ ముందు రాస్తారోకో చేశారు. ఎస్పీకి సమాచారం ఇచ్చిన ఎంపీ జోగిపేటలో రజకులు రాస్తారోకో చేస్తుండడంతో అదే సమయంలో అటువైపుగా వెళుతున్న జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ వాహనం కూడా నిలిచిపోయింది. బాధితులంతా ఎంపీ వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని తెలియజేశారు. బాధితురాలు లక్ష్మి కూడా ఎంపీ వద్దకు వెళ్లి తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంది. పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఎస్పీకి ఫోన్లో ఎంపీ సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసు అధికారుల ద్వారా సంఘటనల వివరాలను ఎస్పీ తెలుసుకున్నట్లు సమాచారం. రెండు తులాల చైన్ ఎత్తుకెళ్లారు వాసవీనగర్ కాలనీలో బైకుకు నేను సైడ్ ఇవ్వడానికి పక్కకు జరిగిన. ఆ బైకు నా దగ్గర వరకు వచ్చి నా మెడలోని రెండు తులాల బంగారు గొలుసును తెంపుకొని పోలీస్ స్టేషన్ వైపే పారిపోయాడు. బైక్ నడిపే వ్యక్తిది చిన్న వయస్సు. ఎర్రగా ఉన్నాడు. వెనుక ఉన్న వ్యక్తి ముఖానికి దస్తీ కట్టుకట్టుకొని ఉన్నాడు. కొన్ని క్షణాల్లోనే ఇదంతా జరిగిపోయింది. ఆ వ్యక్తిని చూస్తే గుర్తు పడతాను. పోలీసులు నా గొలుసు నాకు ఇప్పించాలి. ఎంపీ గారికి కూడా నా బాధ చెప్పుకున్నా. నేను రూ. 60వేలు ఎప్పుడు సంపాదించుకోగలను. –గంగన్నోల్ల లక్ష్మి (బాధితురాలు), జోగిపేట వెనుక నుంచి వచ్చి లాగారు నేను మా అత్తకు టిఫిన్ ఇచ్చి ఇంటికి తిరిగి వస్తున్నా. వెనుక నుంచి బైక్ వస్తుండడంతో పక్కకు జరిగి తోవ ఇస్తుండగా నా దగ్గరకు వచ్చి చైన్‌ను పట్టుకున్నారు. నేను కూడా చైన్‌ను పట్టుకొని అరవడంతో చుట్టు పక్కల వాళ్లు వచ్చారు. వాళ్లను చూసి నన్ను తోసేసి పారిపోయారు. గొలుసు తెగిపోయింది. నేను గర్భవతిని కావడంతో చురుకుగా కదలలేకపోయాను. కాలనీ వాళ్లు రావడంతో నా గొలుసు నాకు దొరికింది. పోలీసులు వీరిపై నిఘా పెట్టాలి. – రజిత (బాధితురాలు), జోగిపేట చైన్ స్నాచింగ్ ఘటనలపై నిఘా జోగిపేటలో జరిగిన చైన్‌స్నాచింగ్ ఘటనలపై నిఘా ఏర్పాటు చేస్తాం. ఎవరైనా పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతుంటే 9490619661, 9440901831 నంబర్లకు సమాచారం ఇవ్వాలి. ప్రధాన రహదారుల పక్కన ఉన్న వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రధాన చౌరస్తాల్లో ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు పోలీసులకు సహకరించాలి. వారం రోజుల్లో నాలుగు సంఘటనలపై విచారణ చేపడతాం. వాహనాలను బాధితులు గుర్తిస్తే బాగుండేది. ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా చూస్తాం. ప్రజలు కూడా మాకు సహకరించాలి. – తిరుపతి రాజు, సీఐ జోగిపేట -
ఇలా వెళ్లి.. అలా వస్తున్నారు..
- చైన్స్నాచర్లకు నామమాత్రంగానే శిక్షలు - వెంటనే బెయిల్ - గత మూడేళ్ల రిపోర్టులే నిదర్శనం - తొలిసారిగా ఓ మహిళ మృతి సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ద్విచక్రవాహనాలపై సంచరిస్తూ మహిళలను టార్గెట్ చేస్తున్నారు. బంగారానికి డిమాండ్ ఉండటంతో పాటు సులభంగా విక్రయించడం, ఈ చోరీ కేసులో నామమాత్రపు శిక్షలు పడుతుండటం కూడా వీరి ఆగడాలకు అదుపులేకుండా పోతోంది. కలచివేసిన సుమిత్ర మృతి.. తార్నాక ఎస్బీహెచ్లో తమ ఖాతా వివరాలు తెలుసుకొని తిరిగి కుమారుడితో ద్విచక్రవాహనంపై ఓయూ క్యాంపస్ మీదుగా వెళుతున్న సుమిత్ర మెడలోని బంగారు గొలుసును తెంచే క్రమంలో ఆమెను నెట్టేయడంతో మెదడుకు తీవ్రగాయాలై అపస్మారకస్థితిలోకి వెళ్లింది.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశమైంది. ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మహిళ చైన్ స్నాచింగ్ ఘటనలో మృతిచెందడంతో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. బంగారం పోతే మళ్లీ కొనుక్కోవచ్చు.. కానీ పోయిన ప్రాణాన్ని ఎవ్వరూ తెచ్చివ్వగలరూ అంటూ కుటుంబసభ్యులు చేస్తున్న రోదనలు కలచివేస్తున్నాయి. నామమాత్రపు శిక్షలేనా..? 2012లో 667 కేసులు నమోదైతే 304 చార్జిషీట్ దాఖలు వరకు వెళ్లాయి. వీటిలో 53 కేసుల్లో నామమాత్రపు శిక్ష పడింది. 62 వీగిపోగా, రెండు రాజీకి వచ్చాయి. 2013లో 695 కేసులు నమోదైతే 286 చార్జిషీట్లు దాఖలయ్యాయి. 47 కేసుల్లో నిందితులకు శిక్ష పడగా, 34 వీగిపోయాయి. నాలుగు రాజీ కుదిరాయి. 2014లో 555 కేసులు నమోదైతే 104 చార్జిషీట్ దాఖలు వరకు వెళ్లాయి. 15 కేసుల్లో శిక్ష పడగా, నాలుగు వీగిపోయాయి. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 150 కిపైగా బంగారు గొలుసు దొంగతనాలు నమోదయ్యాయి. ఈ కేసుల్లోనూ పెద్ద సంఖ్యల్లో శిక్ష పడిన దాఖలాలు లేవు. ఐపీసీ 382 సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేస్తుండటంతో వీరు జైలుకు అలా వెళ్లి ఇలా బెయిల్ తెచ్చుకుంటున్నారు. శిక్ష కాలం కూడా తక్కువగా ఉండటంతో ఈ నేరాలనే కొనసాగిస్తున్నారు. కొన్ని కేసులు చార్జిషీట్ వరకు కూడా వెళ్లడం లేదు. కొందరు అమ్యామ్యాలు తడిపి కేసుల నుంచి బయటపడుతున్నారు. ఇప్పటివరకు బంగారు గొలుసు దొంగలను పట్టుకొని స్వాధీనం చేసుకున్న సంఘటనలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. తెరపైకి ఐపీసీ 302 సెక్షన్.. సీసీటీవీ కెమెరాలతో భద్రత పటిష్టం చేస్తామని చెబుతున్న సిటీ పోలీసులు కనీసం పోలీసు స్టేషన్ ముందున్న సీసీటీవీ ఫుటేజీలను కూడా వాడటం లేదు. అవి పనిచేసి ఉంటే సుమిత్ర మృతికి కారకుడైన దొంగ దొరికి ఉండే వాడేమో. అయితే ఆధునీకరణ పనులు జరుగుతుండటంతో సీసీటీవీ వైర్లు తెగిపోయి అవి పనిచేయడం లేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు. తార్నాకతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు దొంగను పట్టుకుంటామని చెబుతున్నారు. అయితే ఈ ఘటన జరిగి వారం రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. దొంగ చేతిలో తీవ్రంగా గాయపడ్డ సుమిత్ర చికిత్స పొందుతూ మృతి చెందింది. సంఘటన జరిగినా రోజునా ఐపీసీ 356 సెక్షన్ కింద కేసు నమోదు చేసినా యూనివర్సిటీ పోలీసులు, సుమిత్ర మృతితో తాజాగా ఐపీసీ 302 సెక్షన్ (హత్య కేసు) కింద కేసు నమోదుచేశారు. తొలి సెక్షన్ కింద కేవలం ఆరునెలలే జైలు శిక్ష పడే అవకాశముండగా, తాజాగా నమోదుచేసిన 302 సెక్షన్ కింద యావజ్జీవ కారాగార పడే అవకాశముంది. బాధితురాలి మరణించడంతో నేర తీవ్రతను పెంచుతూ తొలిసారిగా ఐపీసీ 302 సెక్షన్‌ను చైన్ స్నాచర్‌పై నమోదుచేశారు. చాలా బాధగా ఉంది... చైన్ స్నాచింగ్ ఘటనలో మహిళ మృతి చెందడం చాలా బాధగా ఉంది. ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటున్నా. గొలుసు చోరీలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పొల్చుకుంటే కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరిగిన ఘటనను మేం తీవ్రంగా తీసుకొని ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశాం. దొంగను పట్టుకునేందుకు ఇప్పటికే నగరంలోని వివిధ విభాగాల బృందాలు పనిచేస్తున్నాయి. -స్వాతిలక్రా, అదనపు పోలీసు కమిషనర్, సిట్ అండ్ క్రైమ్స్ -
బడా చోర్
చైన్‌స్నాచర్ ‘కత్తి’ లాంబా అరెస్ట్ రూ.1.7 కోట్ల విలువైన 6.3 కిలోల బంగారం స్వాధీనం వీడిన 228 స్నాచింగ్ కేసుల మిస్టరీ స్నాచర్లపై పీడీ యాక్ట్: సీపీ మొత్తం 228 చైన్‌స్నాచింగ్ కేసులు... అందులో నగరంలోనివి 170... సైబరాబాద్‌లో 58... వీటిలో వరుసగా 2010లో 109... 2011లో 54... 2012లో 40...(మూడేళ్లలో మొత్తం 203) చోరీలు... 106 నాన్ బెయిలబుల్ వారెంట్లు. మూడుసార్లు జైలుకు వెళ్లిన చరిత్ర... ఒంటరిగా వెళ్లే మహిళలే టార్గెట్. కన్నుమూసి తెరిచేలోగా మెడలోని ఆభరణాలతో మాయం. అడ్డొస్తే ‘కత్తి’ పోట్లు ఖాయం... తప్పించుకునే క్రమంలో ఎంతటి ఘాతుకానికైనా తెగించే వైనం... ఇదీ ఆయన ట్రాక్ ‘రికార్డ్’. పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టిన ఆ నిందితుడు కాలపత్తర్‌కు చెందిన సయ్యద్ హుస్సేన్ అలియాస్ ‘కత్తి’ లాంబా. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతనితోపాటు మరో స్నాచర్.. ముగ్గురు బంగారు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 6.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.7 కోట్లుగా తేల్చారు. సిటీబ్యూరో: మహిళల మెడలోని బంగారు ఆభరణాలు చోరీ చేస్తూ... పట్టుకోవడానికి ప్రయత్నించిన వారిపై కత్తితో దాడి చేస్తూ... కొంతకాలంగా పోలీసులకు ముప్పుతిప్పలు పెడుతున్న చైన్‌స్నాచర్ సయ్యద్ హుస్సేన్ అలియాస్ లాంబా (27) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుని అరెస్టు చేశారు. మరో స్నాచర్‌తో పాటు దొంగ బంగారాన్ని కొనుగోలు చేసిన ముగ్గురు వ్యాపారులనూ అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.7 కోట్ల విలువైన 6.3 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో స్నాచర్‌తో పాటు ఇద్దరు వ్యాపారులు పరారీలో ఉన్నారు. తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. వివరాలివీ...కాలపత్తర్‌కు చెందిన సయ్యద్ హుస్సేన్ అలియాస్ లాంబా కరడుగట్టిన చైన్ స్నాచర్. ఇందుకోసం హై స్పీడ్ బైక్‌ను వాడుతాడు. ఒంటరి మహిళల మెడలోని బంగారు ఆభరణాలు తెంచుకుపోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. 2010లో 109, 20011లో 54 ,2012లో 40 స్నాచింగ్‌లకు పాల్పడి మూడుసార్లు జైలుకెళ్లి వచ్చాడు. చోరీ చేసిన మొత్తంతో దేశంలోని వివిధ నగరాలకు వెళ్లి జల్సాలు చేసి వచ్చేవాడు. రెండేళ్ల నుంచి వరుసగా 228 స్నాచింగ్ (నగరంలో 170, సైబరాబాద్‌లో 58) సంఘటనలకు పాల్పడి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. అతనిపై 106 నాన్‌బెయిల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. గత నెల 14న ఎల్బీనగర్లో ఓ మహిళ మెడలోని ఆభరణాలు తెంచుకొని పారిపోతుండగా... చైతన్యపురి కానిస్టేబుల్ ప్రసాద్‌రెడ్డి తన బైక్‌తో అతని బైక్‌ను ఢీ కొట్టాడు. ఇద్దరూ కింద పడిపోయారు. తప్పించుకునే క్రమంలో లాంబా తన వద్ద ఉన్న కత్తితో ప్రసాద్‌రెడ్డి కడుపులో పొడిచాడు. తన బైక్‌ను అక్కడే వదిలి ప్రసాద్‌రెడ్డి వాహనంపైనేపారిపోయాడు. ఈ బైక్‌ను శంషాబాద్ శివారుకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి దహనం చేశాడు. ఇలా చిక్కాడు... లాంబా కోసం జంట కమిషనరేట్ల పోలీసులు గాలిస్తుండగా ఈస్ట్‌జోన్ కానిస్టేబుల్ పి.వెంకటస్వామికి కీలక సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ కోటిరెడ్డి, ఇన్స్పెక్టర్ సీహెచ్.శ్రీధర్, ఎస్ఐలు ఎ.సుధాకర్, ఎస్.శేఖర్‌రెడ్డి, ఎ.రవికుమార్‌లు బృందంగా ఏర్పడి వల పన్ని పట్టుకున్నారు. లాంబా ఇచ్చిన సమాచారం మేరకు మరో స్నాచర్ కాలపత్తర్‌కు చెందిన మీర్జా అజ్మత్‌అలీ బేగ్ (22)ను కూడా అరెస్టు చేశారు. వారి వద్ద దొంగ బంగారాన్ని కొనుగోలు చేసిన పాతబస్తీకి చెందిన వ్యాపారులు మహమ్మద్ అబ్దుల్ ఖలీల్ (27), షేక్ అహ్మదుద్దీన్ (24), సయ్యద్ అర్షద్ (21)లను అరెస్టు చేశారు. మరో ఇద్దరు వ్యాపారులు మహ్మద్ ఇర్ఫాన్, మాజిద్ఖాన్లు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 6.3 కిలోల బంగారం, రెండు బైక్‌లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. 228 స్నాచింగ్ కేసుల గుట్టు విప్పడంలో కీలక పాత్ర పోషించిన ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులందరికీ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి రివార్డులను అందజేశారు. స్నాచర్లపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని కమిషనర్ హెచ్చరించారు. బాధితులకు బంగారం అప్పగింత నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 6.3 కిలోల బంగారు ఆభరణాలను 228 మంది బాధితులకు పోలీసులు అప్పగించారు. ఎస్ఆర్నగర్, సైదాబాద్, మలక్‌పేట, అంబర్‌పేట, కాచిగూడ, ఓయూ, నల్లకుంట, సుల్తాన్‌బజార్, చాదర్‌ఘాట్, అఫ్జల్‌గంజ్, పంజగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లంగర్‌హౌస్, గోల్కొండ, సంతోష్‌నగర్, కంచన్‌బాగ్, మాదన్నపేట, చంద్రాయణగుట్ట, ఛత్రినాక, నారాయణగూడ, సరూర్నగ ర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, మీర్‌పేట, చైతన్యపురి, కుషాయిగూడ తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో బాధితులు ఉన్నారు. పోయిన బంగారం లభించినందుకు బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా, సీసీఎస్ డీసీపీ జి.పాలరాజు, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ కోటిరెడ్డి పాల్గొన్నారు.