బడా చోర్ | Chain Snatcher Lamba arrest | Sakshi
Sakshi News home page

బడా చోర్

Published Wed, Dec 17 2014 11:54 PM | Last Updated on Wed, Oct 17 2018 6:34 PM

బడా చోర్ - Sakshi

బడా చోర్

చైన్‌స్నాచర్ ‘కత్తి’ లాంబా అరెస్ట్
రూ.1.7 కోట్ల విలువైన 6.3 కిలోల బంగారం స్వాధీనం
వీడిన 228 స్నాచింగ్ కేసుల మిస్టరీ
స్నాచర్లపై పీడీ యాక్ట్: సీపీ

 
మొత్తం 228 చైన్‌స్నాచింగ్ కేసులు... అందులో నగరంలోనివి 170...
 
సైబరాబాద్‌లో 58... వీటిలో వరుసగా 2010లో 109... 2011లో 54... 2012లో 40...(మూడేళ్లలో మొత్తం 203) చోరీలు... 106 నాన్ బెయిలబుల్ వారెంట్లు. మూడుసార్లు జైలుకు వెళ్లిన చరిత్ర... ఒంటరిగా వెళ్లే మహిళలే టార్గెట్. కన్నుమూసి తెరిచేలోగా మెడలోని ఆభరణాలతో మాయం. అడ్డొస్తే ‘కత్తి’ పోట్లు ఖాయం... తప్పించుకునే క్రమంలో ఎంతటి ఘాతుకానికైనా తెగించే వైనం... ఇదీ ఆయన ట్రాక్ ‘రికార్డ్’. పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టిన ఆ నిందితుడు కాలపత్తర్‌కు చెందిన సయ్యద్ హుస్సేన్ అలియాస్ ‘కత్తి’ లాంబా. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతనితోపాటు మరో స్నాచర్.. ముగ్గురు బంగారు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 6.3 కిలోల బంగారాన్ని స్వాధీనం  చేసుకున్నారు. దీని విలువ రూ.1.7 కోట్లుగా తేల్చారు.
 
సిటీబ్యూరో: మహిళల మెడలోని బంగారు ఆభరణాలు చోరీ చేస్తూ... పట్టుకోవడానికి ప్రయత్నించిన వారిపై కత్తితో దాడి చేస్తూ... కొంతకాలంగా పోలీసులకు ముప్పుతిప్పలు పెడుతున్న చైన్‌స్నాచర్ సయ్యద్ హుస్సేన్ అలియాస్ లాంబా (27) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుని అరెస్టు చేశారు. మరో స్నాచర్‌తో పాటు దొంగ బంగారాన్ని కొనుగోలు చేసిన ముగ్గురు వ్యాపారులనూ అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.7 కోట్ల విలువైన 6.3 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో స్నాచర్‌తో పాటు ఇద్దరు వ్యాపారులు పరారీలో ఉన్నారు.

తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. వివరాలివీ...కాలపత్తర్‌కు చెందిన సయ్యద్ హుస్సేన్ అలియాస్ లాంబా కరడుగట్టిన చైన్ స్నాచర్. ఇందుకోసం హై స్పీడ్ బైక్‌ను వాడుతాడు. ఒంటరి మహిళల మెడలోని బంగారు ఆభరణాలు తెంచుకుపోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. 2010లో 109, 20011లో 54 ,2012లో 40 స్నాచింగ్‌లకు పాల్పడి మూడుసార్లు జైలుకెళ్లి వచ్చాడు. చోరీ చేసిన మొత్తంతో దేశంలోని వివిధ నగరాలకు వెళ్లి జల్సాలు చేసి వచ్చేవాడు. రెండేళ్ల నుంచి వరుసగా 228 స్నాచింగ్ (నగరంలో 170, సైబరాబాద్‌లో 58) సంఘటనలకు పాల్పడి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. అతనిపై 106 నాన్‌బెయిల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. గత నెల 14న ఎల్బీనగర్‌లో ఓ మహిళ మెడలోని ఆభరణాలు తెంచుకొని పారిపోతుండగా... చైతన్యపురి కానిస్టేబుల్ ప్రసాద్‌రెడ్డి తన బైక్‌తో అతని బైక్‌ను ఢీ కొట్టాడు. ఇద్దరూ కింద పడిపోయారు. తప్పించుకునే క్రమంలో లాంబా తన వద్ద ఉన్న కత్తితో ప్రసాద్‌రెడ్డి కడుపులో పొడిచాడు. తన బైక్‌ను అక్కడే వదిలి ప్రసాద్‌రెడ్డి వాహనంపైనేపారిపోయాడు. ఈ బైక్‌ను శంషాబాద్ శివారుకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి దహనం చేశాడు.
 
ఇలా చిక్కాడు
...

లాంబా కోసం జంట కమిషనరేట్ల పోలీసులు గాలిస్తుండగా ఈస్ట్‌జోన్ కానిస్టేబుల్ పి.వెంకటస్వామికి కీలక సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ కోటిరెడ్డి, ఇన్‌స్పెక్టర్ సీహెచ్.శ్రీధర్, ఎస్‌ఐలు ఎ.సుధాకర్, ఎస్.శేఖర్‌రెడ్డి, ఎ.రవికుమార్‌లు బృందంగా ఏర్పడి వల పన్ని పట్టుకున్నారు. లాంబా ఇచ్చిన సమాచారం మేరకు మరో స్నాచర్ కాలపత్తర్‌కు చెందిన మీర్జా అజ్మత్‌అలీ బేగ్ (22)ను కూడా అరెస్టు చేశారు. వారి వద్ద దొంగ బంగారాన్ని కొనుగోలు చేసిన పాతబస్తీకి చెందిన వ్యాపారులు మహమ్మద్ అబ్దుల్ ఖలీల్ (27), షేక్ అహ్మదుద్దీన్ (24), సయ్యద్ అర్షద్ (21)లను అరెస్టు చేశారు. మరో ఇద్దరు వ్యాపారులు మహ్మద్ ఇర్ఫాన్, మాజిద్‌ఖాన్‌లు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 6.3 కిలోల బంగారం, రెండు బైక్‌లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. 228 స్నాచింగ్ కేసుల గుట్టు విప్పడంలో కీలక పాత్ర పోషించిన ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులందరికీ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి రివార్డులను అందజేశారు. స్నాచర్లపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని కమిషనర్ హెచ్చరించారు.

 బాధితులకు బంగారం అప్పగింత

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 6.3 కిలోల బంగారు ఆభరణాలను 228 మంది బాధితులకు పోలీసులు అప్పగించారు.  ఎస్‌ఆర్‌నగర్, సైదాబాద్, మలక్‌పేట, అంబర్‌పేట, కాచిగూడ, ఓయూ, నల్లకుంట, సుల్తాన్‌బజార్, చాదర్‌ఘాట్, అఫ్జల్‌గంజ్, పంజగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లంగర్‌హౌస్, గోల్కొండ, సంతోష్‌నగర్, కంచన్‌బాగ్, మాదన్నపేట, చంద్రాయణగుట్ట, ఛత్రినాక, నారాయణగూడ, సరూర్‌నగ ర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, మీర్‌పేట, చైతన్యపురి, కుషాయిగూడ తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో బాధితులు ఉన్నారు. పోయిన బంగారం లభించినందుకు బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ  సమావేశంలో   అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా, సీసీఎస్ డీసీపీ జి.పాలరాజు, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ కోటిరెడ్డి పాల్గొన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement