నాన్‌బెయిలబుల్ వారెంట్లను అమలు చేయాలి
నాన్‌బెయిలబుల్ వారెంట్లను అమలు చేయాలి
Published Sat, Jun 10 2017 11:27 PM | Last Updated on Wed, Oct 17 2018 6:31 PM
మృతురాలు వైద్య విద్యార్థిని తండ్రి డిమాండ్
కాకినాడ క్రైం : రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్ మెడికల్ కళాశాల్లో రేడియాలజిస్ట్ కోర్సు విద్యాభ్యాసం చేస్తూ యాజమాన్యం వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న పీజీ వైద్య విద్యార్థిని మెర్ల శ్రీలక్ష్మి కేసులో కళాశాల ప్రతినిధులపై కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్లను పోలీసులు తక్షణం అమలు చేయాలని మృతురాలి తండ్రి భవాని శంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. కాకినాడ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్ కళాశాలలో ప్రొఫెసర్ల, కనీసం మౌలిక వసతుల కూడా లేకపోవడంతో యాజమాన్యాన్ని తమ కుమార్తె శ్రీలక్ష్మి ప్రశ్నించిందన్నారు. దాంతో కళాశాల యాజమాన్యం వేధింపులకు గురిచేసేదన్నారు. దీంతో 14 ఫిబ్రవరి 2014లో కాకినాడ గాంధీనగర్‌లో ఆత్మహత్య చేసుకుందన్నారు. తాను రాసిన లేఖలో తన మరణానికి కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్‌ల వేధింపులే కారణమని పేర్కొందన్నారు. అప్పట్లో కళాశాలకు చెందిన 12 మందిపై కాకినాడ టూటౌన్‌లో పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టగా రేడియాలజీ డిపార్టుమెంట్‌కి చెందిన హెచ్‌వోడీ అనిందిత మిశ్రాను అరెస్ట్ చేసి మిగతా వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. భవిష్యత్‌లో ఇటువంటివి పునరావృతం కాకుండా కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండేళ్ల క్రితం కాకినాడ కోర్టులో ప్రైవేట్ కేసు వేశామన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జీఎస్‌ఎల్ కళాశాలకు చెందిన వల్లభనేని మైత్రి ప్రియదర్శిని, కళాశాల ప్రిన్సిపాల్ ఏలేశ్వరపు వెంకటరామ శర్మ, సూపరింటెండెంట్ టీసీహెచ్ సత్యనారాయణ, కళాశాల చైర్మెన్ గన్ని భాస్కరరావు, చైర్మెన్ కుమారుడు గన్ని సందీప్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మే 31న కాకినాడ ఐదో అడిషనల్ జుడిషియల్ మెడిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్‌క్లాస్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లను జారీ చేసిందన్నారు. ఇప్పటికైనా పోలీసులు కోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు. రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు పెద్దింటి వెంకటేశ్వరరావు, బారుకల శేఖర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement