'ముంబై దాడికి మా దేశంలోనే కుట్ర'
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాద దాడి ఘటనకు పాకిస్థాన్‌లోనే పథకం రచించి.. పాక్ గడ్డపై నుంచే ఉగ్రవాదులు ముంబైకి వచ్చి మారణహోమం సృష్టించారు. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాజీ డీజీ తారిఖ్ ఖోసా ఈ విషయాలను వెల్లడించారు. ముంబై ఉగ్రవాది దాడి గురించి తారిఖ్ రాసిన వ్యాసం పాకిస్థాన్ పత్రిక డాన్లో ప్రచురితమైంది.
'ముంబై మారణహోమానికి పాక్‌లో పథకం రచించి, ఈ గడ్డపై నుంచే బయలుదేరారు. ఈ దాడిలో పాల్గొన్న పాక్ జాతీయుడు కసబ్, లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాదులు సింధ్‌లోని తట్టాలో శిక్షణ పొందారు. ఇక్కడి నుంచి బయల్దేరి సముద్ర మార్గం ద్వారా ముంబై చేరుకున్నారు. సింధ్ లోని ఉగ్రవాద శిబిరాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ముంబై దాడిలో ఉగ్రవాదులు వాడిన పేలుడు పదార్థాల కేసింగ్‌లను స్వాధీనం చేసుకున్నారు' అని తారిఖ్ పేర్కొన్నారు. ఉగ్రవాదులు ముంబైకి వచ్చిన తీరు, పాకిస్థాన్ నుంచి వారికి నిర్దేశం చేయడం, ముంబై దాడి తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణ పరిస్థితుల గురించి తారిఖ్ ఈ వ్యాసంలో వెల్లడించారు.
2008 నవంబర్‌లో జరిగిన ముంబై ఉగ్రవాది దాడిలో 166 మంది మరణించారు. వీరిలో పోలీసులు, పౌరులతో పాటు విదేశీయులు ఉన్నారు. పాకిస్థాన్ నుంచి 10 మంది ఉగ్రవాదులు అరేబియా సముద్రం నుంచి ముంబైలోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డారు. భారత భద్రత బలగాలు తొమ్మిది మంది ఉగ్రవాదులను హతమార్చగా, బందీగా పట్టుకున్న అజ్మల్ కసబ్‌ను ఆ తర్వాత ఉరి తీశారు. ఈ ఘటనతో సంబంధం లేదని తొలుత పాక్ ప్రకటించినా, కసబ్, ఇతర ఉగ్రవాదులు పాక్ జాతీయులనేని అంగీకరించింది.