రాజకీయాల్లోకి మాజీ సీఎం కొడుకు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ముఫ్తీ మహమ్మద్ సయీద్ కొడుకు తసాదుక్ ముఫ్తీ ఎట్టకేలకు రాజకీయ అరంగేట్రం చేశారు. తండ్రి తొలి వర్ధంతి సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన అధికార పీడీపీ (పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ)లో చేరారు. వృత్తిరీత్యా సినిమాటోగ్రాఫర్ అయిన తసాదుక్, ముఖ్యమంత్రి కొడుకుగా కాకుండా తన ప్రతిభతో కష్టపడి పైకి వచ్చారు.
సోదరి, జమ్మూకశ్మీర్ ప్రస్తుత ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సమక్షంలో ఆయన పార్టీలో చేరుతూ ‘మన రాష్ట్రంలో రాజకీయాలను ప్రక్షాళన చేయాలనేది నా కల. ఇన్నాళ్లూ నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఈ రోజు పీడీపీలో చేరాను. ఇది నా జీవితంలో ముఖ్యమైన రోజు’అని అన్నారు. తసాదుక్ చేరికను మెహబూబా ముఫ్తీ స్వాగతించారు.