టార్గెట్ ‘జార్జికోట’
కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రస్తుతం రాష్ట్రంపై గురిపెట్టింది. నిన్న ఎర్రకోట, రేపు జార్జికోట అనే నినాదం లేవనెత్తింది. బుధవారం చెన్నైలో జరిగిన పార్టీ రాష్ట్రస్థాయి సమావేశం అధికారమే ప్రధాన నిదానంగా సాగింది.
* బీజేపీ రాష్ట్ర సదస్సులో తీర్మానం
* సంపూర్ణ మద్యనిషేధంపై పట్టు
* అధ్యక్షురాలిగా తమిళిసై ఏకగ్రీవం
చెన్నై, సాక్షి ప్రతినిధి: పొత్తులతో ప్రమేయం లేకుండా కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ దక్షిణాదిపై పట్టుసాధించే పనిలో పడింది. పార్లమెంటు ఎన్నికల ప్రచార సభలతోనే పెద్దఎత్తున ప్రజలను ఆకట్టుకున్న నరేంద్రమోదీ రాష్ట్రంలో పార్టీ బలపడడానికి కారకులయ్యూరు. ఈ ఊపును ఇలానే కొనసాగిస్తూ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టాలని గట్టిపట్టుదలతో ఉన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షునిగా ఉన్న పొన్ రాధాకృష్ణన్ కేంద్ర మంత్రిగా మారడంతో రాష్ట్ర అధ్యక్షురాలిగా తమిళిసై సౌందరరాజన్‌ను పార్టీ ప్రకటించింది. అయితే సంప్రదాయ ఎన్నిక ప్రక్రియ బుధవారం చెన్నైలో జరిగింది.
పార్టీ జాతీయ నాయకుల సమక్షంలో తమిళిసై సౌందరరాజన్‌ను అధ్యక్షురాలిగా ఎన్నుకుం టూ రాష్ట్ర శాఖ ఏకగ్రీవంగా ఆమోదించింది. తన నియామకంపై తమిళిసై కృతజ్ఞతలు చెప్పిన అనంతరం ప్రసంగించారు. బీజేపీ తన సొంత బలంతో ఈ ఏడాది (2014) ఢిల్లీలోని ఎర్రకోటపై జెండా ఎగురవేసిందని, అలాగే 2016లో జార్జికోట (చెన్నై సచివాలయం)పై పతాకాన్ని ఎగురవేయడం ఖాయమని ఆమె అన్నారు. బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ శ్రేణులంతా ఇందుకు సమాయత్తం కావాలని ఆమె పిలుపునిచ్చారు.
మోదీ నేతృత్వంలో ఇప్పటి వరకు సాగిన ఆరునెలల పాలనే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తెస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు 15 తీర్మానాలు బీజేపీ ఆమోదించింది. ఆరునెలల్లో 8 సార్లు పెట్రోలు, రెండు సార్లు డీజిల్ ధరలను తగ్గించిన మోదీ ప్రభుత్వాన్ని అభినందిస్తూ తీర్మానం చేసింది. శ్రీలంకతో తమిళ జాలర్ల సమస్య, ఉరిశిక్ష విధింపుపై స్పందించిన ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ను అభినందించారు. వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాపై పరిమితిని ఎత్తివేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానించారు.
టాస్మాక్ తొలగించాలి: టాస్మాక్ దుకాణాల ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడి ప్రజల జీవితాలను భగ్గుమనిపించడాన్ని సమావేశం తప్పుపట్టింది. టాస్మాక్ దుకాణాలను వెంటనే ఎత్తివేసి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. ఆర్ఎస్ఎస్ నేతలపై రాష్ట్ర పోలీసుల లాఠీచార్జీ, అరెస్ట్‌లను తీవ్రంగా ఖండించింది. వరదలు, భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, నదుల అనుసంధానం కోసం కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు, జాతీయ నాయకులు ఇలగణేశన్, హెచ్ రాజా తదితరులు పాల్గొన్నారు.