అధికారంలోకి రాగానే మద్యనిషేధం
వేలూరు: డీఎంకే పార్టీ అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని ఆ పార్టీ ఎన్నికల సమావేశం కార్యదర్శి కనిమొళి తెలిపారు. తిరువణ్ణామలైలో మహిళా విభాగం కార్యకర్తల సమావేశం జిల్లా కార్యదర్శి ఏవావేలు అధ్యక్షతన జరిగింది. కనిమొళి మాట్లాడుతూ అన్నాడీఎంకే ప్రభుత్వంలోనే రాష్ట్ర వ్యాప్తంగా టాస్మాక్ దుకాణాలు అధిక మయ్యాయన్నారు. అదే విధంగా ఐదు సంవత్సరాల్లోనే అధికంగా ప్రమాదాలు జరగడంతో మహిళలు అధికంగా వితంతువులుగా మారారన్నారు. కరుణానధి గతంలో మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత కరుణానిధికే దక్కిందన్నారు. రానున్న ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయం సాధించడం ఖాయమని ఇందుకు కార్యకర్తలందరూ ఏకమై కష్టపడి పనిచేయాలన్నారు.
పార్టీ అధిష్ఠానం ఎవరిని గుర్తించి సీటు కేటాయించినా అభ్యర్థి కోసం కష్ట పడకుండా పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. పార్టీలో వర్గ బేధాలు లేకుండా ఏకమై సైనికుల్లా పనిచేయగలిగితే విజయం మనవైపే ఉంటుందన్నారు. రాష్ర్టంలోని ప్రజలు అన్నాడీఎంకే ప్రభుత్వంపై విరక్తితో ఉన్నారన్నారు. రాష్ర్టంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కరుణానిధిని ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళా విభాగం కార్యదర్శి విజయలక్ష్మి, తూర్పు జిల్లా కార్యదర్శి లక్ష్మి, జిల్లా కార్యదర్శి శివానందం, మాజీ పార్లమెంట్ సభ్యులు వేణుగోపాల్, మహిళా విభాగం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.