డివిడెండ్ లేదు.. బాధపడుతున్నా..!
ముంబై : టాటా మెటార్స్ కంపెనీ వాటాదారులకు గత ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్ చెల్లించలేకపోతున్నందుకు బాధపడుతున్నానని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ చెప్పారు. కంపెనీ ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకోవాలని ఆయన వాటాదారులను కోరారు. గురువారం ఇక్కడ జరిగిన కంపెనీ 70వ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఆయన మాట్లాడారు. గత 15 ఏళ్లుగా డివిడెండ్ చెల్లిస్తూ వచ్చిన ఈ కంపెనీ ఈ సారి మాత్రం డివిడెండ్ చెల్లించలేదు. దీర్ఘకాలంలో కంపెనీకి మంచి కోసం కొన్ని త్యాగాలు తప్పవని సైరస్ మిస్త్రీ చెప్పారు. పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతులు, ప్రపంచ స్థాయి నాణ్యత, వినూత్నమైన ఉత్పత్తుల ద్వారా ఉత్తమమైన లాభదాయకతను టాటా మోటార్స్ సాధించగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే సైరస్ మిస్త్రీ వివరణ పట్ల పలువురు ఇన్వెస్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
డివిడెండ్ చెల్లించలేకపోవడానికి సరైన కారణాలు చెప్పడం లేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీ ఉన్నతాధికారుల వేతనాలు పెంచుకోవడానికి తమ ఆమోదం పొందారని, తమకు మాత్రం డివిడెండ్ చెల్లించలేకపోతున్నారని ఒక ఇన్వెస్టర్ విమర్శించారు.గతంలో రతన్ టాటా చైర్మన్గా ఉన్నప్పుడు 2000-01 ఆర్థిక సంవత్సరానికి కూడా టాటా మోటార్స్ కంపెనీ తన వాటాదారులకు డివిడెండ్ చెల్లించలేకపోయింది.