వచ్చే జూన్ నాటికి...టాటా-సింగపూర్ ఎయిర్‌లైన్స్ టేకాఫ్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మే-జూన్ నాటికల్లా దేశీయంగా విమాన సర్వీసులు ప్రారంభించాలని టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ సంస్థ ..టాటా-ఎస్ఐఏ భావిస్తోంది. టాటా-ఎస్ఐఏ చైర్మన్ ప్రసాద్ మీనన్ విషయం తెలిపారు. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) అనుమతులు లభించిన నేపథ్యంలో టాటా గ్రూప్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా, ఎస్ఐఏ చైర్మన్ గో చూన్ ఫాంగ్, మీనన్.. శుక్రవారం పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్‌తో సమావేశమయ్యారు. మిగతా అనుమతులు కూడా వేగంగా లభించగలవని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా మీనన్ తెలిపా రు.
మరోవైపు, పార్కింగ్ స్థలం, రూట్లు మొదలైన వాటికి సంబంధించి టాటా-ఎస్ఐఏ ఎంత వేగం గా వివరాలు సమర్పిస్తుందన్న దాన్ని బట్టి విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీ జీసీఏ వేగవంతంగా అనుమతు లు ఇవ్వడం ఆధారపడి ఉంటుందని అజిత్ సింగ్ చెప్పారు. ఈ ఎయిర్‌లైన్స్ రాకతో దేశీ విమానయాన రంగానికి ప్రయోజనం చేకూరగలదన్నారు. అటు, ఈ జేవీ విషయంలో ఎయిర్ఏషియా ఇండియా మరో ప్రమోటర్ అరుణ్ భాటియా అసంతృప్తి వ్యక్తం చేశారన్న వార్తలపై స్పంది స్తూ.. అలాంటి గందరగోళం లేదని రతన్ టాటా స్పష్టం చేశారు. టాటా-ఎస్ఐఏ జేవీలో టాటా సన్స్‌కి 51%, ఎస్‌ఐఏకి 49% వాటాలు ఉంటాయి. ప్రారంభ దశలో ఇందులో ఇరు కంపెనీలు కలసి 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నాయి.
ఎయిరిండియాను ప్రైవేటీకరిస్తే సంతోషమే: రతన్ టాటా
ప్రభుత్వ రంగానికి చెందిన ఎయిరిండియాను ప్రైవేటీకరిస్తే మంచిదేనని రతన్ టాటా చెప్పారు. అదెప్పుడు జరిగినా తాను సంతోషిస్తానని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఎయిర్‌లైన్స్ వంటి వ్యాపార రంగాల్లో ఉండకూడదని, ఎయిరిండియాని ప్రైవేటీకరించే అవకాశాలను రాబోయే ప్రభుత్వాలు పరిశీలించగలవ ంటూ అజిత్ సింగ్ వ్యక్తిగత అభిప్రాయాన్ని వెలిబుచ్చిన నేపథ్యంలో టాటా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టాటా సన్స్ ప్రారంభించిన విమానయాన సంస్థే తర్వాత రోజుల్లో ఎయిరిండియాగా మారింది.