ఆ సమస్యపై మోదీతో కామెరాన్ చర్చలు?
లండన్: టాటా స్టీల్ సంచలన నిర్ణయంపై బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించనున్నట్టు సమాచారం. వాషింగ్టన్ డీసీలో శుక్రవారం జరగనున్న అణుభద్రతా సదస్సులో ఇరువురు ప్రధానులు పాల్గొంటారు. ఈ క్రమంలో టాటా స్టీల్ అంశాన్ని బ్రిటన్ ప్రధాని ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది.
గత 12 నెలలుగా పనితీరు దిగజారుతున్న కారణంగా టాటా స్టీల్ బ్రిటన్‌లోని వ్యాపారాలకు గుడ్ బై చెప్పింది. యూకేలోని తమ సంస్థను పూర్తిగా కానీ.. భాగాలుగా కానీ విక్రయించాలని నిర్ణయానికి వచ్చినట్లు బోర్డు సమావేశం తర్వాత కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. బ్రిటన్‌లోని తమ వ్యాపారాన్ని విక్రయించాలన్న టాటా స్టీల్ నిర్ణయం ప్రపంచ వ్యాపారవర్గాలను ఆశ్యర్యంలో ముంచెత్తింది. ఈ నిర్ణయంతో వేలకొద్దీ ఉద్యోగాలు సంకటస్థితిలో పడడంతో ప్రధాని కామెరాన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆగమేఘాలపై కార్మికసంఘాలతో చర్చలు జరిపారు. బ్రిటన్‌లోని కంపెనీ ప్లాంట్లలో పనిచేస్తున్న 17 వేల మందికి ఉద్యోగ భద్రత కల్పించడానికి ఉన్న అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం మాట ఇచ్చింది. వేల్స్, బ్రిటన్ ప్రభుత్వాలు రెండూ కలిసి బ్రిటిష్ ఉక్కు పరిశ్రమను నిలబెట్టడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తామని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
కాగా అంతర్జాతీయంగా సరఫరా ఎక్కువ కావడం, చైనా నుంచి ఐరోపాకు చౌక ఎగుమతులు పెరగడం, తయారీవ్యయాలు అధికం కావడం, దేశీయ మార్కెట్లో గిరాకీ క్షీణత కొనసాగడం, కరెన్సీ ఊగిసలాటలు ఇవన్నీ కంపెనీకి ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఉద్యోగాల్లో కోత, ఆస్తులు విక్రయం, ఆధునికీకరణ లాంటివేవీ కంపెనీని లాభాల్లోకి తీసుకురాలేకపోయాయి. గత ఏడాది చివరికి కంపెనీ ఐరోపా వ్యాపారం 68 మిలియన్ పౌండ్ల నష్టాన్ని నమోదుచేసింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఇది రెట్టింపు నష్టం. దీనికి తోడు గత నెలలో టాటా స్టీల్ యూరోప్ సీఈఓ కార్ల్ కోహ్లర్ రాజీనామా తీవ్ర ప్రభావాన్ని చూపింది. అటు యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ ఉండాలా వద్దా అని నిర్ణయించడానికి జూన్‌లో రెఫరెండమ్ నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అంతకుముందు తాత్కాలికంగా టాటా స్టీల్ యూరోప్‌ను జాతీయకరణ చేయడం సహా పలు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని సంస్థ బిజినెస్ సెక్రటరీ సాజిద్ జావిద్ వ్యతిరేకించారు కూడా.